ఆంధ్రప్రదేశ్ విద్యా పరిరక్షణ కమిటీ పిలుపు
శ్రీకాకుళం: రానున్న విద్యా సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలను పెద్ద ఎత్తున మూసివేతకు రంగాన్ని సిద్ధం చేస్తోందని, ప్రభుత్వ బడుల మూసివేతలను నిలువరించేందుకు ప్రజలు ఉద్యమించాలని ఆంధ్రప్రదేశ్ విద్యా పరిరక్షణ కమిటీ (ఏపీఎస్‌ఈసీ) పిలుపునిచ్చింది.
శ్రీకాకుళంలోని పదోతరగతి మూల్యాంకన కేంద్రాలైన ప్రభుత్వ బాలుర, బాలికల ఉన్నత పాఠశాలల్లో, గీతాంజలి పాఠశాలలో ఈ కమిటీ జిల్లా నాయకులు మంగళవారం కరపత్రాలతో ప్రచారం చేస్తూ నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. విద్యార్థుల సంఖ్య 20 లోపు ఉన్నప్పటికీ రెండు ఉపాధ్యాయ పోస్టులను మంజూరు చేయాలని విద్యా పరిరక్షణ కమిటీ నాయకులు తమ ప్రసంగాల్లో కోరారు. ఆదర్శ పాఠశాలలకు చట్టపరమైన భద్రతను కల్పించాలని, సక్సెస్ పాఠశాలల్లో రెండు మాధ్యమాలను కొనసాగించాలని వారు డిమాండ్ చేశారు.
విద్యా పరిరక్షణ కమిటీ జిల్లా కన్వీనర్ సన్నశెట్టి రాజశేఖర్ (ఏపీటీఎఫ్) మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలు మూసివేతను విద్యార్థులు, ఉపాధ్యాయులు, ప్రజలు ఐక్యంగా ఎదుర్కోవాలన్నారు. విద్యా పరిరక్షణ కమిటీ భాగస్వామ్య సంఘాల ప్రతినిధులు టి.చలపతిరావు, బి.బాలాజీరావు, కొమ్ము అప్పలరాజు, పి.కృష్ణారావు, విజయకుమార్, పద్మ, వినోద్, సాయి, పలువురు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. నిరసన పత్రంలో ఉపాధ్యాయుల సంతకాలు సేకరించారు.
ప్రభుత్వ పాఠశాలల రక్షణకు ఉద్యమం
Published Wed, Apr 20 2016 12:40 AM | Last Updated on Sun, Sep 2 2018 4:48 PM
Advertisement