సాక్షి, విజయవాడ: ఏపీ ప్రభుత్వం, పురావస్తు శాఖ ఆధ్వర్యంలో విజయవాడ బాపు మ్యూజియంలో ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవ వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు, ఎమ్మెల్యే మల్లాది విష్ణు, పురావస్తు శాఖ కమిషనర్ వాణిమోహన్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి కన్నబాబు మాట్లాడుతూ.. నూతనంగా ఏర్పాటు చేసిన బాపు మ్యూజియాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వచ్చే నెలలో ప్రారంభిస్తారని తెలిపారు. అత్యాధునిక టెక్నాలజీతో ఈ మ్యూజియం ప్రజలకు అందుబాటులో రానుందని చెప్పారు.
ఈ వేడుకల్లో పాల్గొనడం గొప్ప అనుభూతినిచ్చిందన్నారు. పింగళి వెంకయ్య జాతీయ జెండా రూపకల్పన చేసి జాతికి ఇక్కడ నుంచే అందించారని పేర్కొన్నారు. దేశం గర్వించేలా తెలుగు జాతి కీర్తిని పింగళి వెంకయ్య దశదిశలా వ్యాపింప చేశారని కొనియాడారు. పొట్టి శ్రీరాములు ఆత్మార్పణ ఫలితంగా ఈ రాష్ట్రం ఏర్పడిందన్నారు. మన సంస్కృతి, సంప్రదాయాలను భవిష్యత్ తరాలకు అందించాలని పిలుపునిచ్చారు. బ్రిటిష్ కాలంలో ఏర్పాటు చేసిన విక్టోరియా మ్యూజియం అభివృద్ధికి అన్ని విధాల సహకరించి నిధులు మంజూరయ్యేలా కృషి చేస్తామని వెల్లడించారు. ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటుకు కృషి చేసిన త్యాగ ధనుల ప్రాణ త్యాగాలను అందరూ స్మరించుకునేలా ఈ వేడుకలు జరగాలని సీఎం వైఎస్ జగన్ సూచించారని మంత్రి కన్నబాబు తెలిపారు.
గత ప్రభుత్వం అవతరణ దినోత్సవాన్ని పట్టించుకోలేదు..
పొట్టి శ్రీరాములు త్యాగాన్ని స్మరించుకోవాలని సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్ర అవతరణ దినోత్సవానికి శ్రీకారం చుట్టారని ఎమ్మెల్యే మల్లాది విష్ణు తెలిపారు. నవంబర్ 1 అనగానే రాష్ట్ర ప్రజలకు పొట్టి శ్రీరాములు గుర్తుకు వస్తారని చెప్పారు. గత ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పట్టించుకోలేదని విమర్శించారు. సమావేశాల పేరుతో విద్యార్థులను ఎండల్లో కూర్చోపెట్టారని.. నవ నిర్మాణ దీక్షల పేరుతో వేల కోట్లు వృధా చేశారని మండిపడ్డారు. 1921 ఏప్రిల్ 1న విక్టోరియా మ్యూజియంలో జాతీయ జెండా రూపకల్పనకు చర్చలు జరిగాయని గుర్తు చేశారు. పింగళి వెంకయ్య ఈ మ్యూజియంలో తాను రూపొందించిన జాతీయ జెండాను గాంధీకి ఇచ్చారని పేర్కొన్నారు. ఈ మ్యూజియంలో లేజర్ షో కూడా ఏర్పాటు చేస్తామని మల్లాది విష్ణు వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment