సాక్షి, శ్రీకాకుళం: పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో టీడీపీకి కోలుకోలేని ఎదురుదెబ్బ తగిలింది. టీడీపీ ఆవిర్భావం నుంచి పార్టీలో చురుగ్గా ఉంటున్న వేనాటి కుటుంబానికి చెందిన నేత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. సూళ్లూరుపేట నియోజకవర్గ టీడీపీ ముఖ్యనేత వేనాటి రామచంద్రారెడ్డి కుమారుడు, సూళ్లూరుపేట మున్సిపల్ కౌన్సిలర్ వేనాటి సుమంత్‌రెడ్డి సోమవారం శ్రీకాకుళం జిల్లాలో ప్రజాసంకల్పయాత్రలో వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి సమక్షంలో వైఎస్సార్ సీపీ తీర్థం పుచ్చుకున్నారు. సుమంత్‌రెడ్డికి వైఎస్ జగన్ కండువా కప్పి పార్టీలోకి చేరారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు కిలివేటి సంజీవయ్య, కాకాని గోవర్దన్ రెడ్డి, వైఎస్సార్ సీపీ నాయకులు పెర్నాటి శ్యామ్ ప్రసాద్ రెడ్డి, టి. సుబ్రహ్మణ్యం రెడ్డి, కే కమలాకర్ రెడ్డి, పీ. సుధాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
వైఎస్ జగన్ విజన్ నచ్చింది
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన అనంతరం సుమంత్ రెడ్డి మాట్లాడుతూ.. తాను వైఎస్ జగన్‌కి అభిమానినని, ఆయన విజన్ తనకు ఎంతో నచ్చిందని అందుకే పార్టీలో చేరినట్లు ప్రకటించారు. వైఎస్ జగన్ సీఎం అయితేనే రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరుగుతుందన్నారు. ఎన్టీఆర్ టీడీపీని స్థాపించినప్పటి నుంచి పార్టీలోనే ఉన్నామని, అయితే పార్టీలో జరిగిన అవమానాలు భరించలేకే ఈ నిర్ణయం తీసుకున్నామని ఆయన తెలిపారు. సూళ్లూరుపేటలో తాగునీటిని కూడా ఇప్పించలేకపోయామని సుమంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment