వర్జీనియాకు వాతావరణం ‘పొగ’
ఎదుగుదల లేని పొగాకు మొక్క
గతేడాది మంచి ధర రావడంతో
పెరిగిన సాగు విస్తీర్ణం
చల్లటి వాతావరణంతో రైతుల్లో ఆందోళన
ధర పలకదంటూ పొగాకు బోర్డు హెచ్చరిక
సాక్షి ప్రతినిధి, ఏలూరు : గతేడాది పొగాకు ఊహించని ధర పలికింది. ఈసారీ అదే విధంగా వస్తుందనే ఆశతో రైతు దాని సాగుపై ఎక్కువ మక్కువ చూపాడు. అయితే అనుకూలించని వాతావరణ పరిస్థితుల కారణంగా మొక్క ఎదుగుదల లేక పొలాల్లోనే పంట ‘పొగబారి’ పోయేలా కన్పిస్తోంది. దిగుబడి తగ్గుతుందనే ఆందోళన ఒకవైపు, ఈసారి ధర అంతగా రాదనే పొగాకు బోర్డు హెచ్చరికలు మరోవైపు రైతులను కుంగదీస్తున్నాయి. పశ్చిమగోదావరి జిల్లాలోని మెట్ట ప్రాంతమైన గోపాలపురం, దేవరపల్లి, నల్లజర్ల, జంగారెడ్డిగూడెం, కొయ్యలగూడెం తదితర మండలాల్లో ఉత్తర తేలిక పాటి నేలల్లో (ఎన్‌ఎల్‌ఎస్) అత్యంత నాణ్యమైన వర్జీనియా పొగాకు పండుతుంది. తూర్పుగోదావరి జిల్లాలోని రంగంపేట, తొర్రేడు ప్రాంతాల్లోనూ వర్జీనియా పొగాకు సాగు చేస్తారు. ఇక్కడ సాగయ్యే పొగాకు పంటకు అంతర్జాతీయ మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉంటుంది. కాగా, మరోవైపు సాగు విస్తీర్ణం పెరగడంతో గత ఏడాది స్థాయిలో ధర రాదని పొగాకు బోర్డు హెచ్చరించడం రైతులను ఇంకా కుంగదీస్తోంది. ఈ ఏడాది 80 వేల ఎకరాల్లో సాగుకే బోర్డు అనుమతించింది. అంటే 54 మిలియన్ టన్నుల ఉత్పత్తికి ఆమోదం తెలిపింది. అయితే సాగు విస్తీర్ణం పెరగడంతో 62 టన్నుల ఉత్పత్తి వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇంత పంటను కొనుగోలు చేయటం సాధ్యం కాదని, అనుమతిచ్చిన మేరకే పంటను కొనుగోలు చేస్తామని బోర్డు అధికారులు స్పష్టం చేస్తున్నారు. దిగుబడి తగ్గిపోయే పరిస్థితుల్లో ఉత్పత్తి ఆ స్థాయికి చేరదని రైతులు వాదిస్తున్నారు.
మొక్క పెరగలేదు
మంచు కురవడం, మబ్బులు కమ్ముకోవడం వల్ల మొక్కలు సరిగా పెరగలేదు. దిగుబడి వచ్చేలా లేదు. పండిన దానికి మంచి రేటు దక్కుతుందో లేదో తెలియడంలేదు. చాలా పెట్టుబడి పెట్టా. రేటు రాకపోతే అప్పులపాలవుతా.
- నల్లజర్ల రైతు రామకృష్ణ
గత ఏడాది.. ఈ ఏడాది ..
ఎన్నడూ లేని విధంగా గతేడాది వర్జీనియా పొగాకు ధర అనూహ్యంగా పెరిగింది.
కిలో రూ.150-160 ఉండే ధర రైతులు ఊహించని రీతిలో రూ.195కు చేరింది.
దీంతో ఈ ఏడాది కూడా అదే పరిస్థితి ఉంటుందనే అంచనాతో అధికంగా పొగాకు సాగు చేశారు.
వాస్తవానికి పొగాకు బోర్డు ఇచ్చిన అనుమతి మేరకే ఈ పంటను సాగు చేయాల్సి ఉంది.
అనుమతి లేకుండా సాగుచేసిన పంటను బోర్డు కొనుగోలు చేయదు.
అయితే ధర వస్తుందనే ఆశతో రైతులు ఎక్కువ విస్తీర్ణంలో సాగు ప్రారంభించారు.
పశ్చిమగోదావరి జిల్లాలో ఈ ఏడాది లక్ష ఎకరాల్లో సాగు చేశారు.
తూర్పుగోదావరిలో 2,200 ఎకరాల్లో సాగుచేశారు.
పంట పరిస్థితి ఎలా ఉంది..
చల్లటి వాతావరణం రైతుల ఆశలను నీరుగార్చేసింది.
పొగాకు పంటకు పగలు ఎండ,రాత్రి ఉక్కపోత వాతావరణం అనుకూలం.
రెండు నెలల నుంచి పగలు ఎండ తక్కువగా, వాతావరణం మబ్బులతో ఉంటోంది.
చలిగాలులు కూడా ఎక్కువగా వీస్తున్నాయి. మంచు బాగా కురుస్తోంది.
మొక్కలు గిడసబారిపోవడంతోపాటు చీడల బాధ కూడా ఎక్కువైంది.
ఆకు మందంగా ఉంటేనే బరువు ఎక్కువగా తూగుతుంది.
{పస్తుతం ఆకు పల్చబడి తేలిగ్గా ఉండడంతో దిగుబడి తగ్గిపోయే ప్రమాదం ఏర్పడింది.