సాక్షి, విశాఖపట్నం : రాష్ట్రంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరం విశాఖపట్నమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ నేత, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి అన్నారు. విశాఖలోని ఓ ప్రైవేట్ హోటల్‌లో... ప్రగతి భారత్ ఫౌండేషన్ పేరుతో విజయసాయిరెడ్డి ఎన్జీవో కార్యక్రమాన్ని శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విశాఖలోని ప్రముఖులతో కలిసి సంఘసేవలో భాగంగా ఎన్జీవోను ప్రారంభిస్తున్నామని, రాజకీయాలకు అతీతంగా సంస్థ కార్యక్రమాలను నిర్వహిస్తామని అన్నారు. కోటి రూపాయల నిధితో ఏర్పాటు చేసిన ఈ ఫౌండేషన్ కార్యక్రమాలను మొదటగా విశాఖలో ప్రారంభించి, ఆ తర్వాత రాష్ట్రమంతటా వ్యాప్తి చేస్తామని వెల్లడించారు.
అదే విధంగా విశాఖ తీర ప్రాంతాన్ని కొబ్బరి మొక్కలు నాటి అభివృద్ది చేస్తామని, ఇప్పటికే తమ ట్రస్టు తరపున ఆర్‌కె బీచ్ వద్ద యాభై లక్షలతో కొబ్బరి మొక్కలను నాటడం జరిగిందని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. అలాగే తమ ట్రస్ట్ ఆధ్వర్యంలో స్కిల్ డెవలప్‌మెంట్ కార్యక్రమాలను చేపట్టబోతున్నామని, దీని ద్వారా నాణ్యమైన విద్య, నిరుద్యోగులకు ప్రత్యేక శిక్షణ నైపుణ్యంపై ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆరోగ్య శిబిరాల ద్వారా అందరికీ వైద్యాన్ని చేరువ చేసేందుకు కృషి చేస్తామని.. అదేవిధంగా కార్పోరేట్ సంస్థలు కూడా సమాజాభివృద్దిపై దృష్టి సారించాలని ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. కాగా ప్రగతి భారత్ ఫౌండేషన్ ఆయన చైర్మన్‌గా వ్యవహరించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment