సహజ న్యాయం.. సమ పంపిణీ | natural law, equal distribution of krishna river water | Sakshi
Sakshi News home page

సహజ న్యాయం.. సమ పంపిణీ

Published Sat, Jan 3 2015 2:21 AM | Last Updated on Sat, Sep 2 2017 7:07 PM

సహజ న్యాయం.. సమ పంపిణీ

సహజ న్యాయం.. సమ పంపిణీ

* కృష్ణా ట్రిబ్యునల్ విచారణాంశాలకు ఇదే మూలంగా ఉండాలి
* 5న ట్రిబ్యునల్‌కు అఫిడవిట్లు సమర్పించనున్న తెలంగాణ, ఏపీ

సాక్షి, హైదరాబాద్: కృష్ణా జలాల పంపిణీలో సమ న్యాయం జరగాలంటే ట్రిబ్యునల్ విచారణ పరిధిలో నాలుగు రాష్ట్రాలూ ఉండాల్సిందేనంటూ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు ట్రిబ్యునల్‌కు ఈ నెల 5న అఫిడవిట్లు సమర్పించాలని నిర్ణయించాయి. సహజ న్యాయం, సమ పంపిణీ ప్రామాణికంగా ట్రిబ్యునల్ విచారణ సాగాలంటే.. ఎగువ రాష్ట్రాలైన మహా రాష్ట్ర, కర్ణాటక కూడా ట్రిబ్యునల్ విచారణ పరిధిలో ఉండాలని స్పష్టం చేయనున్నాయి.

ఎగువ రాష్ట్రాలకు బేసిన్ వారీ(ఎన్‌బ్లాక్) కేటాయింపులు చేసి, దిగువ రాష్ట్రాలు(తెలంగాణ, ఏపీ)కి ప్రాజెక్టుల వారీగా కేటాయింపులు చేయడం సహజ న్యాయానికి విరుద్ధమని, అలా చేస్తే సమ పంపిణీ జరగదని వాదించనున్నాయి. ట్రిబ్యునల్ ముందుకు తేవాల్సిన అంశాలపై చర్చించేందుకు తెలంగాణ సాంకేతిక సలహా కమిటీ (టెక్నికల్ అడ్వైజర్ కమిటీ) శనివారం మళ్లీ సమావేశం కానుంది. కృష్ణా నదీ జలాల వివాద పరిష్కారానికి ట్రిబ్యునల్ విచారించాల్సిన అంశాలను, విచారణ పరిధి, విస్తృతిపై ముసాయిదా విధివిధానాలను పేర్కొంటూ జనవరి 5లోగా అఫిడవిట్లు దాఖలు చేయాలని జస్టిస్ బ్రిజేష్ కుమార్.. కృష్ణా జలాలతో సంబంధం ఉన్న నాలుగు రాష్ట్రాలకు సూచించిన విషయం విదితమే.

ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 89 ప్రకారం.. ప్రాజెక్టుల వారీగా నీటి కేటాయింపులతోపాటు ప్రాజెక్టు నీటి విడుదల ప్రొటోకాల్స్‌ను బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ నిర్ధారించాలి. పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం పొడిగించిన కృష్ణా ట్రిబ్యునల్ కేవలం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకే పరిమితమంటూ కేంద్ర ప్రభుత్వం లేఖ ఇచ్చింది. అయితే ఈ లేఖలను అంగీకరించని ట్రిబ్యునల్.. అన్ని వివరాలతో అఫిడవిట్ దాఖలు చేయాలని గతంలో కేంద్రానికి సూచించింది. కానీ కేంద్రం ఇప్పటిదాకా అఫిడవిట్ సమర్పించలేదు.

తెలంగాణ కసరత్తు దాదాపు పూర్తి..
కృష్ణా ట్రిబ్యునల్‌కు సమర్పించాల్సిన అఫిడవిట్‌పై తెలంగాణ దాదాపు తన కసరత్తు పూర్తి చేసింది. కృష్ణా జలాల వివాదాన్ని కేవలం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య పంచాయితీగా చూడరాదని, కృష్ణా నీటిని నాలుగు రాష్ట్రాలు వినియోగించుకుంటున్నప్పుడు, కేటాయింపుల్లోనూ నాలుగు రాష్ట్రాలు భాగస్వాములుగా అవుతాయనే విషయాన్ని ట్రిబ్యునల్ దృష్టికి తెచ్చేందుకు సిద్ధమైంది.

కృష్ణాలో నీటి లోటు ఉన్న సమయాల్లో తెలంగాణ, ఏపీలకు ప్రాజెక్టుల వారీగా ఆపరేషన్ ప్రొటోకాల్‌ను నిర్ధారించడం ఎలా సాధ్యమని తెలంగాణ ప్రశ్నిస్తోంది. అలాగే ఈ రెండు రాష్ట్రాలకు ప్రాజెక్టుల వారీగా కేటాయింపులు జరిపి, ఎగువనున్న రాష్ట్రాలకు బేసిన్‌ల వారీగా కేటాయింపులు ఎలా జరుపుతారని అడుగుతోంది. తెలంగాణ, ఏపీలు కొత్త ప్రాజెక్టులు నిర్మించినప్పుడు ఎగువ రాష్ట్రాల అంగీకారం ఉంటుందా అనే వాదనను బలంగా వినిపించనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement