కోల్‌సిటీ, న్యూస్‌లైన్ : గోదావరిఖనిలో శిశు మరణాలు ఆగడం లేదు. వరుస సంఘటనలతో బంధువులు ఆందోళన చెందుతున్నారు. మాతాశిశు మరణాల నివారణకు ప్రభుత్వం ఎన్ని కోట్లు ఖర్చుపెడుతున్నా ఫలితం రావడం లేదు. రికార్డుస్థాయిలో ప్రసావాలు జరుగుతున్న స్థానిక ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో నాలుగు రోజులుగా శిశువులు కడుపులోనే మృతి చెందుతున్న తీరు ఆందోళన కల్గిస్తోంది. బుధవారం ఆస్పత్రిలో మరో శిశువు మృతి చెందడంతో కుటుంబ సభ్యులు, బంధువులు రోదనలు మిన్నంటాయి.
మంథని మండలంలోని కాకర్లపల్లికి చెందిన పైడాకుల సంపత్, స్వరూప(22) దంపతులు. స్వరూప రెండోసారి గర్భందాల్చడంతో ‘ఖని’ శారదానగర్‌లోని ప్రభుత్వాస్పత్రిలో ప్రతి నెల వైద్య పరీక్షలు చేయించుకున్నారు. కడుపునొప్పిగా ఉందనడంతో బుధవారం ఉదయం 10.30 గంటలకు ప్రభుత్వాస్పత్రికి తీసుకొచ్చారు. సాయంత్రం వరకు స్వరూపను పట్టించుకోని వైద్యులు, పరిస్థితి విషమంగా ఉందని థియేటర్‌లోకి తీసుకుపోయారని భర్త సంపత్ తెలిపారు. ఉదయం కడుపులో బిడ్డ మంచిగానే ఉందని చెప్పి, బిడ్డ గుండె కొట్టుకోవడం లేదని చనిపోయిన మగ బిడ్డను చేతిలో పెట్టారని రోదించాడు. థియేటర్‌లోకి వచ్చేటప్పటికే కడుపులో శిశువు చనిపోయి ఉందని, కుటుంబ సభ్యులకు చెప్పిన తర్వాతనే ఆపరేషన్ చేశామని వైద్యులు వెల్లడిస్తున్నారు.
వరుస సంఘటనలు..
గోదావరిఖనిలో నాలుగు రోజులుగా వరుసగా కడుపులోనే శిశువులు మృతి చెందుతున్న తీరు ఆందోళనకు గురి చేస్తోంది. వైద్యుల పర్యవేక్షణలోపమా..? ఇతర కారణాలేమైనా ఉన్నాయా..? అనే విషయాలు తెలియక గర్భిణులు, వారి కటుంబ సభ్యులు అయోమయానికి గురవుతున్నారు. స్థానిక కళ్యాణ్‌నగర్‌లోని ఓ నర్సింగ్ హోమ్‌లో చికిత్స పొందుతున్న స్థానిక చంద్రబాబుకాలనీకి చెందిన పోగుల ప్రమీళ కడుపులోనూ ఆరునెలల శిశువు మృతి చెందాడు. శారదానగర్‌లోని ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో మంథని మండలానికి చెందిన కీరా అనే గర్భిణీకి ఆది వారం ఆపరేషన్ చేయగా కడుపులో శిశువు మృతి చెంది ఉంది.
మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా ఆల్లపల్లికి చెందిన ఆవుల నాగలక్ష్మి కూడా ఇదే ఆస్పత్రిలో సోమవారం అర్ధరాత్రి ప్రసవం కోసం చేరగా, మంగళవారం క డుపులోనే మరణించిన శిశువుకు జన్మనిచ్చింది. కమాన్‌పూర్ మండ లం రొప్పికుంటకు చెందిన శ్యామల కూడా మంగళవారం ప్రభుత్వాస్పత్రికి ప్రసవం కోసం వచ్చింది. పరీక్షించిన వైద్యులు కడుపులో శిశువు మృతి చెందిందని కరీంనగర్‌కు రెఫర్ చేశారు. కుటుంబ సభ్యుల విజ్ఞప్తి మేరకు తిరిగి ఆస్పత్రిలో చేర్చుకున్నప్పటికీ, ఆందోళనతో బుధవారం వారు మరో ఆస్పత్రికి వెళ్లిపోయారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి శిశు మరణాల నివారణకు క్షేత్రస్థాయిలో చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.
‘ఖని’లో ఆగని శిశు మరణాలు
Published Thu, Oct 17 2013 4:46 AM | Last Updated on Fri, Sep 1 2017 11:41 PM
Advertisement
Advertisement