రాబందు | municipal workers worried about salary | Sakshi
Sakshi News home page

రాబందు

Published Fri, Apr 28 2017 1:23 PM | Last Updated on Tue, Oct 16 2018 6:35 PM

రాబందు - Sakshi

రాబందు

► కార్మిక స్వేదం.. స్వాహాపర్వం
► ఆరు నెలలుగా పీఎఫ్, ఈఎస్‌ఐ సొమ్ము స్వాహా
► కాంట్రాక్టర్‌ జేబులోకి రూ.1.13కోట్లు
► రెండు నెలలుగా వేతనాలకు నోచుకోని పారిశుద్ధ్య కార్మికులు
► ఆ డబ్బంతా మద్యం షాపుల్లో పెట్టుబడి
► ఇదీ ఓ టీడీపీ నాయకుడి కక్కుర్తి

ఎమ్మిగనూరు: కాంట్రాక్టు కార్మికుల జీతాలు, పీఎఫ్, ఈపీఎఫ్, ఈఎస్‌ఐ సొమ్ము రూ.1.13కోట్ల స్వాహా ఉదంతం ఎమ్మిగనూరు మున్సిపాలిటీలో ప్రకంపనలు సృష్టిస్తోంది. మొత్తం 276 మంది కాంట్రాక్టు కార్మికులు పని చేస్తుండగా.. అత్యధికంగా 128 మంది శానిటరీ విభాగంలో ఉన్నారు.

గత ఏడాది కొత్తగా నియమించుకున్న 30 మంది కార్మికుల వద్ద ఒక్కొక్కరి నుంచి రూ.70వేలు మొదలు రూ.1.5లక్షల వరకు ఓ కౌన్సిలర్‌ వసూలు చేయడం అప్పట్లో చర్చనీయాంశం అయ్యింది. ప్రతి కార్మికుడి నెల జీతం రూ.11వేలుగా నిర్ణయించారు. కాంట్రాక్టు కార్మికులకు జీతాల చెల్లింపు బాధ్యత భగీరథ వడ్డెర లేబర్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ది కాగా.. దీని నిర్వాహకులు మద్యం సిండికేట్‌ భాగస్వామి కావడం గమనార్హం.

ఆరు నెలలుగా పీఎఫ్‌ సొమ్ము స్వాహా
మున్సిపాలిటీలో పనిచేస్తున్న 276 మంది కార్మికులకు ప్రతి నెలా మొత్తం రూ.30,36,000 చెల్లించాల్సి ఉంది. పీఎఫ్‌ కోసం జీతంలో కాంట్రాక్టర్‌ 12శాతం కోత వేస్తున్నాడు. ఈ మొత్తం 3,64,000 అవుతుంది. ఈ లెక్కన గత ఆరు నెలల్లో రూ.21,84,000 కాంట్రాక్టర్‌ జేబుకు చేరింది. అదేవిధంగా ఈఎస్‌ఐ కింద ప్రతి నెలా కార్మికుడి వేతనంలో 1.75 శాతం పట్టుకుంటుండగా.. నెలకు రూ.51,130 చొప్పున ఆరు నెలలకు రూ.3,18,780 కాంట్రాక్టర్‌ ఏమి చేసినట్లో తెలుస్తలేదు.

ఇకపోతే మున్సిపాలిటీ నుంచి కార్మికులకు వచ్చే ఈపీఎఫ్, ఈఎస్‌ఐ సొమ్ము కూడా కాంట్రాక్టర్‌ ఖాతాలోకి చేరుతోంది. ఈపీఎఫ్‌ రూపంలో13శాతం చొప్పున నెలకు రూ.3,94,680 చొప్పున ఆరునెలల మొత్తం రూ.23,68,080. అదేవిధంగా మున్సిపాలిటీ చెల్లించే ఈఎస్‌ఐ సొమ్ము 2శాతం నెలకు రూ.60,720 చొప్పున ఆరు నెలలకు రూ.3,64,320 కాంట్రాక్టర్‌ స్వాహా చేశాడు. ఈ ఆరు నెలల్లో ఏదైనా ప్రమాదం జరిగి ఉంటే కార్మికుల పరిస్థితి ఏమిటనేది ప్రశ్నార్థమవుతోంది.

రెండు నెలలుగా కాంట్రాక్టర్‌ కార్మికులకు వేతనాలు కూడా చెల్లించకపోవడంతో ఆయా కుటుంబాల పరిస్థితి దారుణంగా ఉంటోంది. ప్రతి నెలా కార్మికులకు చెల్లించాల్సిన వేతనాల మొత్తం రూ.30,36,000. ఈ లెక్కన రెండు నెలలుగా కాంట్రాక్టర్‌ రూ.60,72,000 బకాయి చెల్లించాల్సి ఉంది. అటు పీఎఫ్, ఈఎస్‌ఐ, ఇటు వేతన బకాయిలు కలిపి మొత్తం రూ.1.13 కోట్లు దారి మళ్లినట్లు కార్మికులు ఆవేదన చెందుతున్నారు. మరి ఇందులో అధికారులు, పాలక పాపమెంతో తేలాల్సి ఉంది.

కార్మికుల కష్టమే పెట్టుబడి
పారిశుద్ధ్య పనులు, మురుగు కాలువలను శుభ్రపర్చడం మొదలు ఆటో, ట్రాక్టర్‌ డ్రైవర్స్‌.. హమాలీలు, ఫిట్టర్‌లు, ఎలక్ట్రికల్‌ వర్కర్‌లు.. మున్సిపల్‌ కాంట్రాక్టు కార్మికులు నిత్యం ప్రాణాలను పణంగా పెట్టి విధులు నిర్వహిస్తున్నారు. అలాంటి వారి కష్టాన్ని.. వేతనాలను ఓ కాంట్రాక్టర్‌ మద్యం షాపులకు పెట్టుబడిగా బదలాయించి లబ్ధి పొందుతుండటం విమర్శలకు తావిస్తోంది. ఇటీవల మద్యం టెండర్లలో సిండికేట్‌ భాగస్వామిగా మారి 138 మంది టెండర్లు వేయడం చూస్తే కార్మికుల సొమ్ము ఏ స్థాయిలో దుర్వినియోగం చేశారో అర్థమవుతోంది.

కాంట్రాక్టర్‌కు బిల్లులు నిలిపేశాం
ఆరు నెలలుగా కార్మికుల పీఎఫ్, ఈఎస్‌ఐ, ఈపీఎఫ్‌ సొమ్మును చెల్లించకుండా కాంట్రాక్టర్‌ కోటేకల్‌ బాలరాజు నిర్లక్ష్యం వహించాడు. రెండు నెలల వేతనాలు చెల్లించాల్సి ఉంది. అందువల్ల ఈ నెల మున్సిపాలిటీ నుంచి కాంట్రాక్టర్‌కు చెల్లించే బిల్లులన్నీ నిలిపేశాం. విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తాం.  – సంపత్‌కుమార్, మున్సిపల్‌ కమిషనర్‌

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement