నెల్లూరు(పొగతోట): ఎన్నికల సమయంలో ప్రజలకిచ్చిన హామీలను తుంగలో తొక్కిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నయవంచకుడని వైఎస్సార్‌సీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. సమస్యల పరిష్కారం కోరుతూ ఆరురోజులుగా నెల్లూరు కలెక్టరేట్ ఎదుట హౌసింగ్ కార్పొరేషన్ ఔట్‌సోర్సింగ్ ఇన్‌స్పెక్టర్లు, డేటాఎంట్రీ ఆపరేటర్లు రిలేనిరాహారదీక్ష చేస్తున్నారు. వీరికి మద్దతుగా శనివారం ప్రసన్నకుమార్‌రెడ్డి, నగర డిప్యూటీ మేయర్ ముక్కాల ద్వారకానాథ్, కార్పొరేటర్లు దీక్షలో కూర్చున్నారు.
ఈ సందర్భంగా నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి మాట్లాడుతూ ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగ భృతి కింద రూ.2000 ఇస్తానని హామీ ఇచ్చిన చంద్రబాబు అధికారంలోకి వచ్చాక వాటిని పక్కన పడేసి ఉన్న ఉద్యోగులను రోడ్డున పడేలా చేశాడని దుయ్యబట్టారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ 2006లో ప్రతి గ్రామంలో పేదలకు ఇందిరమ్మ పథకం అందేందుకు రాష్ట్రంలో 2006లో 2,250 మంది వర్క్ ఇన్‌స్పెక్టర్లను నియమించారన్నారు. నేడు అధికారంలోకి వచ్చిన చంద్రబాబు జీతాలు ఇవ్వలేమని వారిని ఉద్యోగాల నుంచి తొలగించడం దారుణమని మండిపడ్డారు. హైదరాబాద్‌లో క్యాంపు ఆఫీసుకు రూ.19 కోట్లు ఎలా ఖర్చు చేశాడని ప్రశ్నించారు.
సాముహిక నిరసన
తొలగించిన ఉద్యోగులను విధుల్లోకి తీసుకోవాలంటూ హౌసింగ్ ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు సామూహిక ఉరితో నిరసన వ్యక్తం చేశారు. కలెక్టరేట్ గేట్‌కు ఎదురుగా 20 మంది ఉద్యోగులు సామూహికంగా ఉరి వేసుకుంటున్నట్టు తాళ్లను తగిలించుకున్నారు. తమ డిమాండ్లను పరిష్కరించకపోతే కుటుంబ సభ్యులతో ఆత్మహత్యలు చేసుకుంటామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు పి.రూప్‌కుమార్‌యాదవ్, ఓబిలి రవిచంద్ర, డి.రాజశేఖర్, వూటుకూరు మాధవయ్య, జి.నాగరాజు, ఎండీ ఖలీల్ అహ్మద్, ఎం.ప్రశాంతికుమార్, హౌసింగ్ కార్పొరేషన్ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు నాగిరెడ్డి సునీల్‌కుమార్, బైనబోయిన పోలరావు, దవనం వెంకటసునీల్‌కృష్ణ, వైఎస్సార్‌సీపీ నాయకులు ఎస్‌కే షబ్బీర్, జాకీర్ పాల్గొన్నారు.
హామీలను తుంగలో తొక్కిన బాబు
Published Sun, Aug 24 2014 5:05 AM | Last Updated on Sat, Oct 20 2018 6:04 PM
Advertisement