ఉద్యమ హోరు | Movement Bash | Sakshi
Sakshi News home page

ఉద్యమ హోరు

Published Wed, Aug 28 2013 5:42 AM | Last Updated on Fri, May 25 2018 9:10 PM

Movement Bash

సాక్షి, కడప :  ప్రజలు పోటెత్తుతున్నారు. సమైక్య ఉద్యమం  మరింత రాజుకుంటోంది. సమైక్యవాదుల ఆగ్రహావేశాలు  కట్టలు తెంచుకుంటున్నాయి. ఉద్యమం హోరెత్తుతోంది. దీక్షలు జోరందుకుంటున్నాయి. నిరసనలు మిన్నంటుతున్నాయి. ఆందోళనలు సాగుతున్నాయి.  ఉద్యోగులు, న్యాయవాదులు కదం తొక్కుతున్నారు. విద్యార్థులు, కార్మికులు సమరనాదం పూరిస్తున్నారు. యువకులు, మహిళలు  సమైక్య గర్జన చేస్తున్నారు. ఇలా ఎవరికి వారే  విభిన్నరీతుల్లో నిరసన తెలుపుతుండడంతో ఉద్యమం వాడివేడిగా దూసుకుపోతోంది.
 
 రాష్ట్ర విభజనను నిరసిస్తూ 28వ రోజు ఉద్యమం అదే హోరుగా కొనసాగింది. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దీక్షలకు మద్దతుగా జిల్లాలో పలుచోట్ల ర్యాలీలు, నిరాహార దీక్షలు కొనసాగాయి. జాతీయ రహదారులను దిగ్బంధనం చేశారు.
 
  కలెక్టరేట్ వద్ద వైఎస్సార్ సీపీ నేతలు దుగ్గాయపల్లె మల్లికార్జునరెడ్డి, భూపేష్‌రెడ్డి, కిశోర్‌కుమార్, అఫ్జల్‌ఖాన్, నరసింహారెడ్డి ఆమరణ దీక్షలు మంగళవారంతో రెండవరోజు పూర్తయ్యాయి. వీరి దీక్షలకు పెద్ద ఎత్తున ఉద్యోగులు, అన్ని వర్గాల ప్రజలు సంఘీభావం తెలిపారు. న్యాయవాదులు, ఇండస్ట్రీయల్ అసోసియేషన్, నాయీ బ్రాహ్మణులు, వైద్య ఆరోగ్య సిబ్బంది, సహకార ఉద్యోగుల సంఘాల ఆధ్వర్యంలో  భారీ ర్యాలీలు  నిర్వహించారు.
 
 విచిత్ర వేషధారణలతో, ఆటపాటలతో ఆందోళన  చేపట్టారు. రహదారులు భవనాలశాఖ సిబ్బంది రిలే దీక్షలను  ఎస్‌ఈ మనోహరరెడ్డి  ప్రారంభించారు. కడప నగర పాలక సంస్థ, విద్యుత్ ఉద్యోగుల రిలే దీక్షలు సాగుతున్నాయి. రెవెన్యూ ఉద్యోగుల దీక్షలకు మద్దతుగా ప్రభుత్వ చౌక దుకాణల డీలర్ల అసోసియేషన్ వారు, ఉపాధ్యాయ, ఆర్టీసీ కార్మికులు, జేఏసీ, న్యాయవాదులు, న్యాయశాఖ ఉద్యోగుల దీక్షలు కొనసాగాయి. టీడీపీ నాయకులు అమీర్‌బాబు, రెడ్యం వెంకట సుబ్బారెడ్డి, సురేష్‌నాయుడు ఆమరణ దీక్షల్లో కూర్చొన్నారు. వీరికి టీడీపీ నేత గాలి ముద్దుకృష్ణమనాయుడు సంఘీభావం తెలిపారు.  జిల్లా కన్వీనర్ సురేష్‌బాబు, మాజీ మేయర్ రవీంద్రనాథ్‌రెడ్డి వైఎస్ జగన్ దీక్షకు సంఘీభావంగా జాతీయరహదారులను దిగ్బంధనం చేశారు.
 
 జమ్మలమడుగులో వస్త్ర వ్యాపారులు, కిరాణా, టెంటు హౌస్, బంగారు వ్యాపారులు, విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో  భారీ ర్యాలీ నిర్వహించారు. వంటా వార్పు చేపట్టారు. విచిత్ర వేషధారణలు, ఒంటె, గుర్రంపై తిరుగుతూ నిరసన  తెలిపారు. కేసీఆర్ దిష్టిబొమ్మ  తల నరికారు.
 
