రోల్‌బ్యాక్ పింఛన్లలో కోత | No pensions from 7 months to Beneficiary | Sakshi
Sakshi News home page

రోల్‌బ్యాక్ పింఛన్లలో కోత

Published Sun, May 3 2015 5:08 AM | Last Updated on Sun, Sep 3 2017 1:18 AM

No pensions from 7 months to Beneficiary

- ఏడు నెలల బకాయిలు
- ఒక నెలతో సరిపెట్టేసిన అధికారులు
- ఉసూరుమంటున్న 2వేలమంది లబ్ధిదారులు
విజయవాడ సెంట్రల్ :
రోల్‌బ్యాక్ (వివిధ కారణాల వల్ల ఆపేసిన పెన్షన్‌దారులకు తిరిగి పింఛన్ ఇవ్వడం) పింఛన్లలో ప్రభుత్వం కోతపెట్టింది. ఏడు నెలలుగా పింఛన్ల కోసం కాళ్లరిగేలా తిరుగుతున్న లబ్ధిదారులకు ఒకనెల పింఛన్ చేతిలో పెట్టి పొమ్మంది. దీంతో పెన్షన్‌పైనే ఆశలు పెట్టుకున్నవారు లబోదిబోమంటున్నారు. 2,081 మందికి రోల్‌బ్యాక్ పింఛన్లు రావాల్సి ఉండగా 1,999 మందికి శనివారం మంజూరు చేశారు. నగరపాలక సంస్థ పరిధిలోని 59 డివిజన్లలో గత ఏడాది అక్టోబర్ వరకు 35,550 మంది సామాజిక పింఛన్లు అందుకునేవారు.

ఐదు రెట్లు భరోసా పేరుతో పింఛన్లను పెంచుతూ సర్కార్ సవాలక్ష ఆంక్షలు విధించింది. పరిశీలన పేరుతో డివిజన్ కార్పొరేటర్ అధ్యక్షతన ఆరుగురు సభ్యుల కమిటీని ఏర్పాటుచేసింది. పింఛన్లు అందుకునేందుకు ని‘బంధన ’ల పేరుతో సుమారు ఏడువేల పింఛన్లను ఏరిపారేసింది. దీనిపై విపక్షాల ఆందోళనతో పాటు స్వపక్ష కార్పొరేటర్ల నుంచి ఒత్తిడి రావడంతో ఐదువేల మందికి పింఛన్లు మంజూరు చేసేందుకు పచ్చజెండా ఊపింది. కమిటీ ముందు హాజరై తమ అర్హతను నిరూపించుకోలేదనే సాకుతో 2,081 మంది పింఛన్లను నిలుపుదల చేశారు.  

చేతులెత్తేశారు..!
అన్ని అర్హతలు ఉన్నా పింఛన్లు అందకపోవడంతో లబ్ధిదారుల్లో ఆందోళన మొదలైంది. మొదట్లో రోజూ తెల్లవారేసరికి సంబంధిత కార్పొరేటర్ల ఇళ్ల ముందు వాలిపోయేవారు. పింఛన్లు ఇప్పించమంటూ వేడుకోలు మొదలుపెట్టేవారు. ఈ నేపథ్యంలో పాలక, ప్రతిపక్ష కార్పొరేటర్లు ఫిబ్రవరి 9న జరిగిన కౌన్సిల్ సమావేశంలో అర్బన్ కమ్యూనిటీ డెవలప్‌మెంట్ అధికారులను గట్టిగా నిలదీశారు.

ప్రభుత్వం వద్దే పెండింగ్ ఉందని చెప్పిన అధికారులు బకాయిలతో సహా పింఛన్లు చెల్లిస్తామని చెప్పుకొచ్చారు. ఇదే విషయాన్ని కార్పొరేటర్లు లబ్ధిదారులకు వివరించారు. తాజాగా ప్రభుత్వం ఒక నెల మాత్రమే రోల్‌బ్యాక్ పింఛన్లు మంజూరుచేసి చేతులు దులుపుకొంది. రాష్ట్రవ్యాప్తంగా 83వేల రోల్‌బ్యాక్ పింఛన్లు చెల్లించాల్సి ఉండటంతో పాత బకాయిల విషయంలో ప్రభుత్వం చేతులెత్తేసిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

అంతా గందరగోళమే..
పింఛన్ల పంపిణీపై ప్రభుత్వం ఆది నుంచి గందరగోళం సృష్టిస్తోంది. సామాజిక పింఛన్లు రూ.200 ఇచ్చే సమయంలో 35,550 మంది లబ్ధిదారులు ఉండగా, రూ.1000, రూ.1,500 చేసిన సందర్భంలోనూ అంతమందే ఉన్నారు. అంటే లబ్ధిదారులందరూ అర్హులేనని లెక్కతేలింది. నిబంధనల సాకుతో ఐదువేల మందికి మూడు నెలలు, రెండువేల మందికి ఏడు నెలల చొప్పున కొర్రీ పెట్టారు.

ప్రభుత్వం చేసిన తప్పుకు లబ్ధిదారులు పింఛన్లు కోల్పోయారన్న విషయం నిర్ధారణ అయింది. పంపిణీకి సంబంధించి పోస్టాఫీసులు, బ్యాంక్‌ల చుట్టూ తిప్పిన ప్రభుత్వం తాజాగా మాన్యువల్ పద్ధతిలో ఇళ్ల వద్దే పింఛన్లు పంపిణీ చేస్తోంది. ఇంతటి దానికి ఇంత హంగామా అవసరమా అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement