గుంటూరు యార్డు
కొరిటెపాడు(గుంటూరు): రైతుల సంక్షేమం కోసం వినియోగించాల్సిన నిధులు బ్యాంకుల్లో మూలుగుతున్నాయి. కర్షకులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర వచ్చే వరకూ మార్కెట్ యార్డు గోదాముల్లో నిల్వలు ఉంచుకుంటున్నారు. అవసరమైన రైతులకు పంట నిల్వల ఆధారంగా రైతుబంధు పథకం కింద రుణాలు మంజూరు చేయాలి. కానీ జిల్లాలో ఎక్కడా ఈ విధానం అమలు చేయడం లేదు. రుణాలు అందక రైతులు ప్రైవేటు వడ్డీ వ్యాపారులను ఆశ్రయించి విలవిలలాడుతున్నారు. ఇవేమీ పట్టని పాలకులు నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు.
రైతులకు అవస్థలు
జిల్లా వ్యాప్తంగా ఉన్న 21 మార్కెట్ యార్డుల్లో రైతులు, వ్యాపారుల నుంచి వసూలు చేసిన సెస్, ఇతర మార్గాల నుంచి వచ్చిన వందలాది కోట్ల రూపాయలు బ్యాంకుల్లోనే ఉన్నాయి. రుణమాఫీ అమలుగాక, బ్యాంకుల్లో తాకట్టు పెట్టిన బంగారం ఆభరణాలను వేలం వేస్తున్న తరుణంలో కనీసం రైతు బంధు పథకం కిందనైనా రుణాన్ని మంజూరు చేయాలన్న ఆలోచన రాకపోవడం ఈ ప్రభుత్వానికి రైతుల పట్ల ఉన్న నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది.
గుంటూరు మార్కెట్ యార్డు పరిధిలో రూ.200 కోట్లు
ఆసియా ఖండంలోనే అతిపెద్దది గుర్తింపు తెచ్చుకొన్న గుంటూరు మార్కెట్ యార్డుకు సంబంధించి రూ.200 కోట్లుపైగా బ్యాంకుల్లో మూలుగుతున్నాయి. యార్డు పరిధిలో నాలుగేళ్లుగా ఒక్క రైతుకు కూడా రైతుబంధు పథకం ద్వారా రుణం ఇచ్చిన పాపాన పోలేదు. ఈ యార్డు పరిధిలో వందకుపైగా కోల్డ్ స్టోరేజ్‌లలో రైతులు పంట ఉత్పత్తులు నిల్వ చేసుకుంటున్నారు. నెలల తరబడి పంట అమ్ముకోలేక, పెట్టిన పెట్టుబడులు తిరిగిరాక, వడ్డీలు కట్టలేక రైతులు అల్లాడుతున్నారు. తమకు కనీసం రైతుబంధు పథకం ద్వారా రుణాలు మంజూరు చేయాలని మొరపెట్టుకున్నా అధికారులు పట్టించుకోవడం లేదు.
20 యార్డుల పరిధిలో...
ఇదే పరిస్థితి జిల్లాలో మిగిలిన 20 మార్కెట్ యార్డుల్లోనూ నెలకొంది. జిల్లా వ్యాప్తంగా సుమారు 8 లక్షల మంది రైతులు ఉండగా, ఈ ఏడాది ఇప్పటి వరకు 138 మంది రైతులకు రూ.1.63 కోట్లు మాత్రమే మంజూరయ్యాయి. గుంటూరు మిర్చి యార్డుతోపాటు పేరున్న తాడికొండ, మంగళగిరి, ఫిరంగిపురం, తెనాలి, చిలకలూరిపేట, నరసరావుపేట, రేపల్లే, ఈపూరు, కూచినపూడి, రాజుపాలెం, వేమూరు మార్కెట్ యార్డుల్లో ఒక్క రైతుకు సైతం రుణాలు ఇవ్వలేదు. మిగిలిన మార్కెట్ యార్డుల్లో నామమాత్రంగా ఇద్దరు, ముగ్గురు రైతులకు రుణాలిచ్చి చేతులు దులుపుకుంటున్నారు.
లింక్ రోడ్లకూ దిక్కులేదు...
రైతుల నుంచి సెస్ రూపేణా వసూలు చేసిన కోట్ల రూపాయల నిధులతో గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతులు కల్పించాలన్న ఆలోచన కూడా ఈ ప్రభుత్వానికి రాకపోవటం బాధాకరం. పంట పొలాల నుంచి గ్రామానికి మధ్య లింక్ రోడ్ల నిర్మాణానికి నిధులు వెచ్చించాల్సి ఉండగా ఇప్పటి వరకు కనీసం మీటరు రోడ్డు కూడా నిర్మించలేదు. కొన్ని మార్కెట్ యార్డుల్లో పాలకవర్గాలుఇష్టానుసారంగా వ్యవహరిస్తుండటంతో నిధులు పక్కదారి పడుతున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment