విద్యార్థినితో అసభ్యకరంగా ప్రవర్తించిన ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడిని పోలీసులు శుక్రవారం నిర్భయ చట్టం కింద అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
హైదరాబాద్, న్యూస్‌లైన్: విద్యార్థినితో అసభ్యకరంగా ప్రవర్తించిన ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడిని పోలీసులు శుక్రవారం నిర్భయ చట్టం కింద అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. మీర్‌చౌక్ ఎస్సై బుచ్చయ్య తెలిపిన వివరాల ప్రకారం... మొఘల్‌పురా ఖాజాకా చిల్లా ప్రాంతానికి చెందిన హఫీజ్ మహ్మద్ సాబేర్ పాషా (39) దారుషిఫా ప్రభుత్వ ఉర్దూ మీడియం ఉన్నత పాఠశాలలో గత 10 ఏళ్లుగా అరబిక్ ఉపాధ్యాయునిగా పని చేస్తున్నాడు.
కాగా ఇదే పాఠశాలలో ఎనిమిదవ తరగతి చదువుతున్న 13 ఏళ్ల విద్యార్థినితో పాషా శుక్రవారం తరగతి గదిలో అసభ్యకరంగా ప్రవర్తించాడు. దీంతో తీవ్ర మనస్థాపం చెందిన విద్యార్థిని విలపిస్తూ కుటుంబ సభ్యులకు జరిగిన విషయం చెప్పడంతో అక్కడికి చేరుకొన్న కుటుంబ సభ్యులు ఉపాధ్యాయుడిని చితకబాది మీర్‌చౌక్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు సాబేర్ పాషాను అరెస్టు చేశారు.