ఏసీబీ డీజీకి గవర్నర్ ఆదేశం
సాక్షి, హైదరాబాద్: వివిధ శాఖల్లోని అవినీతి అధికారుల జాబితాను పంపాల్సిందిగా గవర్నర్ నరసింహన్ ఏసీబీ డీజీ ఎ.కె.ఖాన్‌ను ఆదేశించారు. అవినీతి ఎక్కువగా ఉందని, అవినీతికి పాల్పడే అవకాశం ఉందని భావించిన శాఖల్లోని అధికారుల జాబితాను పంపాలని తెలిపారు. ఏసీబీ, విజిలెన్స్ కేసులకు సంబంధించి ప్రభుత్వం ఉపసంహరించిన వాటి జాబితాను కూడా పంపాలన్నారు. అవినీతికి పాల్పడే అధికారులపై నిఘా ఉంచనున్నట్లు గవర్నర్ హెచ్చరించారు. బుధవారం ఉన్నతాధికారులతో నిర్వహించిన సమావేశంలో సీఎస్ మహంతి ఈ విషయం తెలియజేశారు. గవర్నర్‌కు పంపించే నోట్‌ను సాధారణ పరిపాలన శాఖకు కూడా పంపాలని ఖాన్‌కు మహంతి సూచించారు. ఆ నోట్‌ను అన్ని ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులకు సర్క్యులేట్ చేయనున్నట్లు సీఎస్ తెలిపారు.
ఎంతటి వారినైనా వదలం: ఎ.కె ఖాన్
హైకోర్టు ఆదేశాల మేరకు మద్యం సిండికేట్ల కేసుపై తిరిగి దృష్టి సారించిన ఏసీబీ, దర్యాప్తు ముమ్మరం చేసింది. దీనికి సంబంధించి అప్పటి జేడీ (ప్రస్తుతం హోంశాఖ ప్రత్యేక కార్యదర్శి) శ్రీనివాసరెడ్డి సేకరించిన ఆధారాలను కూడా ఏసీబీ అధికారులు పరిశీలిస్తున్నట్లు తెలిసింది. మరిన్ని ఆధారాల కోసం ఏసీబీ ప్రత్యేక బృందం శోధిస్తున్నట్లు సమాచారం. ఈ సందర్భంగా ఎ.కె. ఖాన్ మాట్లాడుతూ, హైకోర్టు ఆదేశాల మేరకు దర్యాప్తు సాగిస్తున్నామని, ఆధారాలుంటే ఎంతటి వారున్నా చర్య తీసుకుంటామని స్పష్టం చేశారు. ఖమ్మం జిల్లాలో గతంలో వెలుగు చూసిన మద్యం సిండికేట్ల కుంభకోణం రాష్ట్రంలో సంచలనం సృష్టించడం తెలిసిందే. ఇక్కడ ఏసీబీకి పట్టుబడ్డ ఎక్సైజ్ అధికారుల డైరీల్లోని సమాచారం ఆధారంగా ఇతర జిల్లాల్లో విస్తరించిన మద్యం సిండికేట్ల వ్యవహారం బట్టబయలైన విషయం విదితమే.
అవినీతి అధికారుల జాబితా పంపండి
Published Thu, Mar 6 2014 5:30 AM | Last Updated on Sat, Sep 22 2018 8:22 PM
Advertisement
Advertisement