
ఎవరి పాలనలో అన్ని వర్గాలవారికీ సమాన న్యాయం జరిగిందో... ఎవరి చల్లని చూపుతో జిల్లాలో ప్రగతి రథం పరుగులు తీసిందో... ఎవరి పట్టుదలతో జలయజ్ఞం విజయవంతమైందో... ఎవరి చిత్తశుద్ధితో నిరుపేదల్లో విద్యాకుసుమాలు విరబూశాయో... ఎవరి ఆశయంతో జిల్లాలో ప్రజారోగ్యం పరిఢవిల్లిందో... ఎవరి ప్రభావంతో విద్యారంగం విలసిల్లిందో... ఆ మహానేత నేడు మన మధ్య లేకున్నా.. ఆయన జ్ఞాపకాలు మన మదిలో చెరగని ముద్ర వేసుకున్నాయి. వైఎస్‌ఆర్.. ఆ మూడక్షరాలు తెలుగువారి గుండెల్లో ఎప్పటికీ ఓ మధురానుభూతిని కలిగిస్తూనే ఉంటాయి. ఆయన చేపట్టిన అభివృద్ధి ఫలాలు నేటి తరానికి వెలుగులు విరజిమ్ముతున్నాయి.
సాక్షి ప్రతినిధి, విజయనగరం: జిల్లాలో ఏమైనా అభివృద్ధి జరిగిందంటే అది ఒక్క వైఎస్ హయాంలోనే అని ఎవరినడిగినా చెబుతారు. విద్యాసంస్థలు, సాగునీటి ప్రాజెక్టులు, ఆస్పత్రులు ఒకటేమిటి శాశ్వత ప్రయోజనాలు చేకూర్చే ఎన్నో పథకాలను ఆయన జిల్లాలో అమలు చేశారు. నాడు ఆయన వేసిన బాటలు నేడు ప్రగతి పథంలో పయనించేందుకు దోహదపడుతున్నాయి. ఆదివారం వైఎస్‌ఆర్ వర్థంతి. ఆయన గతించి తొమ్మిదేళ్లయినా ఆయన మనందరిలోనూ చెరగని ముద్ర వేశారంటే ఆయన పాలనాదక్షత ఎంతటితో వేరే చెప్పనవసరం లేదు. ఆ మహానేత మరణాన్ని జీర్ణించుకోలేని 17 మంది జిల్లాలో తనువు చాలించారంటే ఆయనపై ఎంతగా అభిమానం పెంచుకున్నారో అర్థమవుతుంది. ఆనాడు ఉబికిన కన్నీటి ఉప్పెన తడి నేటికీ ఆరలేదు. తన తండ్రిపై అంతటి ప్రేమాభిమానాలను పెంచుకున్న కుటుంబాలను వైఎస్ తనయుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి 2011, మార్చి, మే నెలాఖరులో స్వయంగా కలిశారు. వారిని ఓదార్చారు. వారికి పెద్దకొడుకునవుతానని భరోసానిచ్చారు.
వాడవాడలా నాడు అభివృద్ధి జాడలు...
వైఎస్సార్ హయాంలో వాడవాడలా అభివృద్ధి కార్యక్రమాలు చోటు చేసుకున్నాయి. తరతమ భేదం లేకుండా ప్రతిఒక్కరికీ సంక్షేమ పథకం అందింది. అందుకే అంతా ఆయన్ను దేవునిలాకొలిచారు. ఏ నియోజకవర్గం చూసినా ఆయన అభివృద్ధి జాడలు మనకు కనిపిస్తాయి. కానీ ఆయన మరణానంతరం అర్ధంతరంగా నిలిచిపోయిన పనులు పూర్తి చేసిన దాఖలాలు కానరాకపోవడంతో జనం అవస్థలు మళ్లీ మొదలయ్యాయి. ప్రాజెక్టులు పూర్తి చేసినా.. కాలువల నిర్మా ణం ఊపందుకోలేదు. విద్యాసంస్థలు మంజూరు చేసినా కాలానుగుణంగా అభివృద్ధి చేయలేదు. ఇవన్నీ జనం మనసులను ఇప్పటికీ కలచివేస్తున్న అంశాలే.
► బొబ్బిలి నియోజకవర్గంలో రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో బొబ్బిలి, తెర్లాం, బాడంగి మండలాలను కలుపుకుంటూ ఏర్పాటైన తోటపల్లి సాగునీటి కాలువ ఏర్పాటైంది. కానీ ఆయన మరణానంతరం అర్ధంతరంగా నిలిచిపోయింది.
