
గ్రామ సచివాలయ ఉద్యోగాలల్లో ఎలాంటి రాజకీయ జోక్యం, లాబీయింగులు ఉండవని స్పష్టం చేశారు.
సాక్షి, విజయవాడ : తన రాజకీయ జీవితంలో ఇంత భారీ స్థాయిలో ఉద్యోగ నియామకాలు చూడలేదని ఆంధ్రప్రదేశ్ పట్టణాభివృద్ధి, పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. గ్రామ సచివాలయాలు, వలంటీర్ల వ్యవస్థ ద్వారా 4 లక్షల 50 వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నామని తెలిపారు. తుమ్మలపల్లి కళాక్షేత్రం లో వార్డు వలంటీర్ల శిక్షణా కార్యక్రమంలో పాల్గొన్న బొత్స మాట్లాడుతూ... తన సుదీర్ఘ పాదయాత్రలో ప్రజల కష్టాలను స్వయంగా చూసిన వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి.. వారి కష్టాలను దూరం చేసేందుకు వ్యవస్థల్ని ప్రక్షాళన చేయాలన్న ఉద్దేశంతోనే గ్రామ సచివాలయాలు, వలంటీర్లు వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నారని చెప్పారు.
ప్రభుత్వ పథకాలను క్షేత్ర స్థాయి వరకు తీసుకువెళ్లేందుకు గ్రామ వలంటీర్లు వ్యవస్థ ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా ఉండాలని సూచించారు. గ్రామ సచివాలయ ఉద్యోగాలల్లో ఎలాంటి రాజకీయ జోక్యం, లాబీయింగులు ఉండవని స్పష్టం చేశారు. పరీక్ష నిర్వహించి ప్రతిభావంతుల్ని ఆ పోస్టుల్లో భర్తీ చేస్తున్నామన్నారు. పరిపాలనా విధానంలో భాగంగానే ఈ వ్యవస్థను తీసుకొస్తున్నామని తెలిపారు. గ్రామ వలంటీర్లు చిత్త శుద్ధితో పనిచేయాలని కోరారు. కార్యక్రమంలో దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యే మల్లాది విష్ణు, ఇతర అధికారులు పాల్గొన్నారు.