విజయనగరం గంటస్తంభం: విజయనగరం జిల్లాకు గుర్తింపులా 108 అడుగుల ఎత్తులో జాతీయ జెండాను ఏర్పాటు చేశారు. 20 అడుగులు వెడల్పు, 30 అడుగులు పొడవు ఉన్న ఈ జెండాను కలెక్టర్ హరిజవహర్‌లాల్ గురువారం ఆవిష్కరించారు. ఎయిర్‌పోర్టులు, మరికొన్ని ప్రధాన నగరాల్లో కనిపించే పొడవైన స్తంభాలపై జాతీయ జెండాను తొలిసారిగా జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో ఏర్పాటు చేయాలని కలెక్టరు నిర్ణయించారు. ప్రభుత్వ అనుమతి లభించడంతో రూ.12.50 లక్షలు వ్యయం చేసి 108 అడుగులు పొడువు ఉండే స్తంభాన్ని ఉత్తరప్రదేశ్ ఘజియాబాద్‌లో గ్యాలవైజ్డ్ ఇనుముతో తయారు చేయించారు. బుధవారం ఆ స్తంభాన్ని విజయనగరం ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, విజయనగరం ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామితో కలిసి కలెక్టర్ ఆవిష్కరించారు. స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని జెండాను గురువారం కలెక్టర్ ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జిల్లా చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే ఘట్టాన్ని గురువారం ఆవిష్కరించడం సంతోషమన్నారు. గుంటూరు తర్వాత విజయనగరంలోనే ఇంత పెద్ద జెండా స్తంభాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
జెండా ఆవిష్కరించిన కలెక్టర్..
73వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని గురువారం కలెక్టరేట్ కార్యాలయంలో జాతీయ జెండాను కలెక్టర్ హరిజవహర్‌లాల్ ఆవిష్కరించారు. తొలుత జాతీయ జెండాను ఆవిష్కరించిన ఆయన తర్వాత వందనం చేశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో పేదరికాన్ని నిర్మూలించేందుకు, అభివృద్ధి పథంలో నడిపించేందుకు సహకరించాలని అధికార యంత్రాంగాన్ని కోరారు. మహాత్మగాంధీ కలలు గన్న గ్రామ స్వరాజ్యం గ్రామ, వార్డు వలంటీర్లు, సచివాలయాల వ్యవస్థతో సాకారం అవుతుందన్నారు. కార్యక్రమంలో అసిస్టెంట్ కలెక్టర్ కేతన్ గార్గ్, ఇన్‌చార్జి జేసీ–2 సాల్మన్‌రాజ్, డీఆర్వో వెంకటరావు, విజయనగరం ఆర్డీఓ జెవి.మురళి, ఇతరులు పాల్గొన్నారు.
రక్షాబంధన్ వేడుకలు..
రక్షాబంధన్ సందర్భంగా కలెక్టరేట్‌లో వేడుకలు నిర్వహించారు. కలెక్టర్‌కు పలువురు మహిళలు రాఖీ కట్టి సోదర భావాన్ని తెలిపారు. ఆయనతో పాటు పలువురు అధికారులు కూడా కార్యక్రమంలో పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment