ప్రజలు ఎన్నుకున్న ఏ ప్రభుత్వమైనా వారి సంక్షేమాన్ని కాంక్షించాలి. దాని సాధించడంలో ఎదురయ్యే ప్రతిబంధకాలను అధిగమించేలా అధికారులకు ఆదేశాలు ఇవ్వాలి. అప్పుడే ఆ సర్కార్‌పై ప్రజలకు విశ్వాసం కలుగుతుంది. చంద్రబాబు సర్కారు తీరు అందుకు భిన్నంగా ఉంది. తాము అనురిస్తున్న విధానం పేదల పొట్ట కొట్టేందుకు దారి తీసినా పట్టించుకోవడం లేదు. వారి నోటికి అన్నం గిన్నె దూరమైనా చలించడం లేదు.
సాక్షి ప్రతినిధి, కాకినాడ :బినామీ రేషన్ కార్డుదారులకు చెక్ పెడతామంటూ గత నెల నుంచి జిల్లాలో అమలులోకి తెచ్చిన ఈ-పోస్ క్రియలో పేదల పొట్ట కొట్టే సరికొత్త పథకంగా మారింది. జిల్లావ్యాప్తంగా సుమారు 2,500 రేషన్ దుకాణాల పరిధిలో 15 లక్షల తెలుపు రంగు రేషన్‌కార్డులున్నాయి. వాటిలో ఎంపిక చేసిన 16 మండలాల్లోని 632 రేషన్ దుకాణాల్లో ఈ -పోస్ విధానాన్ని అమలులోకి తెచ్చారు. ఈ -పోస్ ఆ రేషన్‌దుకాణాల్లో కార్డుదారులకు శాపంగా మారి ఈ నెల 72 వేల కుటుంబాలకు పస్తులుండాల్సిన పరిస్థితి దాపురించింది. ఈ-పోస్‌లో సాంకేతిక లోపాల కారణంగా రేషన్ పంపిణీకి గడువు తొలుత ఈ నెల 15 వరకు పెంచారు. అప్పటికీ లోపాలతో రేషన్ పంపిణీ పూర్తికాకపోవడంతో ఈనెల 18 వరకు గడువు పెంచారు.
సోమవారం ఆఖరి రోజు కావడంతో రాత్రి ఏడున్నర వరకు
కార్డుదారులు సరుకుల కోసం పడిగాపులు పడుతూ రేషన్ దుకాణాల వద్ద కనిపించారు. ఈ-పోస్ అమలులో ఉన్న రేషన్‌షాపుల పరిధిలో 3,95,628 మంది కార్డుదారులుండగా, ఇప్పటి వరకు 3,23,417మంది మాత్రమే సరుకులు తీసుకున్నారు. మిగిలిన సుమారు 72 వేల మంది సరుకులకు దూరమైపోయారు. వారంతా దాదాపు సోమవారం రాత్రి వరకు ప్రతీ రోజు రేషన్‌షాపుల చుట్టూ తిరిగినవారే. ఒక్క అమలాపురం మండలంలోనే 5,120మంది కార్డుదారులకు ఈనెల రేషన్ అందకుండా పోయింది. ఈ-పోస్ అంతంతమాత్రంగా పనిచేయడంతో పూర్తిస్థాయిలో రేషన్ పంపిణీ చేయలేకపోయారు.
పడిగాపులు పడినా ప్రయోజనం లేదు..
ముందస్తు ప్రణాళికలతో ముందుకు వెళ్లకపోవడంతో తలెత్తిన సాంకేతిక లోపాల వల్ల పంపిణీలో తీవ్ర జాప్యం ఫలితంగా వేలాది మంది నిరుపేదలకు ఈ నెల రేషన్‌ను సర్కార్ దూరం చేసింది. ఈ-పోస్ విధానంలో తలెత్తిన సాంకేతిక లోపాలు (సర్వర్ డౌన్ అవడం, నెట్‌వర్క్ పనిచేయకపోవడం)తో కార్డుదారులు రేషన్ షాపుల వద్ద రోజుల తరబడి పడిగాపులు పడిన విషయం జిల్లా యంత్రాంగానికి తెలియంది కాదు. రేషన్ డీలర్లు ఎదుర్కొన్న ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. ఉదయం సరుకులు ఇవ్వడం మొదలుపెడితే రాత్రికి ఒక దుకాణంలో కనీసం పాతిక మందికి కూడా ఇవ్వలేకపోయారు. ఈ-పోస్ అమలులో సర్కార్ వైఫల్యంతో సరుకులు తీసుకోలేని కార్డుదారులు.. ఇప్పుడు తామందరికీ బినామీ కార్డుదారులనే ముద్రవేసి మొత్తంగా వారి నోట మట్టికొట్టేందుకు ఎత్తులు వేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అందని వారికి మళ్లీ పంపిణీ చేస్తారా?
ఈ-పోస్ విధానం విజయవంతమైందని చెబుతున్న అధికారులు రేషన్ తీసుకోలేకపోయిన కార్డుదారులకు ఏమని సమాధానం చెబుతారని పలువురు ప్రశ్నిస్తున్నారు. పోనీ నిలిచిపోయిన సర్వర్‌ను పునరుద్ధరించి రేషన్ తీసుకోలేని వారికి మళ్లీ సరుకులు పంపిణీ చేస్తారా అంటే ఆ ఉద్దేశం వారికి ఉన్నట్టుగా కనిపించడం లేదు. ఈ నెల ఎంత మందికి కోత వేశాం, ఎంత రేషన్ మిగిలిందనే లెక్కలు తీయడంపైనే వారికి ఎక్కువ శ్రద్ధ ఉన్నట్టు కనిపిస్తోందని బాధితులు దుయ్యబడుతున్నారు. ఏదేమైనా మానవతా దృక్పథంతో ఆలోచించి అందరికీ రేషన్ ఇప్పించాల్సిన బాధ్యత జిల్లాయంత్రాంగంపై ఉంది.
పేదల నోటికి..ఈ షాక్
Published Tue, May 19 2015 2:05 AM | Last Updated on Thu, Sep 27 2018 4:59 PM
Advertisement
Advertisement