సాక్షి, అనంతపురం: ప్రభుత్వ భూములు ఆక్రమించిన టీడీపీ నేతలపై కఠిన చర్యలు తీసుకుంటామని ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ అన్నారు. ఆయన గురువారం మీడియాతో మాట్లాడుతూ.. గత ఐదేళ్లలో టీడీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో సర్కారు భూములు ఆక్రమణలకు గురయ్యాయని పేర్కొన్నారు. అనంతపురం జిల్లాలో చేపట్టిన వివిధ ప్రగతి పనులకు సంబంధించి గురువారం కలెక్టరేట్‌లోని రెవెన్యూ భవన్‌లో మంత్రులు శంకర నారాయణ, శ్రీ రంగనాథరాజుతో కలిసి ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్‌లో ల్యాండ్ ఆడిటింగ్ నిర్వహిస్తామని, భూ క్రయవిక్రయాలు సరళతరం చేస్తామని చెప్పారు. 1983 తర్వాత భూ ప్రక్షాళన జరగలేదని.. భూ సంస్కరణల చట్టాన్ని వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం తెచ్చిందన్నారు. భూ యాజమానుల హక్కులను కాపాడతామని, భూ రిజిస్ట్రేషన్ ప్రక్రియను సులభతరం చేస్తామని వెల్లడించారు.
అర్హులైన వారందరికీ ఇళ్లు కట్టిస్తామని గృహనిర్మాణ శాఖ మంత్రి శ్రీరంగనాథరాజు తెలిపారు. ఇళ్ల నిర్మాణం, బిల్లుల మంజూరుపై ఎప్పటికప్పుడు వివరాలు సేకరిస్తామన్నారు. రీవెరిఫికేషన్ ద్వారా నకిలీ దరఖాస్తులు గుర్తిస్తామని చెప్పారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను పకడ్బందీగా అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వ ఉద్యోగులపై ఉందని ఏపీ బీసీ సంక్షేమ శాఖ మంత్రి శంకర్ నారాయణ స్పష్టం చేశారు. సమీక్షా సమావేశంలో స్థానిక ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment