
సాక్షి, తూర్పు గోదావరి : కాపు రిజర్వేషన్లపై స్పష్టతనివ్వాలని సీఎం చంద్రబాబుకు కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం లేఖ రాశారు. ఈబీసీ కోటాలో తమ జాతికి ఐదు శాతం రిజర్వేషన్లు కేటాయిస్తూ బిల్లు పంపారని, బీసీల ప్రాతిపదికగా ఇస్తున్న ప్రయోజనాలు తమకు వర్తిసాయా అని ఆ లేఖలో చంద్రబాబును ప్రశ్నించారు. 2017లో తీర్మానం చేస్తూ.. కేంద్రానికి పంపిన బీసీ-ఎఫ్ అమలు చేస్తారా? లేక 2019 ఈబీసీ బిల్లు అమలు చేస్తారో స్పష్టతనివ్వాలని కోరారు. 2019 బిల్లు మీరు ఇచ్చిందా? కేంద్రంలో ఉన్న బీజేపీ ఇచ్చిందా చెప్పాలంటూ ప్రశ్నించారు. అసలు కాపులకు పది శాతం రిజర్వేషన్లు కల్పించే ఉద్దేశం ఉందా అని మండిపడ్డారు. రిజర్వేషన్ తరగతులకు అందే ప్రయోజనాలు తమ జాతికి అందేంతవరకు తన ఉద్యమం ఆగదని అన్నారు.