భువనగిరి, న్యూస్‌లైన్
దసరా, దీపావళి పండగల సందర్భంగా పేద ప్రజలకు నిత్యావసరాల వస్తువుల అదనపు కోటా ఇచ్చే పరిస్థితి కన్పించడం లేదు. ఆకాశాన్నంటుతున్న ధరలతో పేద మధ్యతరగతి ప్రజలు పండగల వేళ నిత్యావసర వస్తువులు కొనుగోలు చేయాలంటే ఇబ్బందులు పడుతున్నారు. పిండి వంటల తయారీకి అవసరమైన చక్కెర, మంచినూనె కోసం అదనంగా డబ్బులు చెల్లించాల్సిన పరిస్థితి రావడంతో సామాన్యజనం అవస్థలు పడుతున్నారు. అయితే సీఎం అత్యంత ప్రతిష్టాత్మకంగా మొదలు పెట్టిన అమ్మహస్తం సరుకులు అందడమే లేదు.ప్రతి వినియోగదారుడికి 9 రకాల సరకులను అందిస్తామని చెప్పిన ప్రభుత్వం జిల్లాలోని లబ్ధిదారులకు ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ఆ సరుకులను సరఫరా చేయలేకపోయింది. కనీసం పండగల వేళ కూడా వారికి అవసరమైన పప్పు,పంచదార, పామోలిన్‌ను అదనంగా సరఫరా చేయాలని ప్రజలు కోరుతున్నారు. అయితే ఇంతవరకు ప్రతి నెలా ఇచ్చే సరుకులనే సరఫరా చేయలేకపోయింది. గతంలో మాదిరిగా అదనపు పంచదారను సరఫరా చేయడానికి ప్రభుత్వం ఇంతవరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.
ఒక్కో కార్డుపై ఇస్తున్న అరకిలోకు అదనంగా మరో అర కిలో చక్కెర ఇచ్చేవారు. తెలంగాణ ప్రాంతంలో పెద్దఎత్తున జరుపుకునే దసరా పండగకు, ఆ తర్వాత వచ్చే దీపావళికి అదనపు సరుకులు ఇవ్వాలని ప్రజలు కోరుతున్నారు. అయితే గతంలో ప్రభుత్వం దీపావళి పండగకు ఒక్కో రేషన్ కార్డుపై అర కిలో చక్కెరను అదనంగా ఇచ్చే వారు. ఈ సారి మాత్రం అదనం మాట ను అధికారులు మర్చిపోయారు. ఒక వేళ ఇవ్వాలనుకుంటే ఈ పాటికే డీలర్లకు సివిల్ సప్లై అధికారులు ఆదేశాలు జారీ చేసి అదనపు కోటాకు డీడీలు తీయమని చెప్పేవారు. కాని అలాంటి ఆదేశాలు రాలేదని డీలర్లు చెబుతున్నారు.ఏదేమైనా ప్రధాన పండగలకు అదనపు సరుకుల జాడే లేకుండా పోయింది.
పండగకు అదనపు సరుకులు లేనట్టే
Published Wed, Oct 2 2013 2:31 AM | Last Updated on Mon, Jul 29 2019 6:03 PM
Advertisement