చురుగ్గా కృష్ణా మూడోదశ పనులు
- కొత్తగా అధునాతన రిజర్వాయర్ల నిర్మాణం
- శాశ్వత రహదారులు
- మంత్రి పద్మారావు వెల్లడి
సికింద్రాబాద్: కృష్ణాజలాల మూడోదశ నిర్మాణపనులు చురుగ్గాసాగుతున్నాయని రాష్ర్ట ఎక్సైజ్‌శాఖ మంత్రి టీ.పద్మారావు ప్రకటించారు. రూ. వందకోట్లతో పనులు జరుగుతున్నాయన్నారు. సికింద్రాబాద్ ప్రాంతంలో తాగునీరు, మురుగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారమార్గం చూపేందుకు బృహత్తర ప్రణాళిక రూపొందించామని ఆయన ప్రకటించారు. డిసెంబర్ నెలాఖరు నాటికి తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారమార్గం లభిస్తుందన్నారు. అదే విధంగా రూ. 600 కోట్లతో ఈ ప్రాంతంలోని డ్రైనేజీ వ్యవస్థను సమూలంగా ఆధునీకరించనున్నామని తెలిపారు.
సీఎం నుంచి అనుమతి వచ్చినవెంటనే పనులు ప్రారంభమవుతాయని చెప్పారు. బుధవారం జలమండలి అధికారులతో సికింద్రాబాద్, సనత్‌నగర్ నియోజకవర్గాల్లో మంత్రి పర్యటించారు. రిజర్వాయర్లను పరిశీలించారు. కృష్ణాజలాలు వచ్చేలోపు రిజర్వాయర్లను ఆధునీకరించనున్నామని చెప్పారు. అలాగే నీటి నిల్వకోసం భారీ స్టోరేజ్ రిజర్వాయర్ల నిర్మాణం కోసం ప్రతిపాదనలు సిద్ధం చేశామన్నారు. హుస్సేన్‌సాగర్, మారేడుపల్లి, తార్నాక, లాలాపేట, సీతాఫల్ మండి ప్రాంతాల్లోని ప్రస్తుత రిజర్వాయర్ల స్థానంలో అధునాతన పద్ధతుల్లో రిజర్వాయర్ నిర్మాణం పనులు చేపడుతున్నామని చెప్పారు. సికింద్రాబాద్ ప్రాంతంలో జనాభాకు సరిపడేలా డ్రైనేజీలను నిర్మిస్తామని, ఇందుకు రూ.600 కోట్లు ఖర్చు అవుతుందని అంచనాలు చేశామన్నారు. ఈ ప్రాంతంలో అధునాతన రహదారుల వ్యవస్థను ఏర్పాటుచేస్తామన్నారు.
భవిష్యత్తులో రహదారులను తవ్వే అవకాశం ఉండకుండా భూగర్భం నుంచి అవసరమైన లైన్లను వేసిన మీదట రహదారుల నిర్మాణం చేపడుతామని చెప్పారు. ప్రయోగాత్మకంగా ఎల్‌ఈడీ విద్యుత్‌దీపాల ఏర్పాటును అమలులోకి తెచ్చామన్నారు. త్వరలో అన్ని రహదారుల్లో ఇవే విద్యుత్‌దీపాలను ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో జలమండలి మారేడుపల్లి డివిజన్ మేనేజర్ ఎస్.ఆనంద్‌స్వరూప్, డిప్యూటీ జీఎంలు దామోదర్‌రెడ్డి, హరుణాకర్‌రెడ్డి, రాజశేఖర్, కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జంపన ప్రతాప్, టీఆర్‌ఎస్ నగర నాయకులు శేఖర్, ఆకుల నాగభూషణం, కరాటే రాజు, సత్యనారాయణ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.