
పరిహారం... పరిహాసం
- ‘పుష్కర’ తొక్కిసలాట బాధితులకు ఇంకా అందని పరిహారం
- గాయపడింది 51 మంది,, పరిహారం ఇచ్చింది 30 మందికే
- బాధితులు, న్యాయవాదుల విజ్ఞప్తులు పట్టించుకోని ప్రభుత్వం
- రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు
- పొంతన లేని పోలీసు, రెవెన్యూ అధికారుల లెక్కలు
- ఆరుగురికే అందిన కేంద్ర సాయం
సాక్షి, రాజమహేంద్రవరం: తన ప్రచార యావ కోసం 28 మంది మృతికి కారణమైన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున సహాయం చేయడంలో తీవ్ర నిర్లక్ష్యం చూపుతున్నారు. గోదావరి పుష్కరాల మొదటి రోజు 2015 జూన్ 14న తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని పుష్కరఘాట్‌లో తొక్కిసలాట జరిగిన విషయం తెలిసిందే. ఇందులో 27 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా మరో వ్యక్తి చికిత్స పొందుతూ ఆస్పత్రిలో మరణించారు.
ఈ ఘటనలో పోలీసులు లెక్కల ప్రకారం 51 మంది గాయపడ్డారు. వీరిలో మొదటగా 28 మందికి రూ.25 వేల చొప్పున 2015లో ప్రభుత్వం నష్ట పరిహారం అందించింది. న్యాయవాదులు, ప్రజాప్రతినిధుల పోరాటం చేయడంతో మరో ఇద్దరికి ఇచ్చారు. ఇంకా మిగిలిన 21 మందికి ఇప్పటివరకు నష్టపరిహారం ఇవ్వలేదు. దీనిపై బాధితులు ఎన్నిసార్లు ప్రభుత్వానికి మొరపెట్టుకున్నా ప్రభుత్వ పెద్దలు కరుణించడం లేదు. బాధితుల తరఫున రాష్ట్ర మానవహక్కుల సంఘం అధ్యక్షుడు ముప్పాళ్ల సుబ్బారావు.. జిల్లా కలెక్టర్‌ను పలుమార్లు కలసినా, లేఖలు రాసినా ఎలాంటి స్పందన లేదు. దీంతో ఆయన రాష్ట్ర మానవ హక్కుల సంఘాన్ని ఆశ్రయంచారు. గోదావరి పుష్కరాల సమయంలో పుష్కరఘాట్‌లో జరిగిన తొక్కిసలాటలో గాయపడిన వారిలో 21 మందికి నష్టపరిహారం ఇవ్వలేదని పిటిషన్ దాఖలు చేశారు. విచారించిన మానవ హక్కుల సంఘం తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్‌కు సమన్లు జారీ చేసింది. ప్రస్తుతం కేసు విచారణలో ఉంది. తాజాగా పుష్కరాల నుంచి ఉన్న జిల్లా కలెక్టర్ హెచ్.అరుణ్‌కు మార్ బదిలీపై వెళ్లిపోయారు. కొత్త కలెక్టర్ కార్తికేయ మిశ్రా వచ్చారు.
అధికారుల మధ్య సమన్వయలోపం...: గాయపడ్డవారిని లెక్కించడంలో పోలీసు, రెవెన్యూ అధికారుల మధ్య సమన్వయ లోపం వారి నిర్లక్ష్యానికి నిదర్శనంగా మారింది. పోలీసుల లెక్కల ప్రకారం గాయపడ్డవారు 51 మంది, వీరిలో ఇప్పటికి 30 మందికి నష్టపరిహారం చెల్లించారు. ఇక రెవెన్యూ అధికారులు గాయపడ్డవారు ఆరుగురే అంటూ కేంద్ర ప్రభుత్వానికి లెక్కలు పంపించారు. కేంద్రం ఆ ఆరుగురికే రూ.50 వేల చొప్పన పరిహారం అందజేసింది. రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యం వల్ల గాయపడ్డవారిలో 45 మంది కేంద్రం నుంచి వచ్చే రూ.50 వేల నష్టపరిహారం కోల్పోయారు.
సమన్వయలోపం స్పష్టమవుతోంది...: పుష్కరాల నిర్వహణలో శాఖల మధ్య సమన్వయలోపం స్పష్టంగా కనపడుతోంది. పోలీసు, రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యంతో గాయపడ్డవారికి తీవ్ర నష్టం జరిగింది. ఎంతమంది గాయపడ్డారు? వారి పరిస్థితి ఏమిటన్న వివరాలు సేకరించలేకపోతే ఎలా? ఈ ఒక్క ఘటనతో పుష్కరాలు ఎలా నిర్వహించారో తెలుస్తోంది. ఇప్పటికైనా గాయపడ్డవారికి పూర్తిగా నష్టపరిహారం ఇవ్వాలి. కేంద్రప్రభుత్వ సాయం అందేలా చూడాలి. – ముప్పాళ్ల సుబ్బారావు, మానవ హక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు
పాలకులకు బుద్ధి లేదు: చంద్రబాబునాయడు ప్రచారార్భాటం వల్ల 28 మంది ప్రాణాలు కోల్పోయారు. 51 మంది గాయపడ్డారు. తన తప్పు వల్ల ఇన్ని కుటుంబాలు నష్టపోయాయి. ఎంత నగదు ఇచ్చినా వారిని తీసుకురాలేము. గాయపడ్డవారు ఎలా ఉన్నారో ప్రభుత్వం తెలుసుకోలేదు. కనీసం వారందరికీ పరిహారం ఇవ్వాలన్న ధ్యాస కూడా లేకపోవడం సిగ్గుచేటు. పాలకులు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని గాయపడ్డవారికి నష్ట పరిహారం ఇవ్వాలి. – జక్కంపూడి విజయలక్ష్మి, న్యాయవాది, బాధితుల తరఫు అఫిడవిట్‌దారు
ప్రభుత్వ లెక్కల ప్రకారం గాయపడ్డవారిలో ఇంకా పరిహారం అందని బాధితులు
1. హనుమన్‌శెట్టి అనంతరావు, సింహాచల్‌నగర్, రాజమహేంద్రవరం
2. హనుమన్‌శెట్టి సత్యవతి, సింహాచల్‌నగర్, రాజమహేంద్రవరం
3. నడిమిపల్లి బుచ్చి వెంకాయమ్మ, అల్లవరం,తూర్పుగోదావరిజిల్లా
4. పల్లప్రోలు విజయలక్ష్మి, కొండుబట్లపాలెం, గుంటూరు జిల్లా
5. బి.సత్యవతి, పెందుర్తి, విజయనగరం
6. కె.జానకి, శ్రీకాకుళం
7. ఎం.తులసి, రాజానగరం, తూర్పుగోదావరి జిల్లా
8. బి.సూర్యవతి, రాజమహేంద్రవరం
9. వి.భాగ్యవతి, ధవళేశ్వరం, తూర్పుగోదావరి జిల్లా
10. బి.సింహాచలం, పెందుర్తి, విజయనగరం జిల్లా
11. ఎం.పాపమ్మ, విశాఖపట్నం
12. జి.ఇందిరా కుమారి, ప్రకాశం
13. పి.రమాదేవి, రాజాం
14. వీరప్పరెడ్డి
15. బి.ఇందిర
16. బి.లక్ష్మి, విశాఖపట్నం
17. రమణమ్మ, నెల్లూరు
18. పి.కృష్ణమూర్తి, హైదరాబాద్
19. కె. అబ్బులు, అన్నదేవరపేట
20. సీహెచ్,దుర్గారావు, కొవ్వూరు
21. పి.భద్రరావు, రాజమహేంద్రవరం.