
కాపులుగా ఎందుకు పుట్టామా అనిపిస్తోంది..
కాపులకు ఇచ్చిన బీసీ రిజర్వేషన్ హామీని తక్షణమే అమలు చేయాలని కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం డిమాండ్ చేశారు.
జగ్గంపేట(తూర్పుగోదావరి జిల్లా): చంద్రబాబునాయుడు పాదయాత్ర, ఎన్నికల మేనిఫెస్టోలో కాపులకు ఇచ్చిన బీసీ రిజర్వేషన్ హామీని తక్షణమే అమలు చేయాలని కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం డిమాండ్ చేశారు. తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడిలో ఆయన స్వగృహంలో గురువారం విలేకరులతో మాట్లాడారు. రిజర్వేషన్‌లపై రెండు కమిషన్‌లు వేసి రిపోర్టు రప్పించుకుని కేబినెట్‌లో ఆమోదించి ఏ కులం నష్టపోకుండా నిర్ణయం తీసుకుంటానని తెలంగాణ సీఎం కేసీఆర్ చెప్పడం సంతోషంగా ఉందన్నారు.
అపార అనుభవం ఉందని చెప్పుకునే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు దగ్గర అలాంటి నిర్ణయం పొందకపోవడం మా జాతి చేసుకున్న పాపమని భావిస్తున్నట్లు చెప్పారు. ఈ రాష్ట్రంలో కాపులుగా ఎందుకు పుట్టామా అని బాధగా ఉందన్నారు. రాష్ట్రంలో మంజునాథ కమిషన్ పర్యటన ముగిసినా రిపోర్టు విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాన్చివేత ధోరణి అవలంభిస్తున్నారని మండిపడ్డారు. రిజర్వేషన్‌లు అమలు చేయమంటే లాఠీలతో కొట్టిస్తారా, పోలీసు బూట్లతో తన్నిస్తారా, కేసులు పెట్టి జైల్లో పెట్టిస్తారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. మే 7న కాకినాడలో 13 జిల్లాల కాపు పెద్దలతో సమావేశమై ఉద్యమం ఉధృతం చేయడానికి కార్యాచరణ రూపొందిస్తామని తెలిపారు.
అంబేడ్కర్ జయంతి ఉత్సవాల్లో పాలుపంచుకోండి..: అంబేడ్కర్ 125వ జయంతి ఉత్సవాల్లో కాపుజాతి యావత్తూ పాలుపంచుకుని ఆయనకు నివాళులర్పించాలని ముద్రగడ పిలుపునిచ్చారు. కాపులకు ఉన్న రిజర్వేషన్‌లను అప్పటి బ్రిటిషు ప్రభుత్వంతో మాట్లాడి కాపులకు రిజర్వేషన్‌లు కొనసాగించాలని చెప్పారన్నారు. ఆయన రుణం తీర్చుకోవడానికి ఆయన జన్మదిన వేడుకల్లో అవకాశం ఉన్నచోట కాపు, తెలగ, ఒంటరి, బలిజ కులస్తులు పాల్గొని నివాళులర్పించాలని కోరారు. అలాగే స్వాతంత్య్రం వచ్చాక తీసేసిన రిజర్వేషన్‌లను పునరుద్ధరించిన మరో దళిత మహానుభావుడు దామోదరం సంజీవయ్య జయంతి, వర్థంతి కార్యక్రమాల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు.