
'ఆంధ్రప్రదేశ్ రాజధానిపై ఇంకా స్పష్టత రాలేదు'
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ రాజధానిపై ఇంకా స్పష్టత రాలేదని ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి తెలిపారు. రాజధాని ఎక్కడనేది రోజుకొక ప్రాంతం తెరమీదకు వస్తోందని ఆయన బుధవారమిక్కడ అన్నారు. నూతన రాజధాని నిర్మాణానికి స్థలం అందుబాటులో ఉందని, అయితే ఒకేచోట ఎక్కువ స్థలం లేదని కేఈ పేర్కొన్నారు.
భూ సేకరణ ప్రస్తుతం పెద్ద సమస్యగా మారనుందని, ప్రభుత్వం, రైతుల మధ్య 55:45 ప్రతిపాదన ద్వారా భూ సేకరణ చేయాలనే ఆలోచన ఉందని కేఈ కృష్ణమూర్తి తెలిపారు. రాజధానితో పాటు ఏడు స్మార్ట్ సిటీలకు అమలు చేయాలనుకుంటున్నట్లు ఆయన చెప్పారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో రిజిస్ట్రేషన్ల ఆదాయం బాగా తగ్గిందని కేఈ వెల్లడించారు. రాష్ట్రానికి ఆదాయం పెంచే విధంగా భూములను తీర్చిదిద్దుతామని, రైతులకు, ప్రజలకు మేలు కలిగేలా ప్రణాళిక రూపొందిస్తున్నామని వివరించారు.