తీవ్ర అస్వస్థతకు గురై, రెండు రోజులుగా స్విమ్స్‌లో చికిత్స పొందుతున్న తిరుపతి ఎమ్మెల్యే వెంకటరమణ ఆరోగ్యం మెరుగుపడింది.
రెండు రోజుల తరువాతవెంటిలేటర్ తొలగింపు
మరో 48గంటల పాటు వైద్య సేవలు
హెల్త్ బులెటిన్‌లో స్విమ్స్ డైరె క్టర్ వెల్లడి
తిరుపతి కార్పొరేషన్: తీవ్ర అస్వస్థతకు గురై, రెండు రోజులుగా స్విమ్స్‌లో చికిత్స పొందుతున్న తిరుపతి ఎమ్మెల్యే వెంకటరమణ ఆరోగ్యం మెరుగుపడింది. ఎమ్మెల్యే కోలుకున్నట్టు సోమవారం రాత్రి 8.30 గంటలకు స్విమ్స్ డెరైక్టర్ డాక్టర్ బి.వెంగమ్మ విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో తెలిపారు. షుగర్, బీపీ లెవల్స్ స్థాయి పడిపోవడం, కిడ్నీకి సంబంధించిన వ్యాధితో శనివారం నుంచి స్విమ్స్ ఆర్‌ఐసీయూలో వైద్య సేవలు అందించామని తెలిపారు.
48 గంటల పాటు వెంటిలేటర్‌పై మెరుగైన వైద్య సేవలు అందించడంతో, సోమవారం ఉదయం 8 గంటలకు వెంటిలేటర్‌ను తొలగించామన్నారు. అప్పటి నుంచి స్వతహాగా శ్వాస తీసుకుంటున్నారని, తన వద్దకు వచ్చే వారిని గుర్తించి, మాట్లాడుతున్నట్టు డాక్టర్ వెంగమ్మ తెలిపారు. వెంటిలేటర్ తొలగించినా కిడ్నీ వ్యాధి కావడంతో మరో 48 గంటల పాటు డయాలసిస్ చేయాల్సి ఉందన్నారు. ప్రస్తుతానికి ఎలాంటి ప్రమాదం లేదని, పల్స్ రేట్ 68, బీపీ 140/80 గా ఉందని హెల్త్ బులెటిన్‌లో డాక్టర్ వెంగమ్మ స్పష్టం చేశారు. నెఫ్రాలజీ విభాగాధిపతి డాక్టర్ శివకుమార్, స్విమ్స్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ శివశంకర్, ఆర్‌ఎంవో కోటిరెడ్డి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే వెంటకరమణకు వైద్య సేవలు అందిస్తున్నారు.