ఇంటివద్ద చికిత్స పొందుతున్న రాజవ్వ
సాక్షి, గంగాధర(కరీంనగర్): కుటుంబం గడవడానికి ఉపాధి కూలీకి వెళ్లిన మహిళ గాయపడగా చికిత్సకోసం ఉన్న ఆస్తిని అమ్ముకున్నా గాయం మానని సంఘటన గంగాధర మండలం బూర్గుపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని బొమ్మకంటిపల్లిలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన బొమ్మకంటి రాజవ్వ, లింగయ్య దంపతులు గ్రామంలో ఉపాధి పనులకు వెళ్తారు. గతనెలలో ఉపాధి పనులు చేస్తుండగా కాలివేలికి పార తగిలింది. తెల్లారి జ్వరం రావడంతో పనికి మానేసింది.
కాలి గాయం ఎక్కువ కావడంతో కరీంనగర్ ప్రయివేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు. వేలికి ఇన్‌ఫెక్షన్ అయిందని ఖర్చులు ఎక్కువ అవుతాయని చెప్పడంతో ఉన్న 13 గుంటల భూమి అమ్మి వైద్యానికి ఖర్చు చేసినట్లు బాధితురాలి భర్త లింగయ్య ఆవేదన వ్యక్తం చేశాడు. ఉపాధి పనులకు వెళ్లిన డబ్బు ఇంకా రాలేదన్నాడు. రాజవ్వను వారంక్రితం ఇంటికి తీసుకువచ్చి ఇక్కడే ఆర్‌ఎంపీల వద్ద వైద్యం చేయిస్తున్నానని, శరీరమంతా పాయిజన్ అయిందంటున్నారని ప్రభుత్వ అధికారులు ఆదుకోవాలని లింగయ్య వేడుకుంటున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment