
మొదటి దశలో విజయవాడకే: శ్రీధరన్
ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతంగా ప్రభుత్వం ప్రకటించిన కృష్ణా జిల్లా విజయవాడ నగరంలో రెండు కారిడార్లతో తొలి దశ మెట్రో రైలు ప్రాజెక్టు
సాక్షి, విజయవాడ బ్యూరో: ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతంగా ప్రభుత్వం ప్రకటించిన కృష్ణా జిల్లా విజయవాడ నగరంలో రెండు కారిడార్లతో తొలి దశ మెట్రో రైలు ప్రాజెక్టు నిర్మాణానికి అనువైన పరిస్థితులు ఉన్నాయని రాష్ట్ర ప్రభుత్వ మెట్రో రైలు ప్రాజెక్టుల ముఖ్య సలహాదారు ఇ.శ్రీధరన్ పేర్కొన్నారు. బందరు రోడ్డులోని పండిట్ నెహ్రూ బస్టాండ్ నుంచి కానూరు ఇంజనీరింగ్ కాలేజీ వరకూ 13 కిలోమీటర్ల మేర మొదటి కారిడార్, బస్టాండ్ నుంచి రైల్వే స్టేషన్ మీదుగా ఏలూరు రోడ్డు నుంచి రామవరప్పాడు, ఐదో నంబరు జాతీయ రహదారికి లింకు కలుపుతూ 12, 13 కిలోమీటర్ల మేర రెండో కారిడార్ నిర్మాణానికి అవకాశం ఉందని తెలిపారు.
భారీ ట్రాఫిక్, ఇరుకు రోడ్లను దృష్టిలో ఉంచుకుని ఈ రెండు కారిడార్లను ఎంపిక చేశామని వివరించారు. ప్రస్తుత పరిస్థితుల్లో గుంటూరుకు మెట్రో రైలును విస్తరించాల్సిన అవసరం లేదన్నారు. ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ అధికారుల బృందంతో కలసి శనివారం విజయవాడకు వచ్చిన ఆయన ప్రతిపాదిత మెట్రో ప్రాంతాలను పరిశీలించారు. సాయంత్రం వీజీటీఎం ఉడా కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. మెట్రో రైలు నిర్మాణానికి సాధ్యాసాధ్యాలు, అవసరమైన మౌలిక సౌకర్యాలు, ఖర్చు అంశాలతో డీపీఆర్ (డిటెయిల్డ్ ప్రాజెక్టు రిపోర్టు)ను జనవరి నెలాఖరుకు రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పిస్తామని శ్రీధరన్ చెప్పారు.మెట్రో రైలు ప్రాజెక్టు ఎక్కువ ఖర్చుతో కూడుకున్నదని, కిలోమీటరుకు రూ. 240 కోట్లు ఖర్చవుతుందని శ్రీధరన్ చెప్పారు.