ఇడ్లీ తిన మనసాయె! | Morning Tiffin Idly Special Story | Sakshi
Sakshi News home page

ఇడ్లీ తిన మనసాయె!

Published Thu, Nov 14 2019 7:44 AM | Last Updated on Thu, Nov 14 2019 7:44 AM

Morning Tiffin Idly Special Story - Sakshi

‘రోజూ ఇడ్లీయేనా..’ మన ఇళ్లలో డైనింగ్‌ టేబుళ్ల దగ్గర, టిఫిన్‌ చేసేటప్పుడు ఈ డైలాగ్‌ తరచూ వింటుంటాం. ఇక హోటల్‌కు వెళితే మెనూలో ఇడ్లీ తప్పించి మిగతా వెరైటీలపైనే మన దృష్టంతా ఉంటుంది. రకరకాల కాంబినేషన్లలోని దోసెలు, పెసరట్లు, పూరీలు ఆర్డర్‌ చేసి లొట్టలేస్తాం. అయితే జిల్లాలోని హోటళ్లకు వచ్చే కస్టమర్లు మాత్రం మాకు ఇడ్లీయే కావాలంటున్నారు. మెనూ కార్డు చూడకుండా.. ఏం టిఫిన్లు ఉన్నాయని సర్వర్‌ను అడక్కుండానే.. ఇడ్లీ, సాంబారు ఆర్డర్‌ చెసేస్తున్నారు. ఓ పేరొందిన హోటల్‌లో గతంలో రోజుకు 2వేల ఇడ్లీలు అమ్ముడవుతుంటే.. ఇప్పుడు ఆ సంఖ్య 4 వేలు దాటింది. ఇంతకీ ఇడ్లీకి హఠాత్తుగా అంత డిమాండ్‌ ఎందుకొచ్చింది. తెలుసుకోవాలంటే ఈ కథనం చదవాల్సిందే. 

అనంతపురం న్యూసిటీ  : జిల్లా వ్యాప్తంగా ఆస్పత్రులన్నీ జ్వర పీడితులతో నిండిపోయాయి.  అదే సమయంలో హోటళ్లలో ఇడ్లీలకు డిమాండ్‌ రెండు రెట్లు పెరిగింది. ఈ రెండిటికీ లింకేంటి అంటారా? చాలా ఉంది. సులువుగా జీర్ణమయ్యే ఇడ్లీయే తినాలన్న వైద్యుల సూచనలతో జనం రెండు పూటలా వాటిని ఇడ్లీతోనే సరిపెడుతున్నారు. మామూలుగా ఉదయం లేదా సాయంత్రం జనం వీటిని తినేందుకు ఇష్టపడేవారు. విజృంభించిన జ్వరాలతో డాక్టర్ల సలహా మేరకు మూడు పూటలా ఇడ్లీ సాంబర్‌తో సరిపెట్టుకుంటున్నారు. దీంతో హోటళ్లలో ఇడ్లీలు హాట్‌ హాట్‌గా అమ్ముడుపోతున్నాయని వ్యాపారులు చెబుతున్నారు. జిల్లా వ్యాప్తంగా రెండు నెలలుగా సీజనల్‌ వ్యాధులు ఎక్కువగా ఉన్నాయి. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వాసుపత్రిలో రోజూ 3వేల మంది చికిత్స పొందుతుంటే.. ఇందులో వెయ్యి మందికి పైగా జ్వరపీడితులే ఉన్నారు. జ్వరంతో నీరసించడంతో సులువుగా జీర్ణమయ్యే ఆహారమైన ఇడ్లీ వైపే రోగులు మొగ్గుచూపుతున్నారు. దీంతో వాటి అమ్మకాలు ఒక్కసారి ఊపందుకున్నాయి. 

ఇడ్లీనే ఎందుకు?
ఇడ్లీలో చాలా పోషకాలున్నాయి. జ్వరం వచ్చినప్పుడు మూడు ఇడ్లీలు తింటే మనకు అవసరమైన అన్ని పోషకాలు అందుతాయి. పిండి పులియబెట్టడం వల్ల విటమిన్లు పెరుగుతాయి. ఆవిరితో ఉడికించడం వల్ల సులువుగా జీర్ణమవుతుంది. నూనె వాడకపోవడం వల్ల ఎలాంటి గ్యాస్ట్రిక్‌ సమస్యలు దరిచేరవు. ధాన్యం, పప్పు కాంబినేషన్‌ వల్ల సంపూర్ణ పోషకాలు అందుతాయి.  

వేడివేడిగా కావాలంటే క్యూ తప్పదు
ఇటీవల అనంతపురం హోటళ్లలో ఇడ్లీ కోసం గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తోంది. జ్వరపీడితులతో పాటు వృద్ధులు, యువతలో ఎక్కువ మంది ఇడ్లీ వైపు మొగ్గు చూపుతున్నారు. దీంతో డిమాండ్‌ పెరిగిపోయింది. జంక్‌ఫుడ్‌ వల్ల అనేక  గ్యాస్ట్రిక్, ఇతర సమస్యలు వస్తున్న నేపథ్యంలో ఇడ్లీ ఫేవరేట్‌ ఫుడ్‌గా మారింది. నగరంలోని ప్రధాన హోటళ్లతో పాటు సప్తగిరి సర్కిల్, క్లాక్‌టవర్, శ్రీకంఠం సర్కిల్, ఆర్టీసీ బస్టాండ్, కమలానగర్‌ తదితర ప్రాంతాల్లో భారీగా సంఖ్యలో ఇడ్లీ సెంటర్లున్నాయి. గతంలో విక్రయాలతో పోలిస్తే ఇటీవల వ్యాపారం 30 నుంచి 50 శాతం పెరిగినట్లు చెపుతున్నారు. నగరంలోని ప్రధాన హోటళ్లలో ఒక్క పూట వెయ్యి నుంచి 1,500 ఇడ్లీలు అమ్ముడుపోతున్నాయి.   

మంచి పోషక విలువలున్నాయి
ఇడ్లీలో మంచి పోషక విలువలు ఉంటాయి. జ్వరంతో బాధపడుతున్న వారికి అవసరమైన అన్ని రకాల క్యాలరీలు, ప్రొటీన్లు, కార్బోహైడ్రేట్స్‌  పుష్కలంగా ఉన్నాయి. రోజూ ఇడ్లీని ఆహారంగా తీసుకోవచ్చు.  
– నందిని, న్యూట్రిషియన్‌ కౌన్సిలర్, సర్వజనాస్పత్రి, అనంతపురం  

సులువుగా జీర్ణమవుతుంది
అనారోగ్యంతో బాధపడుతున్న వారికి ఇడ్లీనే ఆహారంగా తీసుకోవాలని చెబుతుంటాం. ఎందుకంటే చాలా సులువుగా జీర్ణమవుతుంది. దీని ద్వారా ఇతర ఇబ్బందులు ఏమీ ఉండవు.  – డాక్టర్‌ ప్రవీణ్‌ దీన్‌కుమార్,చిన్నపిల్లల వైద్య నిపుణులు,సర్వజనాస్పత్రి, అనంతపురం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement