ఆరేళ్లకే నూరేళ్లు...
Published Thu, Nov 28 2013 3:06 AM | Last Updated on Tue, Oct 16 2018 4:50 PM
చీపురుపల్లి రూరల్, న్యూస్‌లైన్: పుట్టుకతోనే మానసిక వికలాంగుడైనా అందరిలానే చదివించి తమ కుమారుడిని ప్రయోజకుడిని చేయాలని తలంచిన ఆ తల్లిదండ్రుల ఆశలు ఆవిరైపోయాయి. స్కూల్ బస్సు రూపంలో వారి ఆశను మృత్యువు చిదిమేసింది. దాసరెడ్డి సాయిమురారి (6) అనే మానసిక వికలాంగ విద్యార్థి.. తాను చదువుతున్న స్కూల్ బస్సు కింద పడి దుర్మరణం చెందాడు. ఈ సంఘటన బుధవారం
గరివిడి పట్టణంలో గల పాఠశాల ఆవరణలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... గరివిడి మండలం దువ్వాం పంచాయతీ డీఎఫ్‌ఎన్‌లో నివాసముంటున్న శ్రీనివాసరావు, గంగాభవానీ దంపతులకు ముగ్గురు పిల్లలు. రెండో కుమారుడైన సాయి మురారి మానసిక వికలాంగుడు. మాట్లాడలేడు.. ఎవరైనా చెప్పింది విని, అర్థం చేసుకోలేడు. తన లోకంలో తాను ఉంటాడు.
అందరి పిల్లల్లానే తమ కుమారుడినీ బాగా చదివించి ప్రయోజకుడిని చేద్దామని భావించిన ఆ తల్లిదండ్రులు... గరివిడి పట్టణంలోని ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ సెంటర్‌లో చేర్చారు. ప్రస్తుతం సాయిమురారి ఒకటో తరగతి చదువు తున్నాడు. రోజూ స్కూల్ బస్సులో పాఠశాలకు వెళ్లి వస్తుంటాడు. ఎప్పటిలాగానే బుధవారం కూడా స్కూల్‌కు వెళ్లాడు. మధ్యాహ్నం స్కూల్ విడిచిపెట్టిన తరువాత బస్సు వెనుక నిల్చొన్నాడు. గమనించని డ్రైవర్.. బస్సును తీయడంతో వెనుక చక్రాల కింద పడి సాయిమురారి నుజ్జునుజ్జయిపోయాడు. సంఘటన స్థలంలోనే గిలగిలాకొట్టుకుంటూ ప్రాణాలు వదిలాడు. డ్రైవర్ బస్సును తీసే సమయంలో విద్యార్థి దాని కిందకు వెళ్లి ఉంటాడని స్థానికులు భావిస్తున్నారు. ఆ సమయంలో డ్రైవర్ గమనించకపోవడంతో ప్రమాదం జరిగి ఉంటుందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. స్కూల్ యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే తమ బిడ్డ ప్రాణాలు కోల్పోయాడని విద్యార్థి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. వారి ఫిర్యాదు మేరకు ఎస్సై క్రాంతికుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Advertisement
Advertisement