సినిమా గుర్రాలు
గంగిశెట్టి వేణుగోపాల్, విజయవాడ
‘అరే కరీనా ఆజా’ అనగానే దగ్గరకొచ్చి నిలబడుతుంది. ‘అలెక్స్ బేటా ధీరే ధీరే’అనగానే పరుగులు తీసేది కాస్తా నెమ్మదిగా అడుగులు వేస్తుంది. ‘బాదల్ భ య్యా... గ్యాలప్’ అనగానే మందటి కాళ్లు పెకైత్తి పరుగందుకుంటుంది. ‘శబ్బాష్ బేటా శబ్బాష్’ అంటూ రియాజ్ ప్రేమగా నిమరగానే రిలాక్సయిపోతుంది.
ఇవన్నీ సినిమా గుర్రాలు. పదేళ్ల నటనానుభవం వీటి సొంతం. స్టార్ట్ కెమెరా... యాక్షన్... చెప్పగానే పరుగందుకోవడమూ, కట్ చెప్పగానే ఆగిపోవడమూ వీటికి తెలుసు. అందుకే ఈమధ్య కాలంలో వచ్చిన సోషియో ఫాంటసీ సినిమాల్లో వాటికి తగ్గ పాత్రలు చేశాయి. మగధీర, గబ్బర్‌సింగ్, దేవరాయ, రాజన్న లాంటి సినిమాల్లో అగ్రహీరోలతో నటించి గుర్తింపు తెచ్చుకున్న ఈ మార్వాడీ జాతి గుర్రాలు ప్రస్తుతం షూటింగ్ జరుగుతున్న రుద్రమదేవి, బాహుబలి చిత్రాల ద్వారా ప్రేక్షకులను అలరించనున్నాయి.
భాగ్యనగరాన్ని నిజాం నవాబులు పరిపాలిస్తున్న రోజుల్లో రాజస్థాన్‌లోని నాగోర్ జిల్లా జూలూర్ గ్రామానికి చెందిన మహ్మద్ జమాలుద్దీన్ అశ్వశాల పరిరక్షకుడిగా పనిచేసేవారు. నిజాం నవాబు మీర్ మహబూబ్ అలీ కోసం మేలు రకం గుర్రాలను పెంచేవాడు. ఆయన కుమారుడు మహ్మద్ షంషుద్దీన్ కూడా తండ్రి బాటలోనే నడుస్తూ హైదరాబాద్ జూ పార్కులో ఒంటెలు, ఏనుగులు, గుర్రాల పరిరక్షణ బాధ్యతలు నిర్వర్తించాడు. ఈయనకు ఆరుగురు సంతానం. వీరంతా అశ్వశాలలను నడుపుతూ హైదరాబాద్‌లోనే స్థిరపడ్డారు. 15 ఏళ్ల కిందట మహ్మద్ అస్లాం అండ్ కంపెనీని స్థాపించి సినిమా షూటింగుల కోసం ఏనుగులు, గుర్రాలు, ఒంటెలను సరఫరా చేయడం ప్రారంభించారు.
గుర్రాల పోషణలో విశేష అనుభవాన్ని గడించిన రియాజ్, అజమ్ పదేళ్ల కిందట విజయవాడకు సమీపంలోని ఉండవల్లి ప్రాంతంలో కొత్త అశ్వశాలను ప్రారంభించారు. మార్వాడీ, కాటెవాడీ జాతులకు చెందిన మహారాష్ట్ర, పంజాబ్, రాజస్థాన్ సంతతిని తెచ్చి పోషించడం మొదలు పెట్టారు. ప్రస్తుతం వీరి దగ్గర 66 మేలు జాతి గుర్రాలున్నాయి. ఇందులో 40 దాకా సినిమా షూటింగుల్లో ఉండగా, మిగతావన్నీ స్థానికంగా జరిగే దేవతల ఊరేగింపులు, వివాహ కార్యక్రమాలకు హాజరవుతున్నాయి.
‘మగధీర’తో మంచి క్రేజ్...
రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన మగధీరలో కాజల్‌ను చూసేందుకు రామ్‌చరణ్ గుర్రంపై వేగంగా ఫాలో అవుతాడు. ఆ గుర్రం పేరు బాదల్. సినిమాలో పేరు బాషా. గబ్బర్‌సింగ్ చిత్రంలో పవన్‌కల్యాణ్ స్వారీ చేసిన గుర్రం స్మార్ట్ చాంపియన్. రుద్రమదేవిలో రూప నటిస్తోంది. బాహుబలిలో కనిపించబోయే బులెట్ రాజా, మహాబలేశ్వర్, అలెక్స్, మ్యాంగో అన్నీ రియాజ్, అజమ్‌ల కంపెనీవే. చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్, రవితేజ, జూనియర్ ఎన్టీఆర్, మహేష్‌బాబు, శ్రీకాంత్, రానా, అనుష్క, కాజల్, ఆలీ వంటి నటీనటులందరూ వీటిపై మక్కువతో సవారీ చేశారు.
మా అన్నదమ్ముల కుటుంబాలన్నీ గుర్రాల ద్వారా వచ్చే ఆదాయంపైనే జీవనం సాగిస్తుంటాయి. మాకు పెద్దగా చదువులు లేకపోయినా వంశపారంపర్యగా మేలు జాతి గుర్రాలు, ఏనుగులను పోషిస్తున్నాం. వీటికి రోజూ శనగలు, గోధుమపిండితో దాణా అందించడమే కాకుండా మాలిష్ చేయడం, సమయానికి మందులు వాడటం చేయాల్సి ఉంటుంది. రాత్రి వేళ అశ్వశాలలలోనికి దొంగలు చొరబడకుండా ై‘నెట్ కింగ్’ గుర్రం కాపలా కాస్తుంది. మేం చెప్పిన మాటలన్నీ వాటికి అర్థమవుతాయ్. అందుకే సినిమా షూటింగుల్లో ఇబ్బందులు తలెత్తడం లేదు. - మహ్మద్ అజమ్, గుర్రాల పోషకుడు, ఉండవల్లి