2009లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి షాదీఖానాకు శంకుస్థాపన చేసినప్పటి శిలాఫలకం
సాక్షి, ఒంగోలు సిటీ : మీ ఊరికి ఎంత దూరమో .. మా ఊరికి అంతే దూరం అన్న లోకోక్తిని మరో మారు జనం ముందుకు తెస్తున్నారు అధికార పార్టీ నేతలు. ఎప్పుడో శంకుస్థాపన చేసిన షాదీఖానా నిర్మాణం పనులను పూర్తి చేసి ప్రజలకు అంకితం చేయడం అందరూ హర్షించదగ్గదే. అయితే శంకుస్థాపన చేసిన పూర్వ నాయకుల పేర్లను మారడమే విమర్శలకు తావిచ్చింది. దివంగత నేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి అభిమానుల్లో ఈ వ్యవహారం తీవ్ర చర్చనీయాంశమైంది. ఒంగోలు నగరంలోని కొత్త మార్కెట్ వద్ద షాదీఖానా ప్రారంభం సందర్భంగా వేసిన శిలాఫలకం వైఎస్సార్ అభిమానులు కలత చెందేలా చేసింది. అధికార పార్టీ నేతలు అడ్డగోలుగా పాత శిలాఫలకాన్ని మాయం చేసి, కొత్తగా దామచర్ల జనార్దన్ ప్రారంభకులుగా వేసిన శిలాఫలకం చర్చలకు దారి తీసింది. తిలాపాపం తలా పిడికెడు అన్నట్లుగా ఈ వ్యవహారంలో సంబంధిత అధికారులు విమర్శలను మూట గట్టుకున్నారు.
పాత ఫలకాన్ని తొలగించి రాత్రికి రాత్రే కొత్త ఫలకం ఏర్పాటు
అసలు జరిగింది ఇది
ఒంగోలు కొత్త కూరగాయల మార్కెట్ వద్ద షాదీఖానా, ఉర్ధూఘర్ నిర్మించాలని ఆ సామాజికవర్గానికి చెందిన వారి నుంచి డిమాండ్ ఉంది. ఈ నేపథ్యంలోనే అప్పటి ప్రభుత్వంలో రాష్ట్ర గనుల శాఖ మంత్రిగా ఉన్న బాలినేని శ్రీనివాసరెడ్డి వద్దకు షాదీఖానా కోసం వినతులు వచ్చాయి. ఆయనకు వైఎస్సార్ వద్ద ఉన్న పలుకుబడిని ఉపయోగించి ఒంగోలు పర్యటన సందర్భంగా శంకుస్థాపన చేయించి పనులు వెంటనే మొదలు పెట్టించడానికి ప్రత్యేకంగా చర్యలు తీసుకున్నారు. బాలినేని చొరవతో వైఎస్ రాజశేఖర్‌రెడ్డి రూ. కోటి నిధులను మంజూరు చేశారు. ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ విభాగం అధికారులకు ఈ పని అప్పగించారు. వెంటనే ఉత్తర్వులను జారీ చేశారు.
ఎండబ్ల్యూడీ గ్రాంటు నుంచి షాదీఖానాకు నిధులు కేటాయించారు. సీఎం హోదాలో రాజశేఖర్‌రెడ్డి ఒంగోలు పర్యటనకు వస్తున్న నేపథ్యంలో ఒంగోలుకు మంజూరైన షాదీఖానా, ఉర్ధూఘర్ నిర్మాణాలకు ఆయన చేతుల మీదుగా శంకుస్థాపన చేయించారు. కార్యక్రమానికి కేంద్ర మంత్రి పురందేశ్వరి, మంత్రి మోపిదేవి వెంకటరమణ, కలెక్టర్ దేవానంద్ ప్రముఖులు హాజరయ్యారు. ఎంతో అట్టహాసంగా ఈ శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. అయితే అనంతరం జరిగిన ప్రభుత్వం మార్పు, రాష్ట్ర విభజన ఇతర అంశాలు తోడై షాదీఖానా నిర్మాణంలో జాప్యం జరిగింది. ప్రజల హృదయాల్లో సుస్థిర స్థానం సాధించిన దివంగత వైఎస్సార్ వేసిన పేరు లేకుండా కొత్త శిలాఫలకం వేయడంతో అభిమానుల విమర్శలకు దారి తీసింది.
టీడీపీ ఇదో తరహా రాజకీయం?
నగరంలోని కొత్త మార్కెట్ వద్ద అధికార పార్టీ నేతలు బుధవారం నియోజకవర్గం పరిధిలో పూర్తయిన పలు పనులను ప్రారంభించే క్రమంలోనే షాదీఖానాను కూడా ప్రారంభించే కార్యక్రమం చేపట్టారు. ఇక్కడే అసలు రాజకీయం చోటు చేసుకుందని వైఎస్సార్ అభిమానులు వాపోతున్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ పేరుతో ఉన్న శిలాఫలకాన్ని మాయం చేశారన్న అపవాదును అధికార పార్టీ నేతలతో పాటు జిల్లా అధికారులు మూటగట్టుకున్నారు. షాదీఖానా ప్రారంభోత్సవాన్ని వ్యతిరేకించడం లేదు. తమ నాయకుని పేరును శాశ్వతంగా భవనంపై లేకుండా చేశారని బాధపడుతున్నారు. త్వరలో రానున్న ఎన్నికల నేపథ్యంలో టీడీపీ ఈ తరహా రాజకీయం చేసిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
ఇంత అన్యాయమా?
అధికారికంగా వేసిన ఆహ్వానం పత్రికల్లోనూ ‘తాత శంకుస్థాపన–మనవడి ప్రారంభోత్సవం’ అంటూ ముద్రించిన పత్రికలోని వివరాలు చూసిన అభిమానులు ఇంత అన్యాయమా అంటూ ముక్కున వేలేసుకున్నారు. పత్రికలో, కొత్త శిలాఫలకంలో కలెక్టర్ వినయ్‌చంద్, ఇతర అధికారులు, మంత్రులు, ప్రజా ప్రతినిధుల పేర్లను వేయడం గమనార్హం.
షాదీఖానా ప్రారంభం సందర్భంగా వేసిన కొత్త శిలాఫలకం
న్యాయం కోరతామంటున్న వైఎస్సార్ సీపీ నేతలు
వైఎస్సార్ శంకుస్థాపన చేసిన శిలాఫలకాన్ని తొలగించి, రాత్రికి రాత్రే మాయం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని నగర అధ్యక్షుడు శింగరాజు వెంకట్రావు అధికారులను కలిసి వినతి పత్రం ఇవ్వనున్నామని తెలిపారు. అధికారుల దృష్టికి ఈ వ్యవహారాన్ని తీసుకెళ్లి న్యాయం కోరతామని, పాత శిలాఫలకాన్ని సంబంధిత అధికారులు ఏం చేశారో సమాచారం ఇవ్వమని కోరతామన్నారు. ఇక్కడ తగిన స్పందన రాని పక్షంలో న్యాయం కోసం తగిన చర్యలు తీసుకుంటామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment