పక్కనే కృష్ణానది ప్రవహిస్తున్నా బీడువారుతున్న పొలాలు.. కరువు రాజ్యమేలుతున్న ప్రాంతాలు.. చెంతనే నది ఉన్నా గుక్కెడు నీటికోసం దాహంతో అలమటించాల్సిన దుస్థితి.. వృథాగా పోతున్న నీటిని చూసి, ఎండిపోతున్న పంటలను చూసి నిట్టూర్పులు విడవడం తప్ప చేయగలిగిందేమి లేని పరిస్థితి. ఇవీ నాగార్జున సాగర్ నిర్మించకముందు ఉన్న సంగతి. నాటి పాలకుల దార్శనికతతో అతిపెద్ద మానవ నిర్మిత డ్యాం నిర్మాణానికి అంకురార్పణ జరిగింది. ఆధునిక దేవాలయంగా పిలవబడిన నాగార్జున సాగర్ నిర్మాణంతో కృష్ణమ్మ పరుగు పంటపొలాల వైపు మళ్లింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సస్యశ్యామలమై అన్నపూర్ణగా ఖ్యాతి గడించింది.. డ్యాం శంకుస్థాపన జరిగి నేటికి 64 ఏళ్లు అయిన సందర్భంగా ప్రత్యేక కథనం
సాక్షి, మాచర్ల: ఆధునిక దేవాలయమైన నాగార్జునసాగర్ డ్యాం శంకుస్థాపన జరిగి నేటికి 64 సంవత్సరాలు. ఉమ్మడి తెలుగు రాష్ట్రాలను అన్నపూర్ణగా మార్చేందుకు భారత తొలి ప్రధానమంత్రి జవహర్‌లాల్ నెహ్రూ 64 ఏళ్ల క్రితం శంకుస్థాపన చేశారు. 1955 డిసెంబర్ 10వ తేదీన నాటి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ పైలాన్, విజయపురిసౌత్‌లలో శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించారు. శ్రీశైలం రిజర్వాయర్ నుంచి నాగార్జునసాగర్‌కు వచ్చే నీటిని నందికొండ ప్రాజెక్టు వద్ద నిలుపుదల చేసేందుకు 26 క్రస్ట్‌గేట్లతో ప్రాజెక్టు నిర్మాణం చేపట్టారు. వీటితోపాటు సాగర్ రిజర్వాయర్ నుంచి కుడి, ఎడమ కాలువలతోపాటు ప్రధాన జలవిద్యుత్ కేంద్రం, కాలువలకు అనుబంధంగా జలవిద్యుత్ కేంద్రాలను నిర్మించారు. 1967లో నాటి ప్రధానమంత్రి స్వర్గీయ ఇందిరాగాంధీ చేతుల మీదుగా ప్రాజెక్టు ప్రారంభమైంది. కుడి కాలువకు జవహర్‌లాల్ నెహ్రూ, ఎడమ కాలువకు లాల్‌బహుదూర్ శాస్త్రి కాలువలుగా నామకరణం చేశారు.
నాగార్జునసాగర్ కుడికాలువ నుంచి నీరు విడుదలవుతున్న దృశ్యం
వైఎస్సార్ హయాంలో కాల్వల ఆధునికీకరణ
గుంటూరు, ప్రకాశం, కృష్ణా డెల్టా, ఖమ్మం, నల్గొండ జిల్లాలతోపాటు నెల్లూరు జిల్లాకు నీరు చేరాల్సి ఉన్నా ఆల్మట్టి డ్యాం నిర్మాణం, పెంపుదల, వరదలు తగ్గిపోవటం, వచ్చిన నీటిని వచ్చినట్లు కర్నాటక రాష్ట్రం ఉపయోగించుకోవటంతో నీటి సమస్యతో చాలా సంవత్సరాలు ఆయకట్టు రైతులు ఇబ్బందిపడ్డారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో రెండు పంటలకు నీరు ఇవ్వటంతోపాటు ప్రపంచ బ్యాంకు నిధులతో సాగర్ ఆయకట్టుకు మరమ్మతులు చేశారు. ప్రపంచ బ్యాంక్ నిధులతో డాక్టర్ వైఎస్సార్ కాలువల ఆధునికీకరణతో రైతులకు మేలు చేసేవిధంగా నిర్ణయం తీసుకున్నా ఆయన అకాల మరణంతో ఆ పనులు నిలిచిపోయాయి. ఆ తర్వాత సాగర్, శ్రీశైలం రిజర్వాయర్‌లలో పూడిక చేరి నీటిమట్టాల గరిష్టస్థాయి తగ్గిపోయింది. దీంతో ఎన్నిసార్లు పరిశోధనలు చేసినా అధికారులు గరిష్టస్థాయి నీటిమట్టాన్ని ఉంచలేని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో సాగర్ ఆయకట్టు కుడి, ఎడమ, డెల్టా, మంచినీరు పొందుతున్న పలు ప్రాంతాల ప్రజలు తిరిగి నాలుగు నెలల నుంచి కృష్ణానదిలో భారీస్థాయిలో వరదనీరు వచ్చి తమ కష్టాలు తగ్గిపోవటంతో రైతులు ఆనందపడుతున్నారు.
డ్యాం నిర్మాణ పనులు చేస్తున్న కూలీలు (ఫైల్)
22 లక్షల ఎకరాలకు సాగునీరు లక్ష్యం..
విజయపురిసౌత్ వద్ద నుంచి కుడికాలువ సొరంగ మార్గం ద్వారా 392 కిలోమీటర్లు ప్రవహిస్తుంది. దీని పరిధిలోని 11 లక్షల ఎకరాలు సాగు చేయటానికి నాడు ప్రణాళికలు వేశారు. అయితే వివిధ పరిణామాల వలన సాగు పరిధి తగ్గిపోయింది. ఆయకట్టు పరిధిలో పూర్తిస్థాయిలో చివరి భూములకు నీరందక, లక్ష్యం నెరవేరలేదు. అదేవిధంగా ఎడమ కాలువ 349 కిలోమీటర్ల పరిధిలో 11 లక్షల ఎకరాలకు నీరందించేందుకు ప్రణాళికలు రూపొందించారు.
డ్యాం విశేషాలు..
ప్రధాన డ్యాం రేడియల్ క్రస్ట్‌గేట్లు -26
రాతి కట్టడం పొడవు -4756 అడుగులు
ఎత్తు -490అడుగులు
నీటి నిల్వ సామర్థ్యం -590అడుగులు
ఉభయ కాల్వల పరిధి -741కి.మీ
Comments
Please login to add a commentAdd a comment