► శృంగవరపుకోట నియోజకవర్గం వేపాడ మండలంలో విజయరామసాగర్‌ను మినీ రిజర్వాయర్‌గా తీర్చిదిద్దేందుకు శ్రీకారం చుట్టడమే గాకుండా నిధులు కూడా కొంతమేర సమకూర్చారు. ఖాయిలా పడ్డ భీమసింగి చక్కెర కర్మాగారాన్ని తెరిపించి చెరకురైతులకు తీపి జీవితాన్ని పంచారు.
► చీపురుపల్లి నియోజకవర్గంలో ఆయన హయాంలో రూ. 84 కోట్లతో రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఇందిరమ్మ, సుజలధార తాగునీటి పథకాన్ని అమలు చేశారు. చీపురుపల్లిలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల, ప్రభుత్వ పాలిటెక్నికల్ కళాశాల, టీటీడీ కల్యాణ మండపాలు నిర్మించారు. నియోజకవర్గంలోని అన్ని గ్రామాలకు తాగునీటి సౌకర్యాలు కల్పించి, తోటపల్లి కాలువ పనులకు కూడా అంకురార్పణ చేశారు. ఇప్పుడది కుంటినడక నడుస్తోంది.
► సాలూరు నియోజకవర్గంలోని సాలూరు, మెంటాడ, పాచిపెంట మండలాల్లో విరివిగా రహదారుల నిర్మాణం జరిగింది. మక్కువ మండలంలో సురాపాడు ప్రాజెక్టు నిర్మాణం జరిగింది.
► కురుపాం నియోజకవర్గంలోని తోటపల్లి రిజర్వాయర్ నిర్మాణం 90శాతం రాజశేఖరరెడ్డి హయాంలోనే జరిగింది. దీంతో లక్షలాది ఎకరాలకు సాగునీరు అందుతోంది. కొమరాడ మండలంలో జంఝావతి రబ్బర్ డ్యామ్ నిర్మాణానికి నాంది పలికారు. దేశంలోనే మొట్టమొదటి రబ్బర్‌డ్యామ్‌గా అది పేరుగాంచింది. కాని దాని కాలువల నిర్మాణంలోనే ఇంకా నిర్లక్ష్యం కొనసాగుతోంది.
► పార్వతీపురం నియోజకవర్గంలో పార్వతీపురం మండలం అడారిగెడ్డ నిర్మాణానికి రాజశేఖరరెడ్డి హయాంలోనే నిధుల కేటాయింపు జరిగింది. కానీ ఇప్పుడు పనులు పడకేశాయి.
► గజపతినగరం నియోజకవర్గంలో మహానేత హయాంలోనే తోటపల్లి చానల్ ద్వారా సుమారు 3వేల ఎకరాలకు సాగునీరందించాలని పైలాన్ ప్రారంభించారు. ఆయన మరణంతో అది అలానే ఉండిపోయింది. పర్యాటక కేంద్రమైన తాటిపూడి ఆయన హయాంలోనే అభివృద్ధి చెందింది.
► విజయనగరంలో జిల్లా యువజనులకు వివిధ పథకాలపై శిక్షణలు, అవగాహనల కోసం భవనం లేక ఇబ్బందులు పడుతున్న సమయంలో కలెక్టరేట్ దగ్గరలోని కనపాకలో యూత్ హాస్టల్ భవనాన్ని నిర్మించారు. అలాగే పట్టణానికి తాగునీటి కోసం నిర్మించతలపెట్టిన తారకరామతీర్థసాగర్‌కు బడ్జెట్ కేటాయించారు.
► నెల్లిమర్ల నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో గల పంట పొలాలకు సాగునీటిని అందించేందుకు తారకరామతీర్థసాగర్ ప్రాజెక్టు నిర్మాణం ప్రారంభించారు. దీని కోసం 2007లోనే సుమా రు రూ. 187 కోట్లు విడుదల చేశారు. నెల్లిమర్ల, డెంకాడ, పూసపాటిరేగ, భోగాపురం మండలాలకు చెందిన 16వేల మంది అర్హులకు సామాజిక పింఛన్లు, సొంతగూడు లేని 15వేల మంది నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరయ్యాయి. ప్రతి గ్రామానికి సీసీ రోడ్లు, డ్రై యిన్‌లకు నిర్మాణానికి నిధులు విడుదలయ్యాయి. నెల్లిమర్ల పట్ట ణంతో పాటు గుర్ల, గరివిడి మండలాలకు తాగునీటిని అందించేందుకు రామతీర్థం మంచినీటి పథకాన్ని వైఎస్ ప్రారంభించారు.