అనంతపురం అర్బన్, న్యూస్‌లైన్ : రాష్ర్ట రెవెన్యూ శాఖ మంత్రి ఎన్.రఘువీరారెడ్డికి శనివారం అనంతపురంలో వైఎస్సార్‌సీపీ నేతల నుంచి ‘సమైక్య’ సెగ తగిలింది. ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో మంత్రి ఉన్నారని తెలుసుకున్న వైఎస్సార్‌సీపీ జిల్లా అధికార ప్రతినిధి చింతకుంట మధు, ట్రేడ్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు కొర్రపాడు హుస్సేన్‌పీరా, యువజన విభాగం నగరాధ్యక్షుడు మారుతీనాయుడుతోపాటు మహిళా నేతలు అక్కడకు చేరుకున్నారు. సమైక్య నినాదాలతో హోరెత్తించారు.
మంత్రి బయటకు రావాలంటూ నినదించారు. అన్నదమ్ముల్లా కలిసిమెలిసి ఉన్న సీమాంధ్ర-తెలంగాణ ప్రజలను స్వార్థ రాజకీయాల కోసం వేరు చేయాలని చూస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. విభజన నిర్ణయంతో రాష్ట్రం అగ్నిగుండంలా మారితే మీరు నీతిమాలిన రాజకీయాలు చేస్తూ కూర్చుంటున్నారా అని విరుచుకుపడ్డారు. సమైక్యాంధ్రపై మీ వైఖరేంటో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ నిర్వాకంతోనే తెలంగాణ వాదం తెరపైకి వచ్చిందని మండిపడ్డారు.
కొద్దిసేపటి తర్వాత బయటకు వచ్చిన మంత్రి తాను మొదట్నుంచీ సమైక్యాంధ్రకు మద్దతు ఇస్తూనే ఉన్నానన్నారు. ఇలాంటి కంటితుడుపు మాటలు చెప్పకుండా చేతల్లో చూపించాలని నాయకులు హితవు పలికారు. స్పష్టమైన వైఖరి తెలియజేయకపోతే ఇక్కడి నుంచి కదిలేది లేదని భీష్మించారు. తమను కన్నీళ్లు పెట్టిస్తున్న ఈ ప్రభుత్వం అడ్రస్ లేకుండా పోతుందని పలువురు మహిళలు మట్టి పోసి శాపనార్థాలు పెట్టారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారుతోందని భావించి పోలీసులు రంగప్రవేశం చేశారు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులకు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. అనంతరం పోలీసులు కొంతమంది నాయకులను అదుపులోకి తీసుకున్నారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ నాయకులు చాంద్‌బాషా, జిలాన్ బాషా, బండిపరుశురాం, మారుతీ ప్రకాష్, శ్రీదేవి, దేవి, కదిరి నిర్మల, రాజేశ్వరి, ప్రశాంతి తదితరులు పాల్గొన్నారు.
మంత్రిపై మండిపడ్డ ఎస్కేయూ జేఏసీ నేతలు
మంత్రి రఘువీరారెడ్డిని ఎస్కేయూ జేఏసీ నాయకులు ఫ్రొఫెసర్ సదాశివరెడ్డి, రాజేశ్వర్‌రావు తదితరులు నిలదీశారు. సమైక్యాంధ్ర పరిరక్షణకు వెన్నంటి ఉండాల్సింది పోయి, ప్రేక్షక పాత్ర వహిస్తున్నారంటూ మంత్రిపై మండిపడ్డారు. వీరిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
కుందుర్పిలో వైఎస్సార్ సీపీ నేతలు, సమైక్యవాదుల ముందస్తు అరెస్ట్
కుందుర్పి మండల కేంద్రంలో మంత్రి రఘువీరారెడ్డికి ‘సమైక్య’ సెగ తగలకుండా, ‘రచ్చబండ’కు ఆటంకం కలగకుండా పోలీసులు శనివారం ఉదయం ఆరు గంటలకే వైఎస్సార్‌సీపీ నేతలను, సమైక్యవాదులను అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు. అరెస్టయిన వారిలో వైఎస్సార్‌సీపీ యువజన విభాగం నేత ఇ.రాము, స్టీరింగ్ కమిటీ సభ్యులు బి.టి.రాము, ఎస్సీ సెల్ నాయకులు బాబు, కేఎన్ రాజు, జేఏసీ నాయకులు కే,క్రిష్టమూర్తి, మల్లికార్జున, కరిగానిపల్లి మల్లికార్జున తదితరులు ఉన్నారు.‘రచ్చబండ’ ముగిసిన తర్వాత వారిని పోలీసులు వదిలిపెట్టారు.
రఘువీరాకు సమైక్య సెగ
Published Sun, Nov 17 2013 3:11 AM | Last Updated on Wed, Aug 29 2018 5:50 PM
Advertisement
Advertisement