చంద్రబాబుది నయవంచన పాలన | Munukuru Ravikumar Reddy Join in YSR Congress Party | Sakshi
Sakshi News home page

చంద్రబాబుది నయవంచన పాలన

Published Sat, Feb 23 2019 1:14 PM | Last Updated on Sat, Feb 23 2019 1:14 PM

Munukuru Ravikumar Reddy Join in YSR Congress Party - Sakshi

ఆనం, కాకాణి సమక్షంలో పార్టీలో చేరిన మునుకూరు రవికుమార్‌రెడ్డి

నెల్లూరు, ముత్తుకూరు: మోస పూరిత హామీలతో రాష్ట్రంలో అన్ని వర్గాలను దగా చేసిన చంద్రబాబు నయవంచన పాలనకు చరమగీతం పాడే రోజు దగ్గర పడిందని మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి పేర్కొన్నారు. నెల్లూరు ఏఎంసీ మాజీ  చైర్మన్‌ మునుకూరు రవికుమార్‌రెడ్డి(బాబిరెడ్డి) శుక్రవారం వైఎస్సార్‌సీపీలో చేరారు. మండలంలోని ముసునూరువారిపాళెంలో ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగసభలో సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధనరెడ్డి, ఆనం రామనారాయణరెడ్డిలు బాబిరెడ్డికి పార్టీ కండువా కప్పి, సాదరంగా ఆహ్వానించారు. అనంతరం మాజీ మంత్రి ఆనం మాట్లాడుతూ 600  హామీల్లో ఒక్కటి కూడా నెరవేర్చని చంద్రబాబును ఎవరూ నమ్మే స్థితిలో లేరన్నారు. ప్రజలు రావాలి జగన్‌–కావాలి జగన్‌ అంటున్నారని చెప్పారు. కాంగ్రెస్‌కి వ్యతిరేకంగా నాడు ఎన్టీఆర్‌ టీడీపీని స్థాపిస్తే, చంద్రబాబు ఇప్పుడు కాంగ్రెస్‌తో దోస్తీ కట్టి విలువలకు పాతర వేశారన్నారు.

యాష్‌పాండ్‌లో సోమిరెడ్డికి కమీషన్లు
జెన్‌కో ప్రాజెక్ట్‌ రెండో యాష్‌పాండ్‌ నిర్మాణంలో కమీషన్లు తీసుకోలేదని మంత్రి సోమిరెడ్డి ప్రమాణం చేయగలరా అంటూ సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధనరెడ్డి ఈ సభలో సవాలు చేశారు. కమీషన్లు ముట్టలేదని కాణిపాకం ఆలయంలో ప్రమాణం చేస్తే తాను బహిరంగంగా క్షమాపణ చెబుతానన్నారు. తాను కమీషన్లు తీసుకోలేదంటూ రైసు మిల్లర్లను బెదిరించి చెప్పించారని కాకాణి మండిపడ్డారు. సోమిరెడ్డి దగ్గర ధనం బలం ఉండవచ్చు, కానీ తమ వద్ద జనం బలం ఉందని ధీమా వ్యక్తం చేశారు. రైతుల్ని ముష్టివాళ్లుగా భావిస్తే సహించేదిలేదన్నారు. మునుకూరు బాబిరెడ్డి మాట్లాడుతూ యాష్‌పాండ్‌ ఏర్పాటులో సోమిరెడ్డి చూపిన స్వార్థం వల్ల టీడీపీని వీడి, వైఎస్సార్‌సీపీలో చేరానన్నారు. పరిసర గ్రామాలకు చెందిన 600 మంది అనుచరులు బాబిరెడ్డి వెంట పార్టీలో చేరారు. నాయకులు ఆనం రంగమయూర్‌రెడ్డి, వేమారెడ్డి శ్యామసుందరరెడ్డి, పేర్నాటి శ్యామ్‌సుందరరెడ్డి, జెడ్పీటీసీ సభ్యుడు నెల్లూరు శివప్రసాద్, పార్టీ కన్వీనర్‌ మెట్టా విష్ణువర్ధనరెడ్డి, దువ్వూరు చంద్రశేఖర్‌రెడ్డి పాల్గొన్నారు.       

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement