కాంగ్రెస్‌లో చేరిన అనంతరం ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీతో నాగం జనార్దన్‌రెడ్డి
సాక్షి, నాగర్‌కర్నూల్ : సీనియర్ నేత, మాజీ మంత్రి నాగం జనార్దన్‌రెడ్డి తన పంతం నెగ్గించుకున్నారు. స్థానిక నేతల నుంచి వ్యతిరేకత వచ్చినా బుధవారం ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయన వెంట జిల్లాలోని కొల్లాపూర్ నియోజకవర్గం నుంచి పలుమార్లు అసెంబ్లీ బరిలో దిగిన టీడీపీ మాజీ నేత జగదీశ్వర్‌రావు సైతం కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఈ పరిణామాలతో నాగర్‌కర్నూల్, కొల్లాపూర్ నియోజకవర్గాలలో కాంగ్రెస్ పార్టీ రెండు వర్గాలుగా చీలిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఆరు నెలల నుంచే...
గత ఆరు నెలలుగా నాగం జనార్దన్‌రెడ్డి, జగదీశ్వర్‌రావు కాంగ్రెస్‌లో చేరుతారన్న ప్రచారం జరుగుతోంది. నెల క్రితం ఆయన భారతీయ జనతా పార్టీకి రాజీనామా చేయడం ద్వారా కాంగ్రెస్‌లో చేరేందుకు మార్గం సుగమం చేసుకున్నారు. ఆ తర్వాత కాంగ్రెస్‌లో చేరుతున్నట్లు ప్రకటించగానే కాంగ్రెస్ ఎమ్మెల్సీ దామోదర్‌రెడ్డి వ్యతిరేకించారు. ఈ నేపథ్యంలో దామోదర్‌రెడ్డిని హైదరాబాద్‌లోని ఆయన ఇంటికి వెళ్లి ఒప్పించేందుకు తీవ్రంగా ప్రయత్నించారు.
కాంగ్రెస్ పార్టీలో కలిసి పనిచేద్దామని, అధికార టీఆర్‌ఎస్‌ను ఓడించేందుకు కేసీఆర్ వ్యతిరేక శక్తులన్నీ ఏకం కావడం కోసమే తాను కాంగ్రెస్‌లో చేరుతున్నట్లు చెప్పుకొచ్చినా దామోదర్‌రెడ్డి స్వాగతించలేదు. ఇకఆ తర్వాత నాగం నాగర్‌కర్నూల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తలు, నాయకులతో సంప్రదింపులు జరుపుతూ వచ్చారు.
ఇక నాగం జనార్దన్‌రెడ్డి చేరికను ఉమ్మడి జిల్లా కాంగ్రెస్‌కు పెద్ద దిక్కయిన డీకే.అరుణ, నాగర్‌కర్నూల్ ఎంపీ నంది ఎల్లయ్య తదితరులు వ్యతిరేకించడంతోపాటు రాష్ట్ర పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని కలిపి ఆయనను పార్టీలో చేర్చుకోవద్దని వాదన వినిపించారు. ఉమ్మడి జిల్లాలోని డీకే.అరుణ వర్గీయులందరూ సమావేశమై నాగం, జగదీశ్వర్‌రావుకు వ్యతిరేకంగా జట్టు కట్టారు. ఈ తరుణంలో నాగం, జగదీశ్వర్‌రావుల రాహుల్ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరడంతో కందనూలు కాంగ్రెస్ పార్టీలోని ఇరు నియోజకవర్గాల్లో వర్గ పోరు మొదలైనట్లయింది.
భారీ సభకు ఏర్పాట్లు
కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న నాగం జనార్దన్‌రెడ్డి రానున్న అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా నాగర్‌కర్నూల్‌లో భారీ బహిరంగ సభ నిర్వహణకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. రాష్ట్ర స్థాయి నేతలందరినీ ఇక్కడకు రప్పించి టీఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా సమర శంఖారావం పూరించేందుకు ఆయన సిద్ధమవుతున్నారని నాగం అనుచరులు చెబుతున్నారు. మరోపక్క తమ మద్దతుదారులతో నాగర్‌కర్నూల్‌లో భారీ ర్యాలీ నిర్వహించేందుకు నాగం సమాయత్తమవుతున్నారు.
ఎమ్మెల్సీ దామోదర్‌రెడ్డితోపాటు నియోజకవర్గంలోని మిగతా కీలక నేతలందరినీ కలుపుకుపోయి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తనకు కాంగ్రెస్ తరఫున టికెట్ తెచ్చుకునేందుకు నాగం బల ప్రదర్శన చేయనునున్నారని తెలుస్తోంది. ఇప్పటివరకు మౌనంగా ఉన్న నాగర్‌కర్నూల్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు నాగం పార్టీలో చేరడంతో ఏ పరిణామాలు చోటు చేసుకుంటాయోనని ఆసక్తిగా పరిశీలిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment