శుభ్రతపై దృష్టి
- అర్హులందరికీ పింఛన్లు ఇస్తాం
- రూ.2లకే 20 లీటర్ల శుద్ధి నీరు
- జిల్లా అభివృద్ధే లక్ష్యం
- మంత్రులు పల్లె, సునీత
సాక్షి, అనంతపురం : ప్రజా సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం గాంధీ జయంతిని పురస్కరించుకుని ప్రవేశపెట్టిన ‘జన్మభూమి- మా ఊరు’ కార్యక్రమాన్ని జిల్లాలో గురువారం పండుగలా నిర్వహించారు. భారీ ా్యలీలు .. స్వచ్ఛతపై ప్రతిజ్ఞ చేశారు. ఎన్టీఆర్ సుజల స్రవంతి వాటర్ ప్లాంట్లు ప్రారంభించారు. పింఛన్ల పంపిణీ చేపట్టారు. అనంతపురంలో మంత్రులు పల్లె రఘునాథరెడ్డి, పరిటాల సునీతతో పాటు ప్రభుత్వ చీఫ్ విప్ కాలవ శ్రీనివాసులు, విప్ యామిని బాల, ఎమ్మెల్యేలు ప్రభాకర్ చౌదరి, బీకే పార్థసారథి, మేయర్ మదమంచి స్వరూప లాంఛనంగా ప్రారంభించారు.
మొదట తాడిపత్రి బస్టాండ్ కూడలిలోని మహాత్మాగాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అక్కడి నుంచి సప్తగిరి సర్కిల్ వరకు ర్యాలీ నిర్వహించారు. అక్కడ ప్రభాకర్‌చౌదరి అధ్యక్షతన ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మంత్రులు ప్రసంగించారు. తర్వాత మంత్రులతోపాటు ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి, మేయర్ స్వరూప బుడ్డప్పనగర్ కాలనీలో కాలువలు, రోడ్లు శుభ్రం చేశారు. నాల్గోరోడ్డు, ఎర్నాల కొట్టాలలో ఎన్టీఆర్ సుజల స్రవంతి వాటర్‌ప్లాంట్లను ప్రారంభించారు.
హామీలు నెరవేర్చుతాం..
ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృతనిశ్చయంతో ఉన్నారని మంత్రులు సునీత, పల్లె అన్నారు. సప్తగిరి సర్కిల్‌లో జరిగిన సభలో వారు మాట్లాడుతూ సమస్యల పరిష్కారం కోసం అమలు చేస్తున్న ‘జన్మభూమి - మాఊరు’కు ఆటంకాలు కలిగించకుండా ప్రతిపక్షాలు సహకరించాలని కోరారు. కుల, మతాలు, పార్టీలకు అతీతంగా అర్హులందరికీ పింఛన్లు మంజూరు చేస్తామన్నారు. సాంకేతిక లోపాల కారణంగానో, అధికారుల తప్పిదాలతోనో ఎవరికైనా పింఛన్ మంజూరు కాకపోతే తిరిగి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ప్రజలకు శుద్ధి చేసిన నీటిని అందించాలన్న లక్ష్యంతో ఎన్టీఆర్ సుజల స్రవంతి కింద రూ.2కే 20 లీటర్ల నీటిని అందిస్తున్నామన్నారు.
జిల్లా అభివృద్ధే లక్ష్యంగా కృషి చేస్తున్నామని స్పష్టం చేశారు. ‘అనంత’ను పారిశ్రామిక నగరంగా తీర్చిదిద్దుతామన్నారు. కోటా మేరకు హెచ్చెల్సీ నీటి విడుదలకు, హంద్రీనీవా ప్రాజెక్టు పనుల పూర్తి చేయడానికి పాటుపడతామన్నారు. పరిసరాల పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. మరుగుదొడ్డి నిర్మించుకునే వారికి రూ.12 వేలు మంజూరు చేస్తామన్నారు. నీరు-చెట్లు ప్రాధాన్యతను గుర్తించి విరివిగా మొక్కలు నాటాలన్నారు. ఆరోగ్య శిబిరాలు, పశువైద్య శిబిరాలు ఏర్పాటు చేసి సేవలందించాలని వైద్యులకు సూచించారు.
అనంతపురంలో ఐదు ఎన్టీఆర్ (అన్న) క్యాంటీన్లను ఏర్పాటు చేసి రూ.5కు రాగి సంగటి, వేరుశనగ విత్తనాల చెట్నీ, పప్పు అందిస్తామన్నారు. ప్రభుత్వ చీఫ్ విప్ కాలవ శ్రీనివాసులు, ఎమ్మెల్యేలతోపాటు ఎమ్మెల్సీ శమంతకమణి, జెడ్పీ చైర్మన్ చమన్‌సాబ్ ప్రసంగించారు. కార్యక్రమం చివర్లో స్వచ్ఛతపై ప్రజలతో ప్రతిజ్ఞ చేయించిన మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు అనంతరం లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో కలెక్టర్ సొలమన్ ఆరోగ్యరాజ్, జేసీ సత్యనారాయణ, ఎస్పీ రాజశేఖర్‌బాబు, డీఆర్‌డీఏ పీడీ నీలకంఠారెడ్డి, జెడ్పీ సీఈవో సూర్యనారాయణ, సివిల్‌సప్లయీస్ డీఎం వెంకటేశ్వర్లు, డిప్యూటీ మేయర్ గంపన్న తదితరులు పాల్గొన్నారు.