ఆంటోనీ కమిటీని అంగీకరించం
Published Thu, Aug 15 2013 6:29 AM | Last Updated on Fri, Sep 1 2017 9:51 PM
ఒంగోలు టౌన్, న్యూస్‌లైన్: సోనియాగాంధీకి సలామ్ కొట్టే నేతలతో వేసిన ఆంటోనీ కమిటీకి ఎలాంటి చట్టబద్ధత లేదని ఎన్‌జీఓల సంఘం జిల్లా అధ్యక్షుడు అబ్దుల్ బషీర్ విమర్శించారు. ఎలా చెబితే అలా తలాడించే బసవన్నతో (గంగిరెద్దు) ఆంటోనీ కమిటీని పోలుస్తూ ఎన్‌జీఓలు బుధవారం వినూత్న రీతిలో నిరసన తెలిపారు. రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ ఎన్‌జీఓలు తలపెట్టిన సమ్మె రెండో రోజూ కొనసాగింది. తొలుత స్థానిక కలెక్టరేట్ ప్రధాన గేటు వద్ద బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. గంగిరెద్దుకు ఆంటోని కమిటీ ప్లకార్డు కట్టారు. సోనియాగాంధీ చెప్పినట్లు వినే కమిటీ ప్రజా సమస్యలను ఎలా పరిష్కరిస్తుందని విమర్శించారు. కమిటీని ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించేది లేదని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా అబ్దుల్ బషీర్ మాట్లాడుతూ రాష్ట్ర విభజన జరిగితే మొదట నష్టపోయేది ఉద్యోగులేనన్నారు. రాష్ట్ర విభజన ప్రకటనను వెంటనే విరమించుకోవాలని డిమాండ్ చేశారు. ఉద్యోగుల ప్రయోజనాలు కాపాడేందుకు ఏ త్యాగానికైనా వెనకాడేది లేదన్నారు. కేంద్రం దిగిరాకపోతే సమ్మెను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో అసోసియేషన్ కార్యదర్శి బండి శ్రీనివాసరావు, కోశాధికారి రాజ్యలక్ష్మి, వివిధ సంఘాల నాయకులు పాల్గొన్నారు.
మూతబడిన ప్రభుత్వ కార్యాలయాలు
ఉద్యోగులు చేపట్టిన సమ్మెతో జిల్లాలో రెండో రోజూ ప్రభుత్వ కార్యాలయాలు తెరుచుకోలేదు. ఉద్యోగులందరూ సమ్మె లో పాల్గొనడంతో కార్యాలయాలన్ని బోసిపోయాయి. ఎన్‌జీఓ నాయకులు కలెక్టరేట్ ప్రధాన గేటు వద్ద బైఠాయించి ఉద్యోగులను విధులకు హాజరుకావద్దని విజ్ఞప్తి చేశారు. ఆర్డీఓ, తహశీల్దార్, వ్యవసాయశాఖ, మెడికల్, గృహనిర్మాణ, ట్రెజరీ తదితర శాఖల కార్యాలయాల్లోనూ కార్యకలాపాలు స్తంభించాయి.
విద్యుత్ శాఖ సిబ్బంది నిరసన
సమైక్యాంధ్రకు మద్దతుగా విద్యుత్ ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో మధ్యాహ్న భోజన విరామ సమయంలో ఆందోళన వ్యక్తం చేశారు. కార్యాలయం ముందు నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు కేంద్రం వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎన్‌జీఓల సమ్మెకు సంపూర్ణ మద్దతిస్తున్నట్లు ప్రకటించారు. కార్యక్రమంలో జేఏసీ చైర్మన్ జయాకరరావు, కన్వీనర్ సాంబ శివరావు, తదితరులు పాల్గొన్నారు.
విద్యార్థి జేఏసీ నాయకుల అరెస్టు
రైల్‌రోకో నిర్వహించేందుకు ప్రయత్నించిన విద్యార్థి జేఏసీ నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టైయిన వారిలో విద్యార్థి జేఏసీ రాష్ట్ర కో-కన్వీనర్ రాయపాటి జగదీశ్, నాయకులు వూల వెంకటేశ్వర్లు, అశోక్, మహేష్ తదితరులు ఉన్నారు. వీరిని ఒన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. విషయం తెలుసుకున్న ఎన్‌జీఓలు పోలీస్‌స్టేషన్ వద్దకు చేరుకుని నిరసన తెలిపారు. దీంతో విద్యార్థులను వదిలేశారు. ఈ సందర్భంగా రాయపాటి జగదీశ్ మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమం సందర్భంగా రైల్‌రోకోలు చేసినా పట్టించుకోని పోలీసులు, ఇక్కడి ఉద్యమంలో ముందుగానే అదుపులోకి తీసుకోవడం అన్యాయమన్నారు. అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరని స్పష్టం చేశారు.
Advertisement