‘రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడుతోంది. ప్రజాభీష్టానికి అనుగుణంగా నిర్ణయం తీసుకోవడంలో విఫలమయ్యాం. అధినేత డొంకతిరుగుడు చర్యల పట్ల ప్రజానీకం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పార్టీ శ్రేణులు ప్రత్యక్ష ఆందోళనలు చేస్తున్నా ప్రజలు విశ్వసించడం లేదు. పదవులకు రాజీనామా చేసి ప్రత్యక్ష పోరాటం చేస్తున్న వైఎస్సార్‌సీపీకి ప్రజల్లో అపారమైన మద్దతు లభిస్తోంది. ఏమి చేయాలబ్బా...‘ముందు చూస్తే నుయ్యి వెనుక చూస్తే గొయ్యి’ అన్న చందంగా పరిస్థితి తయారైందని తెలుగు తమ్ముళ్లు తలలు బాదుకుంటున్నారు’.
సాక్షి ప్రతినిధి, కడప: కాంగ్రెస్ పార్టీ నాయకత్వం తీసుకున్న నిర్ణయం ఫలితంగా రాయలసీమ, కోస్తాంధ్రలో సమైక్య రాష్ట్రం కోసం ఉద్యమం ఎగిసిపడుతోంది. 35రోజులుగా జిల్లాలో ఎడతెగని పోరాటాన్ని సమైక్యవాదులు చేస్తున్నారు. ఉద్యమం వల్ల ఎంతటి కష్టనష్టాన్ని భరించేందుకు సైతం వెనుకంజ వేయడంలేదు. ఇలాంటి పరిస్థితుల్లో అండగా నిలవాల్సిన రాజకీయపార్టీలు ఓట్ల కోసం డొంకతిరుగుడు వ్యవహారాన్ని భుజానికెత్తుకుంటున్నారు.
అందులో తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు అగ్రభాగాన నిలుస్తున్నారు. ‘యథా రాజా తథా ప్రజ’ అన్నట్లుగా అధినేత తీరుకు తగ్గట్టుగానే తెలుగుతమ్ముళ్ల వ్యవహారం కన్పిస్తోంది. రాష్ట్ర విభజన ప్రకటన వచ్చే అవకాశం ఉంది. నిరసనగా రాజీనామాలు చేపట్టాల్సిందిగా ఉద్యమకారులు టీడీపీ నేతలను కోరారు. స్పందించకపోతే కాళ్లు పట్టుకొని బ్రతిమలాడారు. అధినేత నిర్ణయానుసారమే నడుచుకుంటామని స్పష్టం చేశారు. చంద్రబాబు సైతం రాష్ట్ర విభజన ప్రకటన రాగానే, సీమాంధ్ర ప్రాంతానికి పరిహారం ఇవ్వాల్సిందిగా సలహా ఇచ్చారు. ఈ పరిణామాలను గమనిస్తున్న రాయలసీమ, కోస్తాంధ్ర ప్రజానీకం అటు కాంగ్రెస్, ఇటు టీడీపీలపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు.
దీక్షలు సైతం పార్టీ ఆదేశాల మేరకే..
ప్రజాభీష్టానికి అనుకూలంగా వైఎస్సార్‌సీపీ నిర్ణయం తీసుకుంది. ఆ పార్టీ ఎమ్మెల్యేలు రాష్ట్ర విభజన ప్రకటన కంటే ముందే పదవులకు రాజీనామాలు చేశారు. ఉద్యమంలో ముందంజలో ఉన్నారు. ఆమరణదీక్షలు చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. దీంతో ఇప్పటికైనా దీక్షలు చేపట్టండి. లేకపోతే ప్రజల్లో తీవ్ర స్థాయిలో వ్యతిరేకత తప్పదని టీడీపీ నాయకత్వం ఆదేశించడంతో జిల్లా కేంద్రంలో ఆ పార్టీ ఆధ్వర్యంలో ఆమరణదీక్షలు చేపట్టినట్లు సమాచారం. ఎమ్మెల్యే లింగారెడ్డి ముందుగా ఆ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. టీడీపీ నేతల వైఖరిని పరిశీలిస్తున్న ఉద్యమకారులు, వారి దీక్షలకు ఆశించిన మేరకు సంఘీబావం తెలపలేదనే చెప్పాలి.
జనసమీకరణ చేపట్టాల్సిందిగా పార్టీ అధిష్టానం కడప నేతలను ఆదేశించినా ఫలితం లేకపోయింది. ఇప్పటికే రాష్ట్ర విభజన విషయంలో పార్టీ నాయకత్వం నిర్ణయాన్ని కొందరు వ్యతిరేకిస్తున్నారు. పార్టీలో ఉంటూ ఉద్యమానికి అనుకూలంగా పనిచేసినా ఆశించిన మేరకు ఉద్యమకారులకు నమ్మకం కలిగే పరిస్థితులు లేవని, పార్టీని వీడి సమైక్యం కోసం కృషి చేస్తేనే యోగ్యకరంగా ఉంటుందని ఆ పార్టీ సీనియర్ నాయకుడు ఒకరు అభిప్రాయబడ్డారు. అయిష్టంగానే పార్టీ ఆదేశాల మేరకు దీక్షలను కొనసాగించాల్సిన పరిస్థితి తలెత్తిందని ఆయన పేర్కొనడం విశేషం.
దీక్షలకు కూర్చోబెట్టి జారుకున్న నేతలు...
వైఎస్సార్‌సీపీ ఆమరణదీక్షలు చేస్తోందని, మనం కొనసాగించాలని పట్టుబట్టి రైల్వేకోడూరు ఇన్‌ఛార్జి అజయ్‌బాబును టీడీపీ నేతలు ఆమరణదీక్షలకు కూర్చోబెట్టినట్లు తెలుస్తోంది. పార్టీ నేతలను విశ్వసించి ఆయన దీక్ష చేపట్టారు. అయితే జనసమీకరణలో నేతలు చేతులేత్తిసినట్లు సమాచారం. చంద్రబాబు రథయాత్రకు కొందరు నేతలు జనాన్ని వెంటేసుకొని వెళ్లారని, మరికొందరు నేతలు దీక్షల వైపు కన్నెత్తి కూడా చూడడం లేదని తెలుస్తోంది.
ఎమ్మెల్యే లింగారెడ్డి దీక్షలు చేపట్టితే అజయ్‌బాబు స్వయంగా పది వాహనాల్లో జనాన్ని తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. టీడీపీ నేతల దీక్షలు విజయవంతం చేసేందుకు తన వంతు కృషి చేసినా, తన దీక్షలకు సహరించకపోవడంపై పార్టీ నేతల వైఖరిపై అజయ్‌బాబు అనుచరుల ఎదుట వాపోయినట్లు తెలిసింది.
కాంగీయుల స్పందన అంతంతే...
రాష్ర్ట విభజనలో ప్రధమ ముద్దాయి అయిన కాంగ్రెస్ పార్టీ నేతలకు ఉద్యమకారుల నుంచి ప్రతిఘటన తప్పడం లేదు. జిల్లాలో ఇప్పటికే మంత్రి అహ్మదుల్లా, 20 సూత్రాల అమలు కమిటీ చెర్మైన్ తులసిరెడ్డిపై ఉద్యమకారులు చెప్పులు విసిరిన సంఘటనలున్నాయి. అప్పటి నుంచి కాంగ్రెస్ నేతలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
కాంగ్రెస్ నాయకత్వాన్ని తిడుతూనే, ఇబ్బంది లేదనుకున్న కార్యక్రమాల్లోనే పాల్గొంటున్నారు. ఇప్పటికే వైఎస్సార్‌సీపీ గ్రామస్థాయిలో సైతం సమైక్య రాష్ట్రం కోసం ఉద్యమాల్లో దూసుకెళ్తోంది. ఈ నేపథ్యంలో అటు టీడీపీ, ఇటు కాంగ్రెస్ పార్టీలు ఎటూ పాలుపోని స్థితిలో ఉండిపోయాయి. భవిష్యత్ రాజకీయం ప్రశ్నార్థకం కానుందని నేతలు మథనపడుతున్నారు.
ఏమి చేయాలబ్బా..!
Published Wed, Sep 4 2013 3:51 AM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM
Advertisement
Advertisement