 క్యాంబెల్ ఆస్పత్రి ఉద్యోగులు సమైక్యాంధ్రపై సదస్సు నిర్వహించారు. ఎర్రగుంట్లలో రిలే దీక్షలు సాగాయి. ఎమ్మెల్యే దేవగుడి నారాయణరెడ్డి,మాజీమంత్రి పీఆర్ సంఘీభావం తెలిపారు. ఉపాధ్యాయ జేఏసీ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఆర్టీపీపీలో విద్యుత్ జేఏసీ ఆధ్వర్యంలో బహిరంగసభ నిర్వహించారు.
 
  ప్రొద్దుటూరులో చాపాడుకు చెందిన ఉపాధ్యాయులు, విద్యార్థులు రిలే దీక్షల్లో పాల్గొన్నారు. ఒలంపియాడ్, సెయింట్  మేరీస్ విద్యార్థులు రిలే దీక్షల్లో పాలుపంచుకున్నారు. రాష్ట్ర నాయీ బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో డప్పు వాయిద్యాలతో భారీర్యాలీ నిర్వహించారు. ఇద్దరు హిజ్రాలకు  కేసీఆర్, సోనియా మాస్క్‌లు ధరింపజేసి వివాహం జరిపించారు. విద్యార్థులు, వైద్యులు, న్యాయవాదులు, ఎన్జీఓల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ చేపట్టారు. రిక్షావాలాలు పుట్టపర్తి సర్కిల్‌లో  మానవహారంగా ఏర్పడ్డారు.
 
  పులివెందులలో ఉపాధ్యాయులు భారీ ర్యాలీ  నిర్వహించారు. రాష్ట్రం విడిపోతే ఏర్పడే ఇబ్బందులను వివిధ నాటకాలు, నిరసన ప్రదర్శనల ద్వారా కళ్లకు కట్టినట్లు వివరించారు. గొడుగులు, విచిత్ర వేషధారణలతో ఆందోళన చేపట్టారు.  ఎన్జీఓలు రిలే దీక్షలు చేపట్టారు. వేంపల్లెలో వినూత్నంగా దున్నపోతులతో ర్యాలీ  నిర్వహించారు.
 
  బద్వేలులో వడ్డెర సంఘం ఆధ్వర్యంలో రిలే దీక్షలు చేపట్టారు. ఆర్టీసీ కార్మికులు అర్ధనగ్న ప్రదర్శన చేశారు. ఉపాధ్యాయులు నాలుగురోడ్ల కూడలిలో మానవహారంగా ఏర్పడి వినూత్న రీతిలో ర్యాలీ చేపట్టారు. పోరుమామిళ్లలో విద్యార్థుల ర్యాలీలు, మానవహారాలు కొనసాగాయి. జేఏసీ ఆధ్వర్యంలో దీక్షలు కొనసాగుతున్నాయి.
 
  రాయచోటిలో జేఏసీ, న్యాయవాదుల ఆధ్వర్యంలో రిలే దీక్షలు సాగుతున్నాయి. ఆర్టీసీ కార్మికులు చెవిలో పూలతో పట్టణంతో ర్యాలీ చేపట్టారు.
 
  రైల్వేకోడూరులో ఐకేపీ మహిళలు భారీ ర్యాలీ చేపట్టారు. వీరికి ఉపాధి సిబ్బంది సంఘీభావం తెలిపారు. కార్మిక సంఘాలు మానవహారంగా ఏర్పడి ధర్నా చేపట్టారు.
  రాజంపేటలో ఉద్యోగ, ఉపాధ్యాయులు భారీ ర్యాలీ నిర్వహించి రిలే దీక్షలు చేపట్టారు. విద్యుత్ ఉద్యోగులు నల్లబ్యాడ్జీలతో మౌన ప్రదర్శన నిర్వహించారు. ప్రభుత్వ ఉద్యోగులు ర్యాలీ నిర్వహించి పాత బస్టాండు కూడలిలో మానవహారంగా ఏర్పడ్డారు.
 
  కమలాపురంలో ఉపాధ్యాయులు రిలే దీక్షల్లో పాల్గొన్నారు. విద్యార్థులు సమైక్యాంధ్ర ప్లకార్డులు చేతబూని పట్టణంలో ర్యాలీ చేస్తూ సమైక్య నినాదాలతో హోరెత్తించారు.
 
  మైదుకూరులో నాయీ బ్రాహ్మణులు ర్యాలీ, మానవహారంగా ఏర్పడి నిరసన తెలిపారు. వీరికి మాజీ ఎమ్మెల్యే రఘురామిరెడ్డి,ఉపాధ్యాయ జేఏసీ నాయకులు  సంఘీభావం తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement