
విజయమ్మ దీక్షకు మంత్రి గంటా మద్దతు
హైదరాబాద్ : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ ఈనెల 19వ తేదీ నుంచి విజయవాడలో చేపట్టనున్న ఆమరణ దీక్షకు రాష్ట్ర ఓడరేవులు, పెట్టుబడుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు మద్దతు తెలిపారు. రాష్ట్ర విభజన ప్రకటన తర్వాత సీమాంధ్ర ప్రజల్లో ఆగ్రహం పెల్లుబికిందని ఆయన శుక్రవారమిక్కడ అన్నారు. కాంగ్రెస్ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటుందని భావిస్తున్నామని, తాము ఆశాజీవులమని...రాష్ట్రం సమైక్యంగా ఉంటుందని ఆశిస్తున్నట్లు గంటా తెలిపారు.
ఆంటోనీ కమిటీ రాష్ట్రంలో పర్యటించి అభిప్రాయాలు సేకరించాలని గంటా శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. హైదరాబాద్ సహా విశాఖ, విజయవాడ, అనంతపురంలో ఆంటోనీ కమిటీ పర్యటించి వాస్తవాలు తెలుసుకోవాలన్నారు. శనివారం సాయంత్రం అయిదు గంటలకు ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలో సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు సమావేశం కానున్నట్లు గంటా తెలిపారు. అనంతరం భవిష్యత్ కార్యచరణ ప్రకటిస్తామన్నారు. ఏపీ ఎన్జీవోల సమ్మెకు మంత్రి తన మద్దతు తెలిపారు.