
పోలింగ్ నేడే
ఇన్నాళ్లూ ప్రచారాలతో హోరెత్తిన నంద్యాల.. నేడు ఓటింగ్‌తో పోటెత్తనుంది. ఉప ఎన్నికలో కీలక ఘట్టమైనపోలింగ్‌కు అన్ని ఏర్పాట్లూ పూర్తయ్యాయి.
►నంద్యాల ఉపపోరుకు సర్వం సిద్ధం
► భారీగా పోలీసు బలగాల మోహరింపు
► స్వేచ్ఛగా, నిర్భయంగా ఓటెయ్యాలని అధికారుల సూచన
► ఓటెవరికి వేశారో ఇతరులెవరికీ తెలియదు
► ఓటరు మాత్రమే చూసుకునే అవకాశం
నంద్యాల/కర్నూలు(అగ్రికల్చర్): ఇన్నాళ్లూ ప్రచారాలతో హోరెత్తిన నంద్యాల.. నేడు ఓటింగ్‌తో పోటెత్తనుంది. ఉప ఎన్నికలో కీలక ఘట్టమైనపోలింగ్‌కు అన్ని ఏర్పాట్లూ పూర్తయ్యాయి. ఈ ఉప ఎన్నికను అధికార టీడీపీ, ప్రధాన ప్రతిపక్షం వైఎస్సార్‌సీపీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. దీంతో రాష్ట్రం యావత్తు నంద్యాల వైపు ఆసక్తిగా చూస్తోంది. నేటి (బుధవారం) ఉదయం ఏడు నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు పోలింగ్ నిర్వహించేందుకు ఎన్నికల సంఘం సర్వం సిద్ధం చేసింది.
సాయంత్రం ఆరులోపు క్యూలో ఉన్న వారందరినీ ఓటు వేసేందుకు అనుమతిస్తారు. పోలింగ్ నేపథ్యంలో భారీ ఎత్తున పోలీస్ బలగాలను మోహరించారు. ఓటర్లు స్వేచ్ఛగా, నిర్భయంగా ఓటు హక్కు వినియోగించుకోవాలని ఎన్నికల అధికారులు సూచిస్తున్నారు. మొదటిసారిగా వినియోగిస్తున్న వీవీప్యాట్ యంత్రాలపై అపోహలు వద్దని, ఓటెవరికి వేశారో ఇతరులెవరూ తెలుసుకునే అవకాశమే లేదని స్పష్టం చేస్తున్నారు. ఓటరు మాత్రమే ఏడు సెకన్ల పాటు చూసుకునే అవకాశం ఉంటుందని తెలిపారు.
2,18,858 మంది ఓటర్లు
నంద్యాల నియోజకవర్గంలో మొత్తం 2,18,858 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో పురుషులు 1,07,778, మహిళా ఓటర్లు 1,11,018, ఇతరులు 62 మంది ఉన్నారు. ఈ ఓటర్లలో 40శాతం మంది యువ ఓటర్లే కావడం గమనార్హం. 18 నుంచి 35 ఏళ్లలోపు ఓటర్లు 85వేల మంది ఉన్నారు. వీరి ఓట్లే ఈ ఉప ఎన్నికలో కీలకం కానున్నాయి. ఓటర్ల స్లిప్‌లు అందని వారు తగిన గుర్తింపు కార్డు చూపించి ఓటు హక్కు వినియోగించుకోవచ్చు. అన్ని పోలింగ్ కేంద్రాల్లో నీటి వసతి కల్పిస్తున్నారు. దివ్యాంగులు ఓటు వేసేందుకు వీలుగా ర్యాంప్‌లను ఏర్పాటు చేశారు. నియోజకవర్గంలో మొత్తం 255 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇందులో 141 అత్యంత సమస్యాత్మకమైనవిగా, 74 సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించారు. పోలింగ్ సరళిని లైవ్ వెబ్ కాస్టింగ్ ద్వారా ఎన్నికల అధికారులు పరిశీలించనున్నారు.
ఎక్కడైనా సమస్యలు తలెత్తితే ఫిర్యాదు చేయాలని, 25 మందితో కూడిన సాంకేతిక బృందాన్ని రప్పించామని, వీరంతా ఆర్‌డీఓ, మున్సిపల్, గోస్పాడు, నంద్యాల తహసీల్దార్ కార్యాలయాల్లో ఉంటారని అధికారులు తెలిపారు. పోలింగ్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా ఎస్పీ గోపీనాథ్ జట్టి తెలిపారు. నంద్యాలలో ఉండే సిబ్బందితో పాటు ఎస్పీలు, డీఎస్పీలు, ఎస్‌ఐలు, సీఐలు, ఏఎస్‌ఐలు, కానిస్టేబుళ్లతో పాటు ఇతర జిల్లాల పోలీస్ సిబ్బంది, పారామిలటరీ బలగాలతో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. ప్రతి పోలింగ్ బూత్ వద్ద బాడీ ఓన్, సీసీ, డ్రోన్ కెమెరాలతో ప్రత్యేక నిఘా ఉంచుతున్నారు.
ప్రధాన పోటీ వైఎస్సార్‌సీపీ, టీడీపీ మధ్యనే..
నంద్యాల ఉప ఎన్నిక బరిలో 15 మంది అభ్యర్థులు ఉన్నారు. అయితే.. వైఎస్‌ఆర్‌సీపీ, టీడీపీ మధ్యనే ప్రధాన పోటీ నెలకొంది. అధికార పార్టీకి ఓటమి భయం పట్టుకోవడంతో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎంఎల్‌సీలు నోటిఫికేషన్‌కు ముందు నుంచే నంద్యాలలో మకాం పెట్టారు. ఎన్నికల ప్రచారం ఈ నెల 21వ తేదీ సాయంత్రం 6గంటలతో ముగిసింది, ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం ఇతర జిల్లాలకు చెందిన మంత్రులు, ప్రజాప్రతినిధులు, నేతలు జిల్లా వదలి వెళ్లాల్సి ఉంది. కానీ నంద్యాల నియోజకవర్గానికి చేరువలోనే మకాం వేసి ఓటర్లను ప్రలోభపెట్టే చర్యలను వేగవంతం చేసినట్లు సమాచారం.
ముఖ్యమైన అధికారుల ఫోన్ నంబర్లు
ఎన్నికల సాధారణ పరిశీలకుడు హిమాన్స్ జ్యోతి చౌదరి సెల్ నంబరు 9704009097, వ్యయ పరిశీలకుడు ముకాంబికేయన్ 70329 49977, పోలీసు పరిశీలకుడు డేవిడ్‌సన్ 99892 23650, రిటర్నింగ్ అధికారి సెల్ నంబరు 89788 40011.