ఏమిటి?: పులిచింతల, ప్రకాశం బ్యారేజీల మధ్య కృష్ణానదిపై మరో వంతెనతో కూడిన ఆనకట్ట నిర్మాణానికి సర్కారు యోచన.
ఎందుకు?: నదికి రెండు వైపులా 30 కి.మీ. విస్తీర్ణంలో కొత్త నగరం ఏర్పడుతుందని, దీనికి తాగునీటి అవసరాలు తీర్చాలంటే కొత్త ఆనకట్ట అవసరమని ప్రభుత్వ భావన.
ఎక్కడ?: అమరావతి-చెవిటికల్లు, లేదా గుడిమెట్ల-తాడువాయి ప్రాంతాల్లో నిర్మించాలన్నది ప్రస్తుత ఆలోచన.
6 టీఎంసీలు: బ్యారేజీ నిర్మిస్తే సుమారు 6 టీఎంసీల నీటిని నిల్వ చేసుకోవచ్చని అధికారుల అంచనా. బ్రిడ్జి వల్ల విజయవాడ ట్రాఫిక్ సమస్యకు పరిష్కారం లభిస్తుందని అనుకుంటున్నారు.
సాక్షి, విజయవాడ బ్యూరో: కొత్త రాజధాని తాగునీటి అవసరాలు తీర్చడానికి సర్కారు సమాయత్తమవుతోంది. అందుకోసం పులిచింతల, ప్రకాశం బ్యారేజీల మధ్య కృష్ణానదిపై మరో వంతెనతో కూడిన ఆనకట్ట నిర్మాణానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. విజయవాడ పరిసరాల్లోనే నూతన రాజధాని అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించిన నేపథ్యంలో ఈ బ్యారేజీ నిర్మించాల్సిన అవసరం కనిపిస్తోంది.
కృష్ణానదికి ఇరువైపులా ఉన్న ప్రాంతంలోనే కొత్త రాజధాని అన్న ఊహాగానాలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో.. నీటిపారుదల శాఖ అధికారులు తీసుకుంటున్న నిర్ణయాలు దీని నిర్మాణ ప్రతిపాదనలకు బలం చేకూరుస్తున్నాయి. నదికి తూర్పున కృష్ణా, పశ్చిమాన గుంటూరు జిల్లాలు ఉన్నాయి. నదికి రెండు వైపులా 30 కిలోమీటర్ల విస్తీర్ణంలో కొత్త నగరం ఆవిర్భవించనుందని అధికార పార్టీ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, ఎంపీ జేసీ దివాకరరెడ్డి ప్రకటించారు.
ఈ నెల 3న తనను కలసిన వామపక్ష నేతలతోనూ సీఎం ఇదే విషయాన్ని చెప్పారు. దీన్నిబట్టి నదికి పశ్చిమానున్న మంగళగిరి, వెంకటాయపాలెం, తుళ్లూరు, అమరావతి మండలాలు, తూర్పున ఉన్న గొల్లపూడి, పరిటాల, కంచికచర్ల, ఇబ్రహీంపట్నం ప్రాంతాల్లో జనావాసాలు, కార్యాలయ భవనాల నిర్మాణం జరుగుతుందని అధికార పక్ష నేతలు భావిస్తున్నారు. అలా అయితే వచ్చే ఐదేళ్లలో రెండు నుంచి మూడు లక్షల జనాభా పెరిగే అవకాశముంది. వీరికి తాగునీరు అందించే వీలవుతుందా? అన్న కోణంలో ప్రభుత్వం దృష్టి సారించిందని సమాచారం.
ప్రకాశం బ్యారేజీ నీటి నిల్వ సామర్థ్యం 3 టీఎంసీలు. అయినా పూడిక పెరిగి ఆ నిల్వ సామర్థ్యం బాగా తగ్గింది. ప్రస్తుతం ఇక్కడ నుంచే బెజవాడ, గుంటూరు, మంగళగిరికి తాగునీరు సరఫరా చేస్తున్నారు. భవిష్యత్తులో నగరాలు విస్తరిస్తే ఈ నీటిని సర్దుబాటు చేయడం అధికారులకు కష్టమే. ఈ నేపథ్యంలో తాగునీటి సమస్య తలెత్తకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం ప్రకాశం బ్యారేజీకి ఎగువన మరో బ్రిడ్జి కమ్ బ్యారేజీ నిర్మాణానికి ఆలోచన చేస్తోంది. ఇప్పటికే నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులతో ఈ విషయంపై చర్చించినట్లు సమాచారం.
అమరావతి-చెవిటికల్లు, లేదా గుడిమెట్ల, తాడువాయి ప్రాంతాల్లో బ్రిడ్జి కమ్ బ్యారేజీ నిర్మిస్తే ఎలా ఉంటుందన్న దానిపై అంచనాలు రూపొందించాలని అధికారులను ఆదేశించినట్లు తెలిసింది. దీనివల్ల ఐదు, తొమ్మిదో నంబరు జాతీయ రహదారుల మధ్య కనెక్టివిటీ ఏర్పడి విజయవాడ మీదుగా వెళ్లే వాహనాల సంఖ్య తగ్గుతుందనీ, దీనివల్ల నగరంలో ట్రాఫిక్ సమస్యకు పరిష్కారం లభిస్తుందన్నది ప్రభుత్వ ఆలోచనగా ఉంది. అంతేకాకుండా గోదావరి, కృష్ణా నదుల అనుసంధానం వల్ల కృష్ణాలోని ఎగువ జలాలను కర్నూలు, నెల్లూరు జిల్లాలకు ఏ మేరకు మళ్లించే వీలుంటుందో పరిశీలించి ప్రతిపాదనలు తయారు చేయాలని కూడా ప్రభుత్వం చీఫ్ ఇంజనీర్లకు ఆదేశాలు జారీ చేసింది.
6 టీఎంసీల నిల్వ అవకాశం...
ఏటా వర్షాలు సక్రమంగా పడితే పులిచింతల దిగువనున్న మున్నేరు నుంచి ప్రకాశం బ్యారేజీకి 50 నుంచి 60 టీఎంసీల నీరు వచ్చి చేరుతుంది. కొత్తగా బ్రిడ్జి కమ్ బ్యారేజీ నిర్మిస్తే అక్కడ సుమారు 6 టీఎంసీల నీటిని నిల్వ చేసుకోవచ్చని అధికారుల అంచనా. అమరావతి-చెవిటికల్లు మధ్య వంతెన, బ్యారేజీ నిర్మాణానికి ప్రతిపాదనలు తయారు చేయాలని 2005లోనే అప్పటి సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి అధికారులను ఆదేశించారు.
అక్కడ సాధ్యం కాకపోతే పెదఅవుటపల్లి, ఫెర్రీ, మీదుగా గుంటూరు జిల్లా వెంకటాయపాలెం, కాజ గ్రామం వరకూ నిర్మించ తలపెట్టిన విజయవాడ బైపాస్ రోడ్డు పనుల్లో భాగంగా వెంకటాయపాలెం దగ్గర నదిపై వంతెన నిర్మించాల్సి ఉంది. అక్కడే బ్యారేజీని నిర్మించేందుకు అవసరమైన ప్రతిపాదనలను కూడా తయారు చేసే అవకాశాలున్నాయనీ, అది నిర్మిస్తే నూతన నగరానికి భవిష్యత్తులో తాగునీటి సమస్యే ఉండబోదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ఏపీ రాజధాని కోసం కొత్త బ్యారేజీ!
Published Mon, Sep 8 2014 12:31 AM | Last Updated on Sat, Sep 2 2017 1:01 PM
Advertisement
Advertisement