హైదరాబాద్: బీఆర్ అంబేద్కర్ ఆలోచన విధానాలకు తూట్లు పొడుస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు... అంబేద్కర్ విగ్రహాన్ని పెడతానడం హాస్యాస్పదంగా ఉందని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు మేరుగ నాగార్జున ధ్వజమెత్తారు. సొంత మామనే మోసం చేసి, పాతాళానికి తొక్కేసిన వ్యక్తి విగ్రహాలు పెడితే అంబేద్కర్ ఆత్మ క్షోభిస్తుందన్నారు.
అంబేద్కర్ ఆశయ సాధనలో అణువణువు పరితపించిన ఏకైక ముఖ్యమంత్రి దివంగత రాజశేఖర్ రెడ్డి మాత్రమేనని గుర్తు చేశారు. అంబేద్కర్ భావజాలాన్ని విస్తరించాలనే కాంక్ష వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మాత్రమే ఉందన్నారు. చరిత్రను మరచిపోయిన వాడు చరిత్ర సృష్టించలేడని చెప్పిన అంబేద్కర్ మాటలను చంద్రబాబు ఒక్కసారి గుర్తు చేసుకోవాలని సూచించారు.
వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. దళితుల్లో ఎవరు పుడతారని అవహేళన చేసిన వ్యక్తి చంద్రబాబని, ఈ మాటలతో మైలపడ్డ ఆయన ముందుగా తనకు తను ప్రక్షాళన చేసుకోవాలని కోరారు. అంబేద్కర్ ఊరు నుంచి తెచ్చిన మట్టితో తొలుత స్నానం చేసి, ఆ తర్వాత అంబేద్కర్ పాదాల చెంత తప్పును ఒప్పుకుని ఉంటే చంద్రబాబుకు కొంతైనా పాప ప్రక్షాళన జరిగి ఉండేదన్నారు. తన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కాల్‌మనీ కేసుల్లో అప్రదిష్ట పాలవ్వడంతో, దీన్ని పక్కదారి పట్టించేందుకు ఏడాది క్రితం 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని పెడతానని అసెంబ్లీలో ప్రకటన చేశారని నాగార్జున ఆరోపించారు.
ఏడాది తర్వాత శంకుస్థాపన చేయడం విడ్డూరంగా ఉందన్నారు. శాశ్వత అసెంబ్లీ, సచివాలయ నిర్మాణాల ప్రాంతంలో విగ్రహాన్ని పెడతామని చెప్పి, ఊరికి దూరంగా పెట్టడంలోనే అంబేద్కర్‌పై ఈ ప్రభుత్వానికి ఉన్న గౌరవం ఏమిటో అర్థం చేసుకోవచ్చన్నారు. బీసీలంటే బాబుగారి క్లాస్ అని, ఎస్సీలంటే సేమ్ క్లాసంటూ కొత్త భాష్యాలు చెబుతున్న చంద్రబాబు పాలనలో బడుగులకు ఒరిగిందేమీ లేదన్నారు.