ఎమ్మెల్యే సీకే బాబు ఆమరణ దీక్ష భగ్నం
రాష్ట్రాన్ని విభజిస్తున్న తీరును వ్యతిరేకిస్తూ, సమైక్యంగానే ఉంచాలని డిమాండ్ చేస్తూ చిత్తూరు ఎమ్మెల్యే సీకే బాబు గత ఆరు రోజులుగా చేస్తున్న ఆమరణ నిరాహార దీక్షను పోలీసులు మంగళవారం భగ్నం చేశారు. ఈ సందర్భంగా స్థానిక గాంధీ సర్కిల్ వద్ద ఏర్పాటు చేసిన దీక్షా శిబిరం వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. సీకే బాబు దీక్షను భగ్నం చేయడానికి భారీ సంఖ్యలో మధ్యాహ్నం ఒంటిగంట ప్రాంతంలో చేరుకున్న పోలీసులు ఆయన వైపు కదులుతుండగా ఆయన అభిమానులు దాన్ని అడ్డుకున్నారు.
డీఎస్పీ రాజేశ్వర్ రెడ్డి నేతృత్వంలో ఐదుగురు సీఐలు, సుమారు 150 మంది పోలీసులు అక్కడకు చేరుకున్నారు. సీకే బాబు యువసేనతో పాటు అక్కడ ఉన్న పలువురు వాళ్లను తీవ్రంగా ప్రతిఘటించారు. దాదాపు 25 నిమిషాల వరకు అసలు పోలీసులు బాబును అక్కడినుంచి తీసుకెళ్లలేకపోయారు. ఆ తర్వాత ఆయనను అంబులెన్సులోకి ఎక్కించగా, కార్యకర్తలు అంబులెన్సు చక్రాల వద్ద పడుకుని దాన్ని కదలనివ్వలేదు. అయితే పోలీసులు ఎలాగోలా వారిని అక్కడినుంచి తప్పించి బాబును చిత్తూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయనను అక్క్డడి క్యాజువాలిటీలో ఉంచి చికిత్స చేస్తున్నారు. సాయంత్రం ఆయనను డిశ్చార్జి చేసి ఇంటికి పంపే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
తొలుత రాష్ట్ర విభజన ప్రకటనకు నిరసనగా 48 గంటల దీక్షగా ప్రారంభించిన ఆయన, ఆ తర్వాత కూడా కేంద్రం రాష్ట్ర సమైక్యతపై ఏ మాత్రం స్పందించకపోవడంతో దాన్ని ఆమరణ దీక్షగా మార్చారు. సమైక్య రాష్ట్రం కోసం మంత్రులు రాజీనామా చేసి ఉద్యమించాలని సీకే బాబు డిమాండ్ చేశారు. సీమాంధ్ర మంత్రులకు రోషం లేదా అని ప్రశ్నించారు. కేవలం ఒక్క కేసీఆర్ కోసం తెలంగాణ రాష్ట్రం ఇవ్వడం సిగ్గుచేటని, దీనిపై కాంగ్రెస్ పార్టీ మూల్యం చెల్లించుకోక తప్పదని సీకే బాబు హెచ్చరించారు.