
సాక్షి, విశాఖపట్నం: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకు విశాఖలో మరోసారి చేదు అనుభవం ఎదురైంది. గురువారం భీమిలిలో జరిగిన సభలో చంద్రబాబు ప్రసగిస్తుండగా మధ్యాహ్న భోజన పథక మహిళలు నిరసన తెలిపారు. ప్రభుత్వమే ఈ పథకాన్ని కొనసాగించాలని డిమాండ్ చేశారు. మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రైవేటుపరం చేయవద్దని మహిళలు నినదించారు. టీడీపీ కార్యకర్తలు వారించిన కూడా వారు పట్టించుకోలేదు. ముఖ్యమంత్రి కూర్చొవాలని చెప్పిన కూడా లెక్కచేయకుండా తమ ఆవేదనను వ్యక్తం చేశారు. పోలీసులు వారించిన కూడా వినకుండా తాము పడుతున్న కష్టాలను ఫ్లకార్డుల రూపంలో ప్రదర్శించారు.
సీఎం సభలో ఖాళీగా కుర్చీలు..
ఆత్మీయ సదస్సు పేరిట ఏర్పాటు చేసిన ఈ సభకు జనాలు హాజరు కాలేదు. సభకు జనాలను తరలించేందుకు టీటీడీ నాయకులు విశ్వ ప్రయత్నాలు చేశారు. మైకుల్లో పదే పదే ప్రకటనలు ఇప్పించారు. ఆర్టీసీ బస్సులో జనాలను తరలించే ప్రయత్నం చేశారు. దీంతో నగరవాసులు సీటీ బస్సులు అందుబాటులో లేక తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సీఎం ప్రసంగిస్తున్న సమయంలో కుర్చీలు ఖాళీగా కనిపించాయి. సొంత పార్టీ ఎమ్మెల్యేలు సైతం సీఎం సభకు దూరంగా ఉన్నట్టు తెలుస్తుంది.