
‘ప్రోటోకాల్ ప్రకారం ఆహ్వానం ఉంది’
పైడిపాలెం రిజర్వాయర్ వద్దకు వెళుతున్న వైఎస్‌ఆర్ సీపీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, మాజీమంత్రి వైఎస్ వివేకానందరెడ్డి తదితర నేతలను పోలీసులు మధ్యలోనే అడ్డుకున్నారు.
కడప : పైడిపాలెం రిజర్వాయర్ వద్దకు వెళుతున్న వైఎస్‌ఆర్ సీపీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, మాజీమంత్రి వైఎస్ వివేకానందరెడ్డి తదితర నేతలను పోలీసులు మధ్యలోనే అడ్డుకున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇవాళ పైడిపాలెం జలాశయాన్ని ప్రారంభించనున్న నేపథ్యంలో అడుగడుగునా పోలీసులు ఆంక్షలు విధించారు. కోవరంగట్టుపల్లి వద్ద అవినాష్ రెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. వారిని గృహనిర‍్భంధం చేసేందుకు ప్రయత్నించారు. రిజర్వాయర్ వద్దకు వెళ్లకుండా భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు.
కాగా ప్రొటోకాల్ ప్రకారం సీఎం కార‍్యక్రమంలో పాల‍్గొనేందుకు తమకు ఆహ్వానం ఉందని వైఎస్‌ఆర్ సీపీ నేతలు తెలిపారు. ఈ సందర్భంగా అవినాష్ రెడ్డి మాట్లాడుతూ పైడిపాలెం జలాశయానికి వైఎస్ రాజశేఖరరెడ్డి ఎంతో కృషి చేశారన్నారు. తమను పోలీసులు అడ్డుకోవడం అప్రజాస్వామికమని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రోటోకాల్ ప్రకారం తమకు ఆహ్వానం ఉందని వైఎస్ అవినాష్ రెడ్డి తెలిపారు. కాగా అంతకు ముందు పులివెందుల నుంచి బయలుదేరిన వైఎస్సార్‌సీపీ నేతలు సింహాద్రిపురం మండలం కోవనగుంటపల్లి చేరుకుని అక‍్కడ కబడ్డీ పోటీలను ప్రారంభించారు.