స్వధారా హోమ్‌లో చైల్డ్‌లైన్ స్టాఫ్‌తో మాట్లాడుతున్న రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్ నన్నపనేని రాజకుమారి
తూర్పుగోదావరి, రాజమహేంద్రవరం రూరల్: అక్రమ రవాణా అనుమానంతో కోణార్క్ ఎక్స్‌ప్రెస్ రైలు నుంచి రాజమహేంద్రవరం స్టేషన్‌లో దించేసిన యువతులను ఒరిస్సా ప్రభుత్వంతో మాట్లాడి సురక్షితంగా వారి స్వస్థలాలకు పంపిస్తామని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్ నన్నపనేని రాజకుమారి స్పష్టం చేశారు. ఆమె ఆదివారం మధ్యాహ్నం ఆ యువతులు ఆశ్రయం పొందిన బొమ్మూరు మహిళా ప్రాంగణం ఆవరణలోని స్వధారహోమ్‌ను సందర్శించారు. ఆ 17మంది యువతులు ఎక్కడ నుంచి ఎక్కడికి వెళుతున్నారు? పనికి వెళుతున్నారా? అనే విషయాలను ట్రాన్స్‌లేటర్, రైల్వే ఉద్యోగి లాజర్ ద్వారా అడిగి తెలుసుకున్నారు. ఒడిశా రాష్ట్రంలోని బరంపూర్ జిల్లాకు చెందిన ముగ్గురు, గంజాం జిల్లాకు చెందిన ఏడుగురు, కాండుజొరో జిల్లాకు చెందిన ఆరుగురు, బలుగర్ జిల్లాకు చెందిన ఒక యువతి ఉన్నట్టు గుర్తించారు. ఒడిశా నుంచి వారు ముంబాయి రైల్లో వెళుతుండగా చైల్డ్‌లైన్ ఫోన్ నెంబరుకు ఒక ప్రయాణికురాలు ఫోన్ చేయడంతో సామర్లకోట రైల్వేస్టేషన్‌లో చైల్డ్‌లైన్ స్టాఫ్ సాయిలక్ష్మి, లక్ష్మి వారిని దించే ప్రయత్నం చేశారు. అయితే ఆ యువతులు అక్కడ దిగకపోవడంతో రాజమహేంద్రవరం రైల్వేస్టేషన్‌లో వారిని జీఆర్పీ పోలీసుల సహాయంతో రైలు నుంచి దించేసి టూటౌన్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అక్కడ చైల్డ్‌లైన్ ప్రతినిధుల విచారణలో చేపలసీడ్ శుభ్రం చేసే పనికి వారు వెళుతున్నట్లు తేలింది. దాంతో ఆయువతులను బొమ్మూరులోని స్వధార్ హోమ్‌కు తరలించారు. వారిలో ఒక యువతి సోదరుడికి కాలువిరగడంతో ఆస్పత్రికి వెళుతుండగా, ఇంకో యువతి తల్లిదండ్రుల వద్దకు వెళుతోందని తేలింది.
యువతులను విచారణ జరిపిన అనంతరం రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్ రాజకుమారి అర్బన్‌జిల్లా ఎస్పీ షీమోషిబాజ్‌పేయ్, ఇతర పోలీసుఅధికారులతో ఫోన్‌లో మాట్లాడి ఆ యువతులు సురక్షితంగా వారి స్వస్థలాలకు చేరేవరకు పూర్తిరక్షణ కల్పించాల్సిందిగా కోరారు. అనంతరం రాజకుమారి విలేకరులతో మాట్లాడుతూ యువతులు ఏరాష్ట్రానికి చెందినవారైనా వారి మానప్రాణాలు కాపాడాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. వారిపై అనుమానాలు ఉన్నప్పటికీ సురక్షితంగా వారు ఇళ్లకు చేరేలా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో మాట్లాడి ఒడిశా ముఖ్యమంత్రి నవీన్‌పట్నాయక్‌తో మాట్లాడిస్తామని తెలిపారు. ఆయువతులు ముంబాయిలోని పనికి వెళుతున్నామని చెబుతున్నారని, వారి వద్ద కనీసం రూపాయి కూడా లేదన్నారు. ఒడిశా రాష్ట్ర ప్రభుత్వానికి ఆయువతులను అప్పగిస్తామన్నారు. అనంతరం ఐసీడీఎస్ ప్రాజెక్టు డైరెక్టర్ సుఖజీవన్‌బాబు, చైల్డ్‌లైన్ కోఆర్డినేటర్ బి.శ్రీనివాసరావులతో అర్బన్‌జిల్లా మహిళాపోలీస్‌స్టేషన్ డీఎస్పీ పి.మురళీధరన్, టూ టౌన్ పోలీసు స్టేషన్ ఇన్‌స్పెక్టర్ పవన్‌కుమార్‌రెడ్డి, ఎస్సై వి.వెంకటేశ్వరరావు, ధవళేశ్వరం ఎస్సై వెంకయ్య, పీఎస్సై అమీనాబేగం మాట్లాడారు. రాష్ట్ర మహిళా కమిషన్ ద్వారా ఒడిశా రాష్ట్ర మహిళా కమిషన్‌కు లేఖ రాసి ఆయువతులను పోలీస్‌ఎస్కార్ట్‌తో వారి స్వస్థలాలకు తరలించేలా చర్చించారు. ఆ యువతులను సోమవారం ఒడిశాకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఐసీడీఎస్ పీడీ సుఖజీవన్‌బాబు తెలిపారు. రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు డాక్టర్ శిరిగినీడి రాజ్యలక్ష్మి, ఐసీడీఎస్ రాజానగరం సీడీపీవో పి.సుశీలకుమారి, మహిళాప్రాంగణం మేనేజర్ పి.వెంకటలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment