
చంద్రబాబు అవినీతిపై చర్చకు సిద్ధం
దేశంలోనే అవినీతిలో నంబర్‌వన్ చంద్రబాబు అని శాసనసభలో ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు పెద్ద ఎత్తున నినదించారు. బడ్జెట్ ప్రసంగంపై వైఎస్సార్‌సీపీ సభ్యుడు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి
అసెంబ్లీలో విపక్షం ప్రతిసవాల్.. ప్రతిపక్ష సభ్యులపై సీఎం ఆగ్రహం
సాక్షి, అమరావతి: దేశంలోనే అవినీతిలో నంబర్‌వన్ చంద్రబాబు అని శాసనసభలో ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు పెద్ద ఎత్తున నినదించారు. బడ్జెట్ ప్రసంగంపై వైఎస్సార్‌సీపీ సభ్యుడు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మంగళవారం సభలో మాట్లాడారు. ఆయన ప్రసంగం పూర్తికాకుండానే స్పీకర్ కోడెల టీడీపీ సభ్యుడు కాల్వ శ్రీనివాసులుకు మైకు ఇచ్చారు.
ఈ నేపథ్యంలో తమకు మాట్లాడేందుకు మూడు నిమిషాలైనా సమయం ఇవ్వాలంటూ ప్రతిపక్ష సభ్యులు స్పీకర్‌ను వేడుకున్నారు. అయినప్పటికీ ఆయన ఒప్పుకోలేదు. దీంతో వైఎస్సార్‌సీపీ సభ్యులు స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టారు. సభ్యుల నినాదాలతో సభలో గందరగోళం నెలకొంది. ఈ దశలో ప్రతిపక్షంపై సీఎం చంద్రబాబు పరుష పదజాలంతో విరుచుకుపడ్డారు. ప్రతిపక్షం తీరు చూస్తుంటే తనకు కోపం, విసుగు, ఇరిటేషన్ వస్తున్నాయన్నారు. అడ్డూ అదుపు లేకుండా మాట్లాడుతున్నారని, గిల్లికజ్జాలు పెట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన క్రితం రోజు సభలో చేసిన వ్యాఖ్యలకు సవరణ ఇచ్చుకున్నారు.
అవినీతి అంతంలో, అభివృద్ధిలో ఏపీ నంబర్‌వన్ అని చెప్పాలనుకున్నానని, దురదృష్టవశాత్తూ అవినీతిలో రాష్ట్రం నంబర్‌వన్ అని చెప్పానని తెలిపారు. అవినీతిపై చర్చకు తాను సిద్ధంగా ఉన్నానని, విపక్షం సిద్ధమేనా? అంటూ సవాలు విసిరారు. సీఎం విసిరిన సవాలుకు బదులిచ్చేందుకు వైఎస్సార్‌సీపీ సభ్యులు సిద్ధమైనప్పటికీ మైకు లభించకపోవడంతో పోడియం వద్ద నుంచే ప్రతిస్పందించారు. చంద్రబాబు అవినీతిపై తాము చర్చకు సిద్ధమేనంటూ ప్రతిసవాలు విసిరారు.