సాక్షి, శ్రీకాకుళం: ఈఎస్‌ఐ స్కాంలో టీడీపీ ఎమ్మెల్యే కింజరపు అచ్చెన్నాయుడును అరెస్ట్ చేస్తే కిడ్నాప్ అంటూ ప్రతిపక్ష నేత చంద్రబాబు వక్రీకరిస్తున్నారని రాష్ట్ర రహదారులు,భవనాల శాఖ మంత్రి ధర్మాన కృష్ణదాస్ మండిపడ్డారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ నేరం జరిగినప్పుడు అరెస్ట్ సర్వసాధారణం అన్నారు. చంద్రబాబు,లోకేష్ వ్యాఖ్యలు దురదృష్టకరమని, తప్పు చేసిన వ్యక్తిని వదిలేసి బీసీలకు ఆపాదిస్తున్నారని ధ్వజమెత్తారు. గతంలో బీసీ ఓట్లతో గెలిచిన చంద్రబాబు.. వారిని గాలికొదిలేశారన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బీసీలకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నారని పేర్కొన్నారు. తప్పు ఎవరు చేసినా శిక్ష తప్పదని మంత్రి కృష్ణదాస్ స్పష్టం చేశారు. (టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు అరెస్ట్)
అక్రమాలకు పాల్పడ్డారు: మంత్రి కన్నబాబు
కాకినాడ: ఈఎస్‌ఐలో అవినీతి జరిగినట్లు విజిలెన్స్ నివేదిక వచ్చిందని.. ఆ స్కాంలో అచ్చెన్నాయుడుకు ప్రమేయం ఉందని వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు తెలిపారు. ఈఎస్‌ఐ స్కాంలో ఆయనను ఏసీబీ అరెస్ట్ చేసిందని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో అచ్చెన్నాయుడు నకిలీ బిల్లులు సృష్టించి పెద్ద ఎత్తున అవినీతి, అక్రమాలకు పాల్పడ్డారని పేర్కొన్నారు.
ఏ ఒక్కరినీ వదిలిపెట్టం: మంత్రి జయరాం
గత ప్రభుత్వ హయాంలో ఈఎస్‌ఐలో భారీ అవినీతి జరిగిందని.. మెడిసిన్ కొనుగోళ్లలో అవినీతికి పాల్పడ్డారని మంత్రి జయరాం తెలిపారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ప్రతి పనిని అనినీతిమయం చేశారన్నారు. అవినీతి కేసులో చంద్రబాబు,లోకేష్ కూడా జైలుకెళ్లక తప్పదన్నారు. అవినీతిలో పాలు పంచుకున్న ఏ ఒక్కరినీ వదిలిపెట్టబోమని మంత్రి జయరాం పేర్కొన్నారు. (అచ్చెన్న అరెస్ట్.. చంద్రబాబు కొత్త డ్రామా)
గత ప్రభుత్వంలో ప్రతి పనిలో అవినీతి జరిగింది..
విశాఖపట్నం: టీడీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతికి అచ్చెన్నాయుడు అరెస్ట్ నిదర్శనమని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే చెట్టి ఫాల్గుణ అన్నారు. గత ప్రభుత్వ హయాంలో ప్రతి పనిలో అవినీతి జరిగిందని ఆయన ధ్వజమెత్తారు. అచ్చెన్నాయుడు చేసిన అవినీతి 150 కోట్ల రూపాయల పైనే ఉంటుందని, ఇందులో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు కూడా వాటా ఉంటుందని ఆరోపించారు. తన నియోజకవర్గంలో పని చేస్తున్న ఒక ఎస్‌సీ మహిళను తన మాట వినలేదని అచ్చెన్నాయుడు సస్పెండ్ చేయించారని, ఆమె పట్ల దురుసుగా ప్రవర్తించారని గుర్తు చేశారు.
చట్టం ముందు అందరూ సమానులే
గుంటూరు: ప్రజాస్వామ్యంలో చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుందని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు ట్వీట్ చేశారు. అచ్చెన్నాయుడు, చంద్రబాబు, లోకేష్.. ఎవరైనా చట్టం ముందు సమానులే అంటూ అంబటి రాంబాబు ట్విటర్‌లో పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment