ద్వారకాతిరుమల: రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం దేవాదాయశాఖ నిర్ణయాన్ని సమర్ధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయడంతో ప్రముఖ ఆలయాల్లో నూతన సంవత్సర శోభ కానరావడం లేదు. అయితే ఈ విషయంపై ప్రజల్లో భిన్నాభిప్రాయాలు ఉండటంతో కొత్త ఏడాది తొలిరోజు తమ ఇష్ట దైవాలను దర్శించేందుకు భారీగా భక్తులు తరలివస్తే పరిస్థితి ఏమిటన్నది సందిగ్ధంగా మారింది. రాష్ట్రంలోని దాదాపు అన్ని ప్రముఖ ఆలయాల్లో కొత్త సంవత్సరాన్ని పురస్కరించుకుని విశేష సంఖ్యలో భక్తులు రావడం, అందుకు అనుగుణంగా అధికారులు ఏర్పాట్లు చేయడం సాధారణం.
ఆలయాన్ని సుందరీకరించడంతో పాటు, భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక క్యూలైన్లు, షామియాన పందిళ్లు వంటివి ఏర్పాటు చేసేవారు. అయితే ఈ సారి ఆ ఏర్పాట్లేమీ ఏ ఆలయంలోను కానరావడం లేదు. రాష్ట్రంలోని ప్రముఖ ఆలయాల్లో ఒకటైన ద్వారకాతిరుమల వేంకటేశ్వరస్వామి ఆలయంలో న్యూ ఇయర్ సందర్భంగా ఏటా అధికారులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసేవారు. పచ్చని తోరణాలు, అరటి బోదెలు, పుష్పమాలికలతో ఆలయం శోభాయమానంగా కనిపించేది. భక్తులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ ఫ్లెక్సీలు వంటివి ఏర్పాటు చేసేవారు.
అయితే అటువంటివేమీ ఏర్పాటు చేయొద్దని, అనవసర ఖర్చులు చేయొద్దంటూ దేవాదాయశాఖ తాజాగా నిర్ణయం తీసుకోవడంతో శ్రీవారి ఆలయంలో న్యూ ఇయర్ సందడి కనుమరుగైంది. ప్రతి ఏడాది ముక్కోటికి చేసే ప్రత్యేక ఏర్పాట్లను ఆ తరువాత వచ్చే న్యూ ఇయర్ తొలిరోజు వరకు దేవస్థానం కొనసాగించేది. ఈ సారి ఉన్నతాధికారుల ఉత్తర్వులకు లోబడి ముక్కోటికి చేసిన ఏర్పాట్లను సైతం తొలగించారు. ఇదిలా ఉంటే జనవరి 1న శ్రీవారిని దర్శించాలన్న ఉద్దేశ్యంతో ఆదివారం సాయంత్రానికే క్షేత్రానికి పెద్ద ఎత్తున భక్తులు చేరుